పోలవరం ప్రాజెక్టు పై నిపుణుల కమిటీ సూచనలు

 


చంద్రబాబుకు కష్టాలు


పోలవరంపై నిపుణుల కమిటీ కీలక సూచనలు....


పోలవరం ప్రాజెక్టులో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ మేరకు గత ప్రభుత్వం  చేసుకొన్న ఒప్పందాలను రద్దు చేయాలని  సిఫారసు చేసింది.  రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిపుణుల కమిటీ  ప్రభుత్వానికి సూచించింది.


ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన  తర్వాత  పోలవరం ప్రాజెక్టులో అవకతవకలను తేల్చేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ బుధవారం నాడు నివేదికను ఇచ్చింది.


పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ కి వేల కోట్ల రూపాయాలు లబ్ది కలిగేలా చంద్రబాబు సర్కార్ ప్రయత్నించిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కు ముందుగానే డబ్బుల చెల్లింపులపై కూడ నిపుణుల కమిటీ తప్పు బట్టింది.


మరో వైపు పోలవరం ఎడమ, కుడి కాలువల అంచనాల పెంపు కూడ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. త్వరగానే పనులను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో విపరీతంగా అంచనాలను పెంచడాన్ని కూడ నిపుణుల కమిటీ తప్పుబట్టిన సమాచారం.


గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై చేసుకొన్న ఒప్పందాలను రద్దు చేయాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే రివర్స్ టెండరింగ్ కు కూడ కమిటీ సిఫారసు చేసింది. అయితే  అదే సమయంలో రివర్స్ టెండరింగ్ కు విషయంలో  కేంద్రం ఇరిగేషన్ శాఖ అనుమతిని తీసుకోవాల్సి వస్తోందా అనే విషయమై నీటి పారుదల శాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.