కృష్ణా నదికి వరద నీరు

 


గుంటూరు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. జలాశయాలన్నింటినీ నింపుకుంటూ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలకళను సంతరించుకున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా నాగార్జునసాగర్‌ గేట్లన్నీ ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మరో రెండురోజుల పాటు వరద కొనసాగే అవకాశముంది. మరోవైపు పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి.


శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి


కృష్ణమ్మకు తుంగభద్ర తోడవ్వడంతో శ్రీశైలం జలాశయానికి 8.66 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం నుంచి 8.68 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా.. ప్రస్తుత నిల్వ 182.99 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయం 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు.


గరిష్ఠ నీటిమట్టానికి సాగర్‌


శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో కృష్ణానదిపైనే అతిపెద్దదైన నాగార్జున సాగర్‌ జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరువైంది. సాగర్‌కు 8.35 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..5.32 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులు తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 262.9 టీఎంసీలకు చేరింది. దీంతో పదేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ 26 గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


జలదిగ్బంధంలో ముంపు గ్రామాలు


నాగార్జునసాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వసామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.94 టీఎంసీలుగా ఉంది. సాగర్‌ నుంచి పులిచింతలలోకి 4.46 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా..17 గేట్లద్వారా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగే కొద్దీ.. ముంపు ప్రాంతాలు జలదిగ్బంధమవుతున్నాయి. ఇప్పటికే గోపాలపురం, బోధన్, చిట్యాల తండా, కొల్లూరు, పులిచింతల గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు.


బెజవాడలో జలకళ


ఎగువ పులిచింతల నుంచి 
 ప్రవాహం అధికంగా ఉండటంతో కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది. తొలుత  నీటి మట్టం 12 అడుగులకు చేరితే గేట్లు తెరవాలని అధికారులు భావించినప్పటికీ వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల లంకగ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 2.5 టీఎంసీల నిల్వ ఉంది.  ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద కారణంగా పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశారు. నదీతీరం వెంట వరద ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి 1998, 2000 సంవత్సరాల్లో భారీ వరద వచ్చింది