జగన్ ప్రభుత్వం డైలామా..?

ఇప్పుడేమి చేయడం… జగన్ ప్రభుత్వం డైలామా..?


ఆ అక్రమాలు వైఎస్ హయాంలోనే…


ప్రజావేదిక అక్రమ నిర్మాణం అంటూ రాత్రికి రాత్రి కూల్చేసిన ముఖ్యమంత్రి జగన్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రజావేదికతో మొదలుపెట్టి అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతున్నాయి. కృష్ణా తీరం మొత్తం ఎలా ఆక్రమణలకు గురైందో బీజేపీ సహా ఏయే పార్టీలకు చెందిన నేతలు ఎలా ఆక్రమించారో తెలిసిందే. ఇప్పుడవన్నీ జగన్ సర్కారుకు గుది బండలయ్యాయి. వీటి మాదిరే ఇప్పుడు గోదావరి తీరంలో జరిగిన అక్రమాలు సరికొత్త సవాలు తెచ్చి పెట్టాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటిగట్లు, గోదావరి తీరం అనేకచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి.


1854నాటి నదీ పరిరక్షణ (రివర్‌ కన్జర్వేషన్‌) చట్టం ప్రకారం నదీ పరివాహక ప్రాంతం, ఏటిగట్లపై ఎటువంటి పక్కా భవనాలు నిర్మించకూడదు. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత నేపథ్యంలో ఇక్కడి నిర్మాణాల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది.వీటిలో ఎక్కువ భాగం 2003-2006 మధ్య నిర్మించినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడే అన్నమాట. అఖండ గోదావరిలో అనేక కట్టడాలు నిర్మించారు. గౌతమ ఘాట్‌లో ఇస్కాన్‌ టెంపుల్‌ పేర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని లీజుకు తీసుకున్నారు. కానీ ఇవాళ పెద్ద గుడి, పెద్ద గోపురం నిర్మించారు. ఇదే ప్రాంతం లో బొమ్మన రామచంద్రరావు చాంబర్‌ కల్యాణ మం డపం నిర్మించారు. దానికి సమీపంలో అయ్యప్ప గుడి ఉంది. మరోపక్క టూరిజం అధికారిక భవనం ఉంది. సరస్వతి ఘాట్‌లో జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మిస్తున్నారు. ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో భారీ కైలాస భూమి నిర్మించారు. ఇందులో శివాలయం, ఐదు గోపురాలు నిర్మిస్తున్నారు. ధవళేశ్వరం సమీపంలో గోదావరికి ఏటిగట్టు నది ఒడ్డుకు ఎస్‌కే రివేరా అనే హోటల్‌, లాడ్జి ఉంది. ఇది ఇరిగేషన్‌ లీజు స్థలం. చాలా కాలం క్రితం ఒక ఆసామి ఇక్కడ వైద్య సంబంధిత మొక్కలు పెంచుతామని లీజుకు తీసుకున్నారు. కానీ ఇవాళ లాడ్జి, హోటల్‌ నిర్వహిస్తున్నారు.ఇక తూర్పు గోదావరి జిల్లా గోదావరి తీరంలో ఏటిగట్టుమీద, నదుల పక్కన సుమారు 100 గుళ్లు, చర్చిలు, ఇతర కట్టడాలు ఉన్నాయి. ఇరిగేషన్‌ నుంచి వీటికి ఎటువంటి అనుమతులు లేవు. కొన్ని చోట్ల శ్మశానవాటికకు వచ్చేవారికి విశ్రాంతి భవనాలు వంటివి నిర్మించారు. బెండమూర్లంకలో అంబేడ్కర్‌ విగ్రహం, సఖినేటిపల్లిలో చర్చి నిర్మించారు. వీటిల్లో 15 ఏళ్ల నుంచి ఉన్నవే ఎక్కువ. కొత్తగా కూడా వివిధ వ్యాపార సంస్థలు, నివాస భవానాలు కూడా నిర్మిస్తున్నారు. ప్రఖ్యాతిగాంచిన అప్పనపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఏటిగట్టుకు, గోదావరికి మధ్యలోనే ఉంది. సుప్రీంకోర్టు 2006లో ఇచ్చిన ఆదేశం ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలూ చేయకూడదు. ఈ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తుండటంతో కొత్తగా కూడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. దిండిలో రిసార్ట్స్‌ నిర్మించి టూరిజం బిజినెస్‌ చేస్తున్నారు. దీని సమీపంలోనే రామరాజులంకలో ఒకాయన ఇరిగేషన్‌ స్థలాన్ని వైద్య సహాయం పేరిట లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో నదీ కరకట్టకు (ఏటిగట్టు) నదికి మధ్య అనేక గ్రామాలు వెలిశాయి. రెండు నదీపాయల మధ్య కూడా గ్రామాలు చాలా కాలంగా ఉన్నాయి.


ఇక్కడ పక్కా భవనాలు, గుళ్లు, పాఠశాలలు నిర్మించారు. ఇందులో సఖినేటిపల్లిలంక, శివాయలంక, పెదపట్నం, అప్పనపల్లి, పెదపట్నంలంక, దొడ్డవరం, అయోధ్యలంక, కనకాయలంక, లంకలగన్నవరం, ఏనుగుపల్లిలంక వంటి అనేక గ్రామాలు గోదావరి పాయల మధ్యే ఉన్నాయి. ప్రతీఏటా వరదల సమయంలో ఈ గ్రామాలన్నీ మునిగిపోవడం, జనాలను తరలించడం మామూలైపోయింది. ప్రతీఏటా ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గ్రామాల్లో వేలాది మంది జనం ఉన్నారు. ఇక, గోదావరి తీరంలోను, సముద్ర తీరంలోను అనేక రొయ్యల చెరువులు విస్తరించాయి. గోదావరికి నదికి కొన్ని మీటర్ల దూరం వరకు ఎటువంటి ఆక్వాకల్చర్‌ ఉండకూడదన్న నిబంధన ఉన్నా, ఈ చెరువులు తవ్వారు. ఇప్పుడు వీటి విషయంలో సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.