విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుతో సోమవారం భేటీ అవుతున్నట్లు ఆ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మీడియా మాత్రం రకరకాల కథనాలు ప్రచారం చేస్తోందన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఉమను టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న శనివారం కలిశారు. గంటసేపు చర్చలు జరిగాయి. చంద్రబాబు సూచనల మేరకే వెంకన్న ఆయనతో సమావేశమయ్యారు. టీడీపీ కాపులకు ఎలాంటి గుర్తింపు ఇచ్చిందో వివరించారు. వైసీపీ రెండు నెలల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్తే భవిష్యత్ ఉండదని చెప్పారు. అనంతరం వెంకన్న విలేకరులతో మాట్లాడారు. బొండా ఉమ పార్టీ మారరని, టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.