ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం - విరసం

 ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకంహిందూ ఉగ్రవాదుల దుర్మార్గానికి పరాకాష్ట కశ్మీర్‌ విభజన
స్వతంత్య్ర దేశం కోసం కశ్మీరీలు  చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుదాం
~
 హిందూ టెర్రరిస్టు రాజ్యం కశ్మీర్‌ను కబళించింది. దశాబ్దాల కశ్మీరీ ప్రజల స్వతంత్య్ర పోరాటంపై ఉక్కు పంజా విసిరింది. రాజ్యాంగబద్ధమైన 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. కశ్మీర్‌ను మూడు ముక్కలు చేసి కశ్మీరియత్‌ సంస్కృతిని, జీవన విధానాన్ని తుడిచి పెట్టేసే కుట్రకు పాల్పడింది. ఏనాడూ భారతదేశంలో భాగం కాని ఒక దేశాన్ని శాశ్వతంగా తన బందెలదొడ్డిలో కట్టేసుకోవాలనుకుంటోంది.  కశ్మీర్‌ ప్రజల స్వప్నాలను కాలరాచి, లక్షలాది మంది త్యాగాలను రద్దు చేయాలనుకుంటోంది. భారత రాజ్యాంగంలోంచి వేరు చేయడానికి వీల్లేని అతి మౌలికమైన 370ని కేంద్రంలోని బిజెపి ఫాసిస్టు ప్రభుత్వం తన మెజారిటీ పశుబలంతో రద్దు చేస్తూ ఇవాళ (5 ఆగస్టు) క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏమైనా మంచి మిగిలి ఉంటే అది ఈ రోజుతో పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. భారత రాజ్యం తన దురాక్రమణ స్వభావాన్ని అధికార మార్పిడి నుంచీ చాటుకుంటూ వచ్చింది. నెహ్రూ కాలం నుంచి కశ్మీర్‌ జాతి, ఈశాన్య జాతుల స్వాతంత్య్ర కాంక్షను నెత్తురుటేర్లలో ముంచుత్తుతూ వచ్చింది. లక్షలాది మందిని హత్య చేసి  అఖండ భారత్‌ పేరుతో జాతుల బందీఖానాను నిర్మిస్తూ వచ్చింది. ఈ మొత్తం దుర్మార్గానికి పరాకాష్ట కశ్మీర్‌ విభజన. 


 కశ్మీర్‌ను కబళించే కుట్ర దశాబ్దాల కింద కాంగ్రెస్‌ ఆరంభించింది. దీన్ని మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. గత వారం పది రోజుల్లో జరిగినట్లు కనిపిస్తున్న పరిణామాలకు వెనుక బిజెపి ప్రభుత్వం చాలా రోజుల నుంచి సన్నాహాలు చేస్తూ వచ్చింది.  గతవారం లోక్‌ సభలో ఉపా చట్టానికి మరింత ప్రమాదకరమైన కోరలు పదునుపెడుతూ సవరణలు తీసుకొచ్చింది. హిందూ బ్రాహ్మణీయ ఉగ్రవాదానికి రాజకీయ ప్రతినిధి అయిన బిజెపి కశ్మీర్‌ ప్రజల్ని ఉగ్రవాదులుగా చిత్రిస్తూ అణచివేయడానికే ఈ దుర్మార్గమైన చట్టాన్ని మరింత పాశవికంగా తయారు చేసింది. 


 దీనికి కొనసాగింపుగా గత రెండు మూడు రోజుల్లో లక్షకుపైగా సైన్యాన్ని కశ్మీర్‌కు పంచించింది. అక్కడ స్కూళ్లు, కాలేజీలు మూసేయించింది. రాత్రికి రాత్రి 144 సెక్షన్‌తో కర్ఫ్యూ విధించింది. మాజీ ముఖ్యమంత్రులతో సహా వివిధ పార్టీల నాయకులను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. కశ్మీర్‌లో గాలిపారాడకుండా చేసి కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంది. అక్కడ ఇంటర్నెట్‌ సౌకర్యాలు రద్దు చేసింది. అత్యవసర పరిస్థితి సృష్టించి కేంద్ర కేబినెట్‌ సమావేశమై 370 రద్దు చేస్తూ తీర్మానం చేసింది. నిజానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా కూడా రద్దు చేయడానికి వీల్లేని 370ని రద్దు చేస్తూ కశ్మీర్‌ను మూడు ముక్కలు చేసింది. 


 భారత రాజ్యానికి ఉన్న దురాక్రమణ స్వభావాన్నే కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రూపంలో నియంతృత్వం కొనసాగుతోందనడానికి ఈ చర్య నిదర్శనం. నెహ్రూ కాలంలోనే బైటపడ్డ భారత్‌ విస్తరణ కాంక్ష ఇప్పుడు పూర్తిగా కశ్మీర్‌ను కబళించి స్పష్టంగా బైటికొచ్చింది. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకపోయింది. ప్రజల చూపును ఆ సమస్యల నుంచి మళ్లించే దురుద్దేశం కూడా ఈ చర్యలో ఉంది. కశ్మీర్‌లోని విలువైన కుంకుమ తోటలను, ఆపిల్‌ తోటలను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి తగిన వాతావరణం కోసమే ఈ దుర్మార్గమైన విభజన. తరతరాలుగా కశ్మీర్‌ లోయలో తమ శ్రమతో సంపద సృష్టిస్తున్న ప్రజలను, గిరిజన తెగలను అక్కడి నుంచి తరిమేసి కార్పొరేట్ల పరం చేయడానికే ఈ విభజన. వీరోచిత పోరాట వారసత్వం ఉన్న కశ్మీర్‌ ప్రజలను చంపివేయడానికే లక్షల బలగాలను కేంద్రం రంగంలోకి దించింది. ఎవరైనా గట్టిగా కశ్మీర్‌ ప్రజల పక్షాన నిలబడితే  ఉపా లాంటి క్రూర చట్టాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. 


 జాతీయత పేరుతో ముస్లిం వ్యతిరేకత, అఖండ భారత్‌ పేరుతో కశ్మీరీ వ్యతిరేకతకు బరిదెగింపే ఈ చర్య. ఇది భారత ప్రజా జీవితంలో చీకటి రోజు. దేశంలో ప్రజాస్వామిక దృక్పథం గల వాళ్లందరూ 370 రద్దును ఖండించాలి. కశ్మీరీ ప్రజల దశాబ్దాల అజాదీ పోరాటానికి మద్దతు ప్రకటించాలి. కశ్మీర్‌ను ఒక స్వతంత్ర దేశంగా సాధించుకోడానికి ఆ ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. 


Popular posts