కృష్ణ కుటుంబం విజయనిర్మల

కృష్ణ మొదటి భార్య ఇందిర, మహేష్‌తో... విజయ నిర్మల రిలేషన్ ఎలా ఉండేది?

సూపర్ స్టార్ కృష్ణ మొదటి వివాహం ఆయన మరదలు ఇందిరా దేవితో 1961లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే 'సాక్షి' సినిమాలో తనతో పాటు కలిసి నటించిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డ ఆయన 1969లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తిరుపతిలో కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో జరిగింది.


కృష్ణ రెండో వివాహం తర్వాత పరిస్థితి ఎలా ఉండేది? ఇందిరా దేవి ఎలా ఫీలయ్యారు అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అప్పట్లో వీరి బంధాన్ని దగ్గరుండి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ... 'కృష్ణగారి ఇద్దరు భార్యలు ఆయన్ను సిన్సియర్‌గా ప్రేమించారు. అందుకే వారి కుటుంబంలో ఎలాంటి కలహాలు రాలేదు' అన్నారు.


ఆమెకు ఏ లోటూ లేకుండా చూసుకున్నారు


కృష్ణగారు నిర్మలగారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరగారు.. బిడ్డలను కన్నారు. రెండో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణగారు ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. తన భర్త సూపర్ స్టార్ కావడంతో నేను పేచీ పెడితే పరువు తీసి పందిరేసినట్లు అవుతుందని ఇందిర భావించేవారని... రామారావు తెలిపారు.


కృష్ణగారు ఏ తప్పూ చేయలేదని సమర్ధించేవారు


'ఆయన తప్పేం చేశారు? ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు అనే విశాలమైన ఆలోచనలో ఇందిర దేవి ఉండేవారు. విజయ నిర్మల కూడా కృష్ణగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కుటుంబం తాలూకు రిలేషన్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని భావించారు. తాను ఎంటరయ్యాక కుటుంబం చిన్నాభిన్నం అయిందనే పేరు రాకూడదని జాగ్రత్త పడ్డారు'' అని తెలిపారు.


మహేష్ బాబును విజయ నిర్మల చాలా ప్రేమించారు


మహేష్ బాబును చూసి విజయనిర్మల చాలా సంతోషపడేవారు. మహేష్ అందాన్ని చూసి పొంగిపోయేవారు. కృష్ణగారి కంటే బెటర్ పెర్ఫార్మర్ మహేష్ బాబును పొగిడేవారు. మహేష్ నటించిన సినిమాలు ఇద్దరూ జంటగా వచ్చి చూసి ప్రశంసించేవారు. మహేష్ చాలా బుద్దిమంతుడు కావడంతో...ఇలాంటి బిడ్డ ఉండాలంటే పూర్వజన్మ సుకృతం చేసుకుని విజయ నిర్మల భావించేవారని... రామారావు చెప్పుకొచ్చారు.


మొదట్లో నరేష్ ఆవిడ మాట వినేవాడు కాదు


నరేష్ గారిని విజయ నిర్మల చాలా స్ట్రిక్టుగా పెంచింది. మొదట్లో నరేష్ ఆవిడ మాట వినేవాడు కాదు. తర్వాత తల్లి విలువ తెలుసుకుని అమ్మకూచిగా మారిపోయాడు. ఆయనకు తెలిసిన ప్రపంచం అమ్మే. కృష్ణగారిలో నాన్నను చూసుకున్నారు... అయితే బాహాటంగా నాన్న అని పిలవలేరు కాబట్టి సార్ అని పిలిచేవారు.