స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్.


కడప జిల్లాలో ఇకపై స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలకు పారదర్శకంగా స్నేహపూర్వక, నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ గ్రామ, మండల డివిజన్, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేశారు. ఉండవల్లి ప్రజావేదిక నందు ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు లో ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారని, అందులో భాగంగా ప్రజా వినతుల సమస్యలను పరిష్కరించడంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారని, ప్రజలు వినతి పత్రాలు తీసుకుని కార్యాలయాలకు వస్తే ముందుగా చిరునవ్వుతో స్వాగతం పలకాలని, ప్రతి సమస్యకు నిర్ణీత వ్యవధి లోపల పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. కావున ఇక నుంచి ప్రతి సోమవారం స్పందన పేరుతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక దరఖాస్తు నమూనాను కూడా ప్రభుత్వం సూచించడం జరిగిందని, దరఖాస్తుతో పాటు ప్రజాసమస్యల పరిష్కారం కొరకు వచ్చిన అర్జీదారులను చిరునవ్వుతో పలకరించాలని, దరఖాస్తులు స్వీకరించి సమస్యను పరిష్కరించే కాలపరిమితిని సూచిస్తూ రసీదును దరఖాస్తుదారుకు ఇవ్వాలన్నారు. నిర్దేశించిన గడువు లోపు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో కృషి చేయాలని, గ్రామ మండల డివిజన్ స్థాయిలలో వారి పరిధిలో పరిష్కారం చేయలేని సమస్యలను పై ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉందని కూడా సదరు ఆదేశాలలో కలెక్టర్ పేర్కొనడం జరిగింది.