చిత్రపురి కాలనీ లో జరిగిన ఇండ్ల కుంభకోణంపై పోరాటం సినీ కార్మికులు

చిత్రపురి కాలనీ లో జరిగిన ఇండ్ల కుంభకోణంపై పోరాటానికి సిద్ధం అయిన సినీ కార్మికులు


 తమ పోరాటానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) మద్దతు కోరిన సినీ కార్మికులు


హైదరాబాద్: చిత్రపురి కాలనీ లో జరిగిన ఇండ్ల కుంభకోణంపై ఆదివారం హైదరాబాదులో కస్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సినీ కార్మికులు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఏ) నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్ర బాబును కలిశారు.. ఈ సందర్భంగా సినీ కార్మికులు ఎన్.ఏ.ఆర్.ఏ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు కి చిత్రపురి కాలనీ లో జరిగిన కుంభకోణం పై తమ గోడు వెళ్లబోసుకొని,తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.


ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ చిత్రపురి కాలనీ లో జరిగిన ఇండ్ల కుంభకోణంపై మీరు చేసే పోరాటానికి మా యూనియన్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.పేద సినీ కార్మికులకు ఇండ్లు సాధించేవరకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరువున ప్రజా ప్రతినిధులను,ఉన్నత అధికారులు కలిసి అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు..


ఈ సందర్భంగా సినీ కార్మికుల ప్రతినిధి కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినీ కార్మికుల కోసం ఎందరో సినీ మహానుభావుల కృషి తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1994 సంవత్సరంలో మణికొండ 67 ఎకరాల,17 కుంటలు సినీ కార్మికుల కోసం కేటాయించడం జరిగింది. కానీ కొంతమంది స్వార్థపరులు పాలకమండలి గా ఏర్పడి 67 ఎకరాల్లో 70% బయటవాళ్ళకి, ఒక్కో ఇంటికి ఒక లక్ష నుండి 20 లక్షలు లంచాలు తీసుకుని జూనియర్ ఆర్టిస్టులు,మ్యూజిషియన్, డైలాగ్ ఆర్టిస్ట్లు,డైరెక్టర్స్, రైటర్స్ గా అసోసియేషన్ లో దొంగ సభ్యత్వాలు సృష్టించి ఎన్నారైలకు,ఇంజనీర్లకు బ్యాంక్ ఎంప్లాయిస్ కి, బిల్డర్స్ కి, డాక్టర్స్ కి అడ్డదారిలో ఇండ్లు ఇచ్చి కోట్లు గడించారని కస్తూరి ఆరోపించారు.


ఇంకా ఇప్పుడున్న నాలుగు ఎకరాల ఖాళీ స్థలంలో 2200 ఎస్.ఎఫ్.టీ తో 18 ఫోర్లు కట్టి ఒక్కో ఇంటికి 55 లక్షలుకు మళ్ళీ బయటవాళ్లకు అమ్మేందుకు మరో పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతున్నారు. కావున నిజమైన కార్మికుల కోసం సింగిల్ బెడ్రూం లు మాత్రమే కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఫిలిం ఫెడరేషన్ మరియు సినీ కార్మికులంతా ఏకమై చిత్రపురి సొసైటీ పాలకమండలి మీద, దొంగ మెంబర్ల మీద పోరాడితే మనకు చెందాల్సిన ఇండ్లు సాధించుకుందాం. కొన్ని యూనియన్లు అక్రమంగా సభ్యత్వాలు ఇస్తున్న యూనియన్ల పై ఫిలిం ఫెడరేషన్ వారికి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా కూడా చర్య తీసుకోకపోవడం వెనుక రహస్యం అందరికీ తెలిసిందే అని కస్తూరి శ్రీనివాస్ అన్నారు.


చిత్రపురి కాలనీ లో ఉన్న కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ విషయమై ఈ సొసైటీ పాలకమండలి డబ్బులకు కక్కుర్తి పడి స్కూలు ని కూడా వదిలిపెట్టలేదు. ఒక టెండర్ అని నాటకమాడి ఈ కైరోస్ కార్పొరేట్ స్కూల్ కి ముప్పై మూడు సంవత్సరాలుగా 18 కోట్ల లీజు కు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా ఈ ఒకటిన్నర ఎకరం అమ్మేసుకున్నట్లే. డబ్బున్న బడాయి బాబుల పిల్లలు చిత్రపురి లో ఉన్న కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకోవడం,సినీ కార్మికుల పిల్లలు బయట చదువుకోవడం జరుగుతుంది. కావున ఆ డబ్బును తిరిగి స్కూల్ వాళ్లకు ఇచ్చేసి సినీ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాల గా ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని,ఈ మొత్తం వ్యవహారాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు.


కావున సినీ కార్మికులారా రండి,కలసి రండి మన బాధ ప్రభుత్వానికి చేరేవరకు పోరాడుదాం.. ఫిలిం ఛాంబర్ లో జూలై మూడో తారీకు (03- 07- 2019) ఉదయం ఎనిమిది గంటలకు జరిగే ఈ ఉద్యమానికి సినీ కార్మికుల అంతా వచ్చి సంఘీభావం తెలపగలరని కస్తూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.


సురేంద్రబాబు కలిసినవారిలో కస్తూరి శ్రీనివాస్, లలిత, తేజ, శ్రీనివాస్ ఉన్నారు..