జీవితం బహు విచిత్రమైనది

విజేత


జీవితం బహు చిత్రమైనది.


ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి. సాధారణంగా ఆటల్లో నెగ్గినవారిని, పాటల్లో గెలిచినవారిని విజేతలంటారు. కంటికి కనిపించకుండా మనల్ని ఆడిస్తుంది మనసు. దాని ఆట కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు!


మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని గీతాచార్యులు వెల్లడించారు.


'దేవుడి కృపను పొందవచ్చు. గురువు కృపను, సాధుజనుల కృపను పొందవచ్చు. కాని మనసు కృపను పొందలేక నాశనమవుతాడు' అని సామెత ఉంది. 'వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు' అంటుంది ధమ్మపద. మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. స్వాధీనం తప్పిన మనసు మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు, ఎడతెరిపి లేని అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురవుతాడు.


ఈ స్థూల శరీరంలో మనసు ఒక సూక్ష్మమైన భాగం మాత్రమే. భౌతికమైన స్థూల శరీరం మనసుకు పైన ఒక పొర. మనసు వెనక ఆత్మ ఉంది. మనసు సర్వ స్వతంత్రమైనది కాకపోయినా, దానికున్న శక్తులు అపారమైనవి. ఆ శక్తులను జయించడానికి మనిషి విశ్వప్రయత్నం చేయాలి. అప్పుడే అతడు విజేత కాగలడు. మనసెప్పుడూ ఒకేలా ఉండదు. మూడు బలమైన శక్తుల కలయికే దానికి కారణం. అవి సత్వం, రజస్సు, తమస్సు అనేవి.


శ్రీ రామకృష్ణ 'పరిశుద్ధమైన మనసే పరిశుద్ధమైన బుద్ధి. అదే పరిశుద్ధమైన ఆత్మ' అన్నారు. మనసు నాలుగు విధాలైన విధులను కలిగి ఉంటుంది. అవి: మది, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవన్నీ అంతఃకరణ తాలూకు వేర్వేరు రూపాంతరాలు. 'మది' ఒక వస్తువు. మంచి చెడులను అంచనా వేస్తుంది. 'బుద్ధి' మంచి చెడులను నిర్ణయిస్తుంది. చిత్తం జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. 'నేను' అనే భావాన్ని కలిగించేది 'అహంకారం'. మనసును స్వాధీనం చేసుకోవాలంటే అది పవిత్రంగా ఉండాలి. మనం తినే ఆహారం పరిశుద్ధంగా ఉంటే మనసు పవిత్రమవుతుంది.


మనసును గెలవాలనుకునేవారు తమ కలతలు, కక్షలు, స్పర్థలు లోలోపలే దాచుకోరాదు. మనసుకు సృజనాత్మకమైన, ఆరోగ్యకరమైన కాలక్షేపం కల్పించాలి. శ్రీమద్భాగవతం 'దానం, కర్తవ్య నిష్ఠ, వ్రతాలు, పురాణ శ్రవణం, పుణ్యకర్మలు ఇత్యాది పనులు మనసును స్వాధీనపరచుకోవడానికి దోహదం చేస్తాయి' అని చెబుతోంది. ముఖ్యంగా భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. గాయత్రీ మంత్రాన్ని అనునిత్యం జపిస్తే, మనసు మీ ఆధీనంలోనికి రావడానికి తోడ్పడుతుంది. పతంజలి ఓంకారాన్ని జపించడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.


'వివేక చూడామణి'లో శంకరాచార్యులు 'మెట్లపై నుంచి జారవిడిచిన బంతి ఏ విధంగా ఒక్కొక్క మెట్టుమీద నుంచి దొర్లుతూ కిందికి పడిపోతుందో అలాగే, మనసు తన ఆదర్శం నుంచి ఏ కొంచెం పక్కకు తప్పుకొని భోగవస్తువుల మీదకు  మరలినా క్రమక్రమంగా అది మరీ హీనస్థితికి జారిపోతుంది' అన్నారు. మన సంకల్ప శక్తితో మనసు మీద పట్టు సాధించి నిలకడగా భగవంతుని ధ్యానించేటట్టు చెయ్యాలి. మనసును సుశిక్షితుడైన సైనికుడిలా మలచి మాట వినేలా చేయగలిగినవాడే విజేతగా విలసిల్లుతాడు.