ఈతరానికో చూపు "డియర్ కామ్రేడ్" సినిమా

 


 


ఈతరానికో చూపు "డియర్ కామ్రేడ్" సినిమా



                    డియర్ కామ్రేడ్. ఈ టైటిల్ ని చూడగానే కొందరికీ ఆకర్షణ,మరికొందరికి వికర్షణ సహజం.అది ఆ పదం నైజం.దానికున్న గ్లామర్ మాత్రమే కాదు గ్రామర్ కూడా. ఎందుకంటే కామ్రేడ్ అనగానే ఒక ప్రశ్న,ఒక తిరుగుబాటు,ఒక పోరాటం,ఒక రాజీలేని తనం, త్యాగపు గుణం మన కళ్ళముందు నిలువెత్తు సజీవమై సాక్షాత్కారం అవుతాయి.అది ఆ పదానికున్న గ్రామర్.అందుకే ఇది నచ్చిన వారికి ఇంపుగా నచ్చని వారికి కంపుగా అనిపించవచ్చు.ఐతే ఆ పదం - దృక్పథాల గురించిన చర్చ ఇప్పుడెందుకంటే "డియర్ కామ్రేడ్" అంటూ కమ్యూనిష్టు బ్రాండ్ నేమ్ తో తెలుగు తెరపై జూలై ఇరవై ఆరున ఓ సినిమా ఆవిష్కృతమైంది.కమ్యూనిష్టు పేరుతోనో,సబ్జెక్టుతోనో,గతంలోనూ ఎన్నో సినిమాలొచ్చాయి.కానీ ఇది వేరుగాఅనిపించింది.ఫక్తూ కమర్షియల్ సినిమాలకంటే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం తప్పక ఉన్నది.


                                  సినిమా అంటేనే వ్యాపారం.అందులో తెలుగు సినిమా మరింత వ్యాపారమయమైంగా పరుగులు తీస్తుంది.ఈ మధ్య కాలంలో బాగా యూత్ అభిమానాన్ని చూరగొన్న కొత్తతరం నటుడు విజయ్ దేవరకొండ లీడ్ రోల్ పోషించడం ఇంకా మరింత చర్చకు దారి తీసింది.టైటిల్ పేరు చెడగొట్టారో ఏంటోనని లేదా టైటిల్ ఇది కాబట్టి ఏం బాగుంటుందిలే అని మాట్లాడేవారు, రాసేవారు,దుర్విమర్శ, సద్విమర్శలు రావడం సహజమైన ప్రక్రియే కదా.ఇక సినిమా విషయానికొస్తే కాలేజీ ఫీజుల పై పోరాడే స్టూడెంటు లీడర్ చైతన్య పాత్ర విజయ్ దేవరకొండది.విద్యార్థి సంఘాలను వాడుకోవాలని చూసే రాజకీయ నాయకులతో ఘర్షణలుంటాయి.ఆ క్రమంలో ఉద్యోగాలివ్వక ఊళ్ళోకెళ్ళి మొహం కూడా చూపించుకోలేక హాస్టల్ లోనే ఉంటున్నామనే చెప్పిన డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లోని సమకాలీన యువత స్థితిగతులకు అద్దంపడుతుంది.సినిమా అన్నప్పుడు ప్రేమ సహాజాతి సహజం.ప్రేమలో నుండే సినిమా పుట్టిందా అన్నట్లయింది సినిమా కథాకమామిషు.తదనుగుణంగానే అపర్ణాదేవి(రష్మిక మడన్నా) అనే క్రికెటర్ తో చైతన్య ప్రేమ ప్రారంభమైతుంది.విద్యార్థుల సమస్యలపై గొడవపడడం వలన మనకేం వస్తుంది.!పోరాటాల వలన ఎవరు సంతోషంగా ఉంటారు.!ఇప్పటికే ఢిల్లీలో స్టూడెంటు యూనియన్ గొడవల్లో మా అన్నయ్య చనిపోయాడు అని భయపడితుంది.అమె అలా అనడం సగటు ఉద్యమకారులు రోజు తమ కుటుంబ సభ్యుల నుండి  ఎదుర్కొనే మాటల్ని గుర్తుకు తెస్తాయి.


              లీడ్ యాక్ట్రెస్ అపర్ణా చైతన్య వాళ్ళింటికి  వచ్చినప్పుడు అక్కడి సంబోదనలు విని కామ్రేడ్ అంటే ఏంటని  అడుగుతుంది. అక్కడ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెటకారంగా కమ్మ రెడ్డి కలిపితే కామ్రేడ్ అని స్పందిస్తాడు. ఆయనకేం తెలుసమ్మా తాతయ్యని అడగమని వాళ్ళ పిన్ని పంపిస్తుంది.ఏ కష్టనష్టాలు ఎదురైనా మన వెంటుండే వాడే కామ్రేడ్.అలా ఉండగలిగే వాడు కామ్రేడ్ ఒక్కడే అని చెప్తాడు అతను.
ఆ డైలాగ్ ను చిలువలు పలువలుగా చర్చించేవారూ, వక్రీకరించేవారూ లేకపోలేదు. అలా తప్పుడు భాష్యం చెప్పేవారికి సమాధానం చెప్పడానికే దర్శకుడు ఇలా చెప్పించాడని అర్ధమైతుంది. ఈతరం విద్యార్థులు,యువత  ఎర్రజెండా అంటే ఎంటో, కామ్రేడ్ అంటే ఏంటో,ఈ పాటి స్వేచ్ఛ ఎలా వచ్చిందో కూడా తెలియకుండా ఉన్నారు. వారిని ఆలోచింపచేసేందుకు ఇది ఎంతోకొంత ఉపయోగపడుతుంది.
చైతన్య పై తన తాత అయిన మాకినేని సూర్యం ప్రభావం ఉంటుంది.వారింటిపై ఎప్పుడూ ఎర్రజెండా ఎగురుతుంటుంది. వారి స్టూడెంట్స్‌ యూనియన్ ఆఫీస్ లో నిలువెత్తు సుందరయ్య ,చేగువేరా ఫోటోతో పాటు సిపిఎం మొదటి పోలిట్ బ్యూరో సభ్యుల చిత్ర పటం కనిపిస్తుంది.ఇవన్నీ చూస్తే మార్క్సిస్టు ఆశయాల కోసం ఆ సంఘంలో పని చేస్తున్నారన్న అర్ధం స్ఫురిస్తుంది.కానీ అలా స్పష్టంగా ఆర్.నారాయణమూర్తి సినిమా లాగ ఉండదు.పాతకాలంలో లాగ విప్లవ  నినాదాలు, నిత్యపోరాటాలు,కాల్పులు,లాఠీచార్జీలు ఉండవు.పోరాటం కోసం మాత్రమే ప్రేరేపించే సినిమా మాత్రం కాదు.ఈ సినిమా నుండి వాటిని ఆశించడమంటే ఇతరులెవ్వరూ ఆ సినిమా చూడొద్దని కోరుకోవడమే అవుతుంది.విద్యార్థులకు, విద్యార్థి యువ నాయకులకు ప్రేమలు ఉన్నట్లే చైతన్యకు కూడా ఉంటాయి.కమర్షియల్ సినిమా కాబట్టి సహజంగా ప్రేమ చుట్టూతే ఉంటుంది. కొద్దిసేపు పోరాటం వదిలేసి మారాడేమో అని లీడ్ యాక్ట్రెస్ అనుకునేంతలోపే చైతన్యలో అణువంత కూడా ప్రశ్నించే తత్వం తగ్గలేదని, తప్పు చూస్తే ఒళ్ళు మండి గొడవబడే గుణాన్ని వదులుకోలేదని తెలిసిపోతుంది.అపర్ణకు ఎదురైన సంఘటనలో భయపడే తనని చైతన్య తిరగబడేలా చేసి,అమ్మాయిల లక్ష్యాలను చేరుకునేలా,వారు ఉన్నత స్థాయిల్లోకి వెళ్ళే విధంగా ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలంటాడు.ఆ క్రమంలో మహిళలను లైంగిక హింసకు గురి చేసేవాడికి తగిన బుద్ది చెప్పిస్తాడు.మన జీవితంలో మన కష్టాలను పరిష్కారం చేసే కామ్రేడ్ లాగ ఆలోచించే వారు ఒక్కరున్నా చాలు మనం ప్రపంచంతో పోరాడగలం.నా లైఫ్ లో ఒక కామ్రేడ్ ఉన్నాడు కనుకనే నేను ఈ రోజు గెలువగలిగాను.అని కామ్రేడ్ ప్రాధాన్యతను అపర్ణాదేవి(రష్మిక) చెప్పడంతో కథ ముగుస్తుంది.


                            ఇదంతా సినిమా అయితే సినిమా చుట్టూ,సినిమా బయట మరో సినిమా ఉంది.నేడు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిలో కామ్రేడ్ భావాజాలం వెనుకపట్టు పట్టిన విషయం మనందరికి తెలుసు.ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తన సినిమాకు డియర్ కామ్రేడ్ అని పేరు పెట్టిన దర్శకుడు భరత్ కమ్మను సాహసోపేతమైన, దమ్మున్న దర్శకుడనకుండా ఉండలేము.తన మొదటి సినిమాను ఈ టైటిల్ తోనే నాల్గు భాషల్లో విడుదల చేయడం సాధరణ విషయమేమి కాదు.ఇప్పటికే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రిమేక్ కు హక్కులు కూడా తీసుకున్నాడు.మొత్తంగా కమర్షియల్ గా కూడా దర్శకుడు విజయం సాధించాడు.
సాక్షాత్తు భారత ప్రధానమంత్రే జాతీ మతం అంటూ హిట్లర్ పూనినట్లు ఊగిపోతూ దేశాన్ని ఊగిస్తున్న సందర్భంలో, మతోన్మాదులు మూకదాడులు చేస్తున్న నేటి భయంకర పరిస్థితుల్లో మౌనమింక చాలు పద "జాతీ మతం మరిచి పద" అని చైతన్య ప్రసాద్ రాసిన ఆంతమ్ సాంగ్ టైటిల్ కు,సినిమాకు జీవధార.ప్రేక్షక మెదళ్ళను పదునెక్కించే భావధార.జాతీ,మతం అనే సెంటిమెంటల్ బానిసత్వంలో ఇంకెంతకాలం బ్రతుకుదాం  సొంతబలం తెలుసుకో.పాత మత భావాలు మార్చడానికి కామ్రేడ్ లాగ బ్రతుకు,మంచిని పెంచడానికి కామ్రేడ్ లాగ ఉండు.ఈ సమాజంలో మార్పు తెచ్చేందుకు కామ్రేడ్ లాగ బ్రతకమని ఆ పాట కోరుతుంది.దబోల్కర్ని, కల్బుర్గిని,పన్సారేను, గౌరీలంకేష్ లాంటి మేధావులను,నచ్చిన తిండి తిన్నారని మరికొందరిని చంపేస్తున్న నేటి మత గూండాల రాజ్యాన్ని హెచ్చరిస్తున్నట్టే ఉంటాయి. "గూండాల దందాకు బెదరం ఎందుకంటే మా నాదం నినాదం ఇంక్విలాబ్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి" అనే చరణం ఇండియన్ యూత్ ఐకాన్,ది లెజెండ్ భగత్ సింగ్ ఉరికొయ్యల మీదునుండి ఈ దేశ యువతకు చూపిన ఆశయమార్గమే దిక్సూచై వినిపిస్తుంది.మూడు కోతుల సూక్తి కథలకు పరిమితమవకుండా రాజ్యాంగ ధ్వంసం,రాజ్యంలో హింస, రాజ్యం చేతిలో బానిసలా ఎన్నో దారుణాలను, దోపిడీలను లూటీలను ప్రశ్నించక "చూపు చచ్చి...మాట చచ్చి...చెవుడే వచ్చి...శవము కారాదు...ఇష్టమైన దానికోసం...కష్టమైనా కలిసి పోరాడు....ఇంక్విలాబ్ ను వర్ధిల్లజేయమంటాడు.సినిమాలోని ఆ కాకినాడ తీర ప్రాంతపు చేరువ నుండే వచ్చిన తొంభై శాతం వికలాంగుడైన మానవతావాది మేధావి ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారినెందరి బ్రతుకులను,బ్రతికే హక్కును రాజ్యం కాలరాస్తూ జైళ్ళలో కుక్కుతున్న వేళ ఆ బ్రతికే హక్కు కై,రాజ్యాంగంలోని జీవించే స్వేచ్చ కై గళం విప్పమంటూ ప్రజలకు పిలుపునిస్తుంది ఈ పాట.నీ జీవన సమరంలో భుజం తట్టి వెంటుండేది,ధ్వజం పట్టి నడిపించేది కామ్రేడ్ ఒక్కడేనంటూ లివ్ లైక్ ఎ కామ్రేడ్,బి లైక్ ఎ కామ్రేడ్ అంటూ మార్క్సిస్టు తత్వసారాన్నంతా ఆ పాట బోధిస్తుంది.వెస్ట్రన్ మ్యూజిక్ తో విప్లవఔషధానికి కమర్షియల్ తీపిరంగునద్ది ఈ తరానికి వారి స్టైల్లోనే ఓ కొత్త చూపునద్దాడు ఈ డియర్ కామ్రేడ్.