ఇసుక రీచ్‌లు ఏర్పాటుకు మైనింగ్‌ అధికారుల కసరత్తు

ఇసుక రీచ్‌లు తెరుస్తారు
చెవిటికల్లు, కంచెల, కాసరబాద రీచ్‌లు
మరికొన్ని కొత్తవి ఏర్పాటుకు మైనింగ్‌ అధికారుల కసరత్తు
కంచికచర్ల : నందిగామ డివిజన్‌లో తాత్కాలికంగా మూతబడిన ఇసుక రీచ్‌లను తిరిగి తెరిచేందుకు, కొత్త రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు మైనింగ్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నూతన విధానం అమల్లోకి వచ్చేంత వరకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు పలు రీచ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నారు. అనుమతి పొందిన వారికి కూపన్లు ద్వారా ఇసుక అందజేయనున్నారు.
నిలిచిన మూడు రీచ్‌లు
తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన తర్వాత నందిగామ డివిజన్‌ పరిధిలో కంచికచర్ల మండలం చెవిటికల్లు, నందిగామ మండలం కంచెల, చందర్లపాడు మండలం కాసరబాద, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు రీచ్‌ల్లో మాత్రమే ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. వీటిలో ఒక్క శనగపాడు రీచ్‌లో మాత్రమే ఇసుక తీసుకునేందుకు ప్రస్తుతం అనుమతి ఉంది. కాసరబాద రీచ్‌లో ఇసుక తీసుకునేందుకు గుడివాడ - మచిలీపట్నం రైల్వే లైను పనులు చేస్తున్న మెస్సర్స్‌ జీవీఆర్‌ ప్రేమ్‌కో సంస్థకు గత నెల 21వ తేదీన కలెక్టర్‌ ఇంతియాజ్‌ అనుమతి ఇచ్చారు. ఈ రీచ్‌లో 11,760 క్యూబిక్‌ మీటర్ల ఇసుక మాత్రమే తవ్వుకోవాలి. అనుమతికి మించి రీచ్‌లో ఇసుక తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో జీవీఆర్‌ ప్రేమ్‌కోకు ఇచ్చిన అనుమతిని నిలిపివేశారు.
కుంటుపడిన నిర్మాణ రంగం
ఇసుక లేనందున నిర్మాణ పనులు ఎక్కడికక్కడే అర్ధంతరంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా భవన నిర్మాణదారులు ఇసుక కోసం పలు అవస్థలు పడుతున్నారు. నిర్మాణ రంగం కుంటుపడటంతో భవన నిర్మాణ కార్మికులు సైతం ఉపాధి కరువై, పనుల్లేక అల్లాడుతున్నారు. కొత్త విధానం అమల్లో వచ్చేంత వరకు ఇసుకకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా సీఎం జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. గతంలో మాదిరిగా ఇసుక అవసరమైన వారికి ఉచితంగా ఇవ్వాలన్నారు. ఇసుక కావాల్సిన వారికి కలెక్టర్‌ అనుమతి ఇస్తున్నారు. స్థానిక అధికారులు రీచ్‌ను కేటాయించి కూపన్లు ఇస్తున్నారు. ఉచితంగా ఇస్తున్నప్పటికీ పశ్చిమకృష్ణాలో శనగపాడు రీచ్‌ ఒక్కటే కావటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. రవాణా ఖర్చు తడిసి మోపడవుతోంది. కంచికచర్ల, జగ్గయ్యపేట ప్రాంతాల వారికి తప్ప మిగతా వారికి ట్రాక్టర్‌ ఇసుక కావాలంటే నాలుగైదు వేలవుతోంది. అంతకు ముందు రూ. వెయ్యి ఖర్చు అయ్యేది.
దీంతో విజయవాడ బిల్డర్లు, అత్య వసరం ఉన్న వాళ్లు తప్పితే శనగపాడు రీచ్‌ నుంచి ఇసుక తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కంచెల, చెవిటికల్లు, కాసరబాద రీచ్‌లతో పాటు మరికొన్ని రీచ్‌లను ప్రారంభించేందుకు మైనింగ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడ డివిజన్‌లో ఇప్పటికే శ్రీకాకుళం, నార్త్‌వల్లూరు రీచ్‌లను తెరిచేందుకు కలెక్టర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్త రీచ్‌ల ప్రతిపాదనలను అధికారులు, కలెక్టర్‌ ముందుంచారు. రేపో, మాపో అనుమతి వస్తుందని మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు.
చెవిటికల్లు రీచ్‌ నుంచి అనుమతుల పేరుతో అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అధికారులు ముడుపులు తీసుకుంటున్నారంటూ చెవిటికల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగటంతో ఈ రీచ్‌లో తాత్కాలికంగా తవ్వకాలు ఆగిపోయాయి.
కంచెల రీచ్‌లో తవ్వకాలకు సోమా ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చారు. విజయవాడకు చెందిన ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండటంతో స్థానికంగా ఉన్న తమ ట్రాక్టర్లను వినియోగించుకోవాల్సిందిగా స్థానికులు ఆందోళనకు దిగటంతో ఇక్కడ కూడా తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నిలిచిపోయిన ఈ మూడు రీచ్‌లను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.