ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మోదుగుల
జగన్ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి నియామకం రద్దు అయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి..పార్లమెంటరీ పార్టీ నేత.. రాజ్య సభ సభ్యుడు అయిన విజయ సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే, తాజాగా ఆయన నియామక ఉత్తర్వులు రద్దు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. విజయ సాయిరెడ్డి నియామకానికి సాంకేతిక కారణా లు అడ్డుగా ఉన్న కారణంగానే జీవో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇదే నియామకం సమయంలో ఆ మాత్రం అవగాహన లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారో అధికారులే చెప్పాలి. ఇక, ఆయన స్థానంలో మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో ఇక ఇప్పుడు ఈ పోస్టులో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీ నుండి 22 మంది ఎంపీలు.. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నా..వారిలో ఎవరికీ ఈ పదవి ఇవ్వటానికి అవకాశం లేదు. దీంతో.. గతంలో ఎంపీగా పని చేసి అటు డిల్లీ వ్యవహారాల్లోనూ..ఇటు రాష్ట్ర పరిపాలన మీద అవగాహన ఉన్న మాజీ ఎంపీ..ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఆయన తాజా ఎన్నికల్లో గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ది గల్లా జయదేవ్ మీద అయిదే వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణతో టీడీపీ ఎంపీ గెలిచారంటూ కోర్టులో కేసు కొనసాగుతోంది. దీంతో.. లోక్‌సభ సభ్యుడిగా.. ఏపీ ఎమ్మెల్యేగా పని చేసి అనుభవం ఉన్న మోదుగుల వేణు గోపాల రెడ్డిని ఇప్పుడు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.