ఆమంచర్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయండి
పార్లమెంటులో కోరిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో నెల్లూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమంచర్ల లో స్పోర్ట్స్ విలేజ్ పనులను ఖెలో ఇండియా కింద వేగవంతం గా చేపట్టాలని లోక్సభలో గురువారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక అనుబంధ ప్రశ్న రూపకంలో కోరారు. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఆమంచర్ల స్పోర్ట్స్ విలేజ్ కాంప్లెక్స్ను మంజూరు చేసిందని ,అయితే ఇంతవరకు సక్రమంగా పనులు జరగలేదని తెలిపారు. దీనికి అవసరమైన నిధుల విడుదలతో పాటు సత్వరం పనులను వేగవంతం చేయాలని ఆయన లోక్ సభలో కోరారు .కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజూ సమాధానమిస్తూ ఖెలో ఇండియా బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వానిదే కాదని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఇమిడి ఉందని చెప్పారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసి దేశానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రెండు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అందులో భాగంగా తగిన చర్యలు తీసుకుంటామని సమాధానంగా చెప్పారు.