నాలుగోసారి కర్ణాటక సీఎం గా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

నాలుగోసారి కర్నాటక సీఎంగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం.


బెంగళూరు: కర్నాటక 25వ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప  ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన... పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ సీనియర్ నేతలు శోభా కరంద్లాజే, మురళీధర్ రావు సహా పలువురు నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


కాగా బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఇటీవల అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన విశ్వాస పరీక్షలో... కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీయస్ ప్రభుత్వం ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో అతి పార్టీ అయిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం కర్నాటక అసెంబ్లీలో యడియూరప్ప బలం నిరూపించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరనుంది.