జైపాల్‌రెడ్డికి ఉప రాష్ట్రపతి నివాళి

 



జైపాల్‌రెడ్డికి ఉప రాష్ట్రపతి నివాళి 


హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) పార్థివదేహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో ఇద్దరమూ ఒకే బెంచీలో రెండు పర్యాయాలు కూర్చున్నామన్నారు. ప్రతిపక్షంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించామని తెలిపారు. ఆయన మేథాశక్తి, విమర్శనా శైలి, విషయ పరిజ్ఞానం, భాషా ప్రావీణ్యం అద్భుతమని కొనియాడారు.


మరోవైపు జైపాల్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ మేరకు రామ్‌నాథ్‌ కోవింద్‌, మోడీ ట్విటర్‌లో పోస్టు చేశారు.