జగన్ యువతకు  ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి.

  జగన్ యువతకు  ఒక ప్రేరణ. ఒక స్ఫూర్తి.


 


తెలుగు రాష్ట్రాలను ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కొందరు మంచిపేరు తెచ్చుకున్నారు. కొందరు అపఖ్యాతి పాలయ్యారు. వారు జీవించి ఉన్నపుడే తమ రాజకీయ వారసులను పరిచయం చేసారు. ఒకరో ఇద్దరో తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. మన పొరుగున ఉన్న తమిళనాడులో అరవై ఏళ్లపాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, జీవితకాలపు పార్టీ అధ్యక్షుడిగా చెరగని ముద్ర వేసిన కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముప్ఫయి ఏళ్ళనుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కాలేకపోయాడు అరవై అయిదేళ్ల వయసు వచ్చినప్పటికీ. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు కుమారుడు, జలగం వెంగళరావు కుమారుడు, మర్రి చెన్నారెడ్డి కుమారుడు, నాదెండ్ల భాస్కర రావు కుమారుడు, మొన్ననే మాజీ అయిన చంద్రబాబు కుమారుడు, ఎన్టీఆర్ కుమారులు రాజకీయరంగంలో ఉన్నప్పటికీ, వారు ఒకరో ఇద్దరో కొన్నాళ్ళు మంత్రి అనిపించుకున్నారు. మిగిలినవారు ఎమ్మెల్యే స్థాయిని దాటలేకపోయారు. నాదెండ్ల మనోహర్ సభాపతి అయ్యారు. అంతవరకే.


కానీ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి తండ్రి జీవించి ఉన్నప్పుడు ఎంపీ అయినప్పటికీ, వైఎస్ అకాలమరణంతో, కాంగ్రెస్ పార్టీ వేధింపులను, అవమానాలను సహించలేక, కొండను ఢీకోట్టినట్లు సోనియాగాంధీని ధిక్కరించి సొంతంగా పార్టీని పెట్టుకుని, కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాగలిగాడు. అదికూడా మామూలు విజయం కాదు. అసాధారణ విజయం. శత్రువులను బెంబేలెత్తించిన విజయం. ఇలాంటి విజయం మళ్ళీ అతనికి కూడా సాధ్యం అవుతుందా కాదా అని సందేహాలు కలిగించిన విజయం.


కేవలం తల్లితండ్రుల ప్రభావం ఉంటె సరిపోదు..స్వయం ప్రకాశం ఉండాలి. శత్రువుల కుట్రలను ఛేదించి, పోరాడే దమ్ము ఉండాలి. గుండెల నిండుగా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవాళ జగన్ మోహన్ రెడ్డి జీవితం పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టాల్సినంత గొప్ప విజయం. జగన్ కార్యశూరత యువతకు ఒక ప్రేరణ. ఒక స్ఫూర్తి.