చంద్రయాన్ 2 సక్సెస్

_చంద్రయాన్‌2 సక్సెస్: సంబరాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు


భారత్ మరో ఘనత సాధించింది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని రెండవ లాంచింగ్ స్టేషన్ నుంచి చంద్రయాన్‌-2ను ప్రయోగించారు. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 రాకెట్‌ ద్వారా రివ్వున జాబిల్లి వైపు దూసుకెళ్లింది._


_చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఒకరినొకరు పరస్పరం అభినందించుకున్నారు. కాగా మొన్నటి ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి విజయవంతంగా ప్రయోగం పూర్తి చేసినట్లు ఇస్రో పేర్కొంది. ఇది ఇస్రోలోని ప్రతి ఒక్కరి విజయమని, దేశ విజయమని హర్షం వ్యక్తం చేశారు._


_వాస్తవానికి ఈ నెల 15వ తేదీన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి చంద్రయాన్‌-2 ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ లోపాన్ని సరిచేసిన తర్వాత వారం రోజులకే దానిని తిరిగి ప్రయోగానికి సన్నద్ధం చేశారు. బాహుబలిగా పేర్కొనే జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 రాకెట్‌ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌-2 కంపోజిట్‌ మాడ్యూల్‌తో ఈ రాకెట్‌ పయనిస్తుంది._