జె.ఎన్.టి.యు.కె.లో కార్మిక చట్టాలు అమలు చేస్తాము
కన్స్యూమర్ సొసైటీ ఫిర్యాదుకు స్పందించిన ఉన్నతాధికారులు.
ప్రముఖ సాంకేతక విశ్వవిద్యాలయం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ కాకినాడలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల పరిరక్షణకు కార్మిక చట్టాలను అమలు చేస్తామని జె.ఎన్.టి.యు.కె పాలనా యంత్రాంగం ఎట్టకేలకు ఒప్పుకుంది.
జె.ఎన్.టి.యు.కె లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత 8 సంవత్సరాలుగా కార్మిక చట్టాలకు అతీతంగా అధిక పనిగంటలు, మహిళా ఉద్యోగినుల చేత రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహింపచేయడం, శెలవు దినాలలో పనిచేయించడం, 15 ఆకస్మిక శెలవులు (క్యాజువల్ లీవ్) లకు బదులు 12 మాత్రమే అమలు చేయడం తదితర అంశాలపై కన్స్యూమర్ రైట్స్ & ప్రొటెక్షన్ సొసైటీకు జె యన్ టి యు సిబ్బంది తెలియజేయడంతో కన్స్యూమర్ సొసైటీ జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి.శ్రీనివాస్ - జె.ఎన్.టి.యు.కె రిజిస్ర్టార్ పి.సుబ్బారావు, కన్య్సూమర్ రైట్స్ & ప్రొటెక్షన్ సొసైటీ ప్రతినిధులతో రెండు దఫాలుగా నిర్వహించిన ఉమ్మడి సమావేశాలలో కార్మిక చట్టాల అమలుకు జె.ఎన్.టి.యు.కె. రిజిస్ట్రార్ పి.సుబ్బారావు ఒప్పుకోవడం జరిగింది.
కార్మికుల హక్కులకు భంగం కలుగకుండా 8 గంటల పని వేళలలతో పాటు, ఇప్పటివరకు అమలు చేస్తున్న 12 ఆకస్మిక శెలవుల (క్యాజువల్ లీవు) స్థానే 15 వేతనంతో కూడిన శెలవులు, శెలవు దినాలలో ఎన్ని రోజులు విధులు నిర్వహిస్తే అదే నెలలో అన్ని రోజులకు వేతనంతో కూడిన శెలవు మంజూరు చేయడానికి ది.22.07.2019న జె.ఎన్.టి.యు.కె - కన్య్సూమర్ రైట్స్ & ప్రొటెక్షన్ సొసైటీ ప్రతినిధుల మధ్య డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్ కాకినాడ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి (జాయింట్ మీటింగ్) సమావేశంలో జె.ఎన్.టి.యు.కె రిజిస్ట్రార్ తరఫున జాయింట్ రిజిస్ట్రార్ ఐ.త్రిదేవి లిఖిత పూర్వక హామీని ఇవ్వడం జరిగింది.
వినియోగదారుల హక్కల పరిరక్షణతో పాటు, చట్టాల అమలుకు కన్స్యూమర్ రైట్స్ & ప్రొటెక్షన్ సొసైటీ కృషిచేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే కార్మికుల హక్కుల పరిరక్షణకు కన్స్యూమర్ రైట్స్ & ప్రొటెక్షన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ ఛైర్మన్ ఎం.వి.ఆర్.ఫణీంద్ర ప్రకటనలో తెలిపారు.
నిత్యవసర వస్తువుల కొనుగోలు, వైద్య సేవలలో లోపాలు, చట్టాల అమలులో ఉల్లంఘనలకు పాల్పడిన ఉదంతాలు తమ సొసైటీకి తెలియచేసినట్లయితే తగిన నష్టపరిహారం పొందే విధంగా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని సహాయం కోసం కన్య్సూమర్ సొసైటీని సంప్రదించాలనుకునే వారు consumerrights@hotmail.com కు మెయిల్ లేక 9491256669 కు ఫోన్ చేసి, తగిన సలహాలు, సూచనలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు.