నిరుద్యోగుల కోసం ప్రత్యేక చట్టం

దేశ చరిత్రలోనే తొలిసారి నిరుద్యోగుల కోసం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది..


ఈ మేరకు ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయంటోంది. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని.. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా.. జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 


వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ఈ చట్టంపై ప్రశంసల సంగతి పక్కన పెడితే విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షం టీడీపీతో పాటూ కొందరు నిపుణులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం మంచిదే అయినా.. భవిష్యత్‌లో యువతకు కష్టాలు తప్పవంటున్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే కొన్ని సమస్యల్ని తెరపైకి తెస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయకుండా.. మన యువతకు ముప్పు ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 75శాతం ఉద్యోగాలకు స్థానికులకు ఇవ్వాలని చట్టం చేసింది. ఇదే చట్టం మిగిలిన రాష్ట్రాల్లో చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న వినపిస్తోంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పుణె వంటి నగరాల్లో ఏపీకి చెందిన యువతకు ఉద్యోగాలు వస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ చట్టంపై ఓ క్లారిటీ ఇవ్వాలంటున్నారు. స్థానికత ఏ ప్రాతితపదక తీసుకోవాలి.. ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందో చెప్పాలంటున్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, యూనిట్ ఎలా ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 


ఇక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నిపుణులు, పారిశ్రామికవేత్తలు. నైపుణ్యం కలిగిన ఉద్యోగాలంటే టాలెంట్ ముఖ్యమని.. కాబట్టి తప్పనిసరిగా పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకురావాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. దీనికి ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు.. 'విజయవాడలో హెచ్‌సీఎల్ యూనిట్ పరిస్థితిని ఆ సంస్థ యాజమాన్యం ఇలా చెబుతోంది. ఆ కంపెనీకి ప్రస్తుతం 1500 మంది టెక్నీషియన్లు ఉన్నారు.. రాబోయే ఐదేళ్లలో వారి సంఖ్యను 5 వేలకు పెంచుకోవాలని భావిస్తున్నారు'.  మరి అలాంటి నైపుణ్యంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వలేమంటున్నారు. అలాగని స్థానికులకు శిక్షణ ఇచ్చి తీసుకోవడం కూడా అంత తేలిగ్గా అయ్యే పనికాదని చెబుతున్నారు. అందుకు భారీగా ఖర్చు చేయడమే కాకుండా, సమయం పడుతుందని.. స్థానికులు నైపుణ్యం సాధించేవరకూ వేచి ఉండలేం కదా అని గోడు వెళ్లబోసుకుంటున్నారు. 


అలాగే 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధనతో.. కొన్ని పరిశ్రమలు రాష్ట్ర పెట్టబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించవనే వాదన వినిపిస్తోంది. ఈ నిబంధనలతో చాలామంది పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తారని.. దీంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలంటున్నారు.