రోజా సన్మాన సభ రసాభాస
వేదికపైనే వైసీపీ నాయకుల వర్గపోరు
కుల రాజకీయాలను,కుటుంబ పాలనను సహించబోమన్న కేజే కుమార్ దంపతులు
జగన్ దగ్గరే తేల్చుకుంటామని హెచ్చరిక
నగరి: నగరి వైసీపీ నాయకుల వర్గపోరుతో ఎమ్మెల్యే రోజా సన్మాన సభ రసాభాసగా మారింది. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా అమరావతిలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం నగరికి రోజా వస్తుండడంతో ఈ సన్మానసభ ఏర్పాటు చేశారు. పట్టణంలో పోటాపోటీగా వైసీపీ నాయకులు పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓపెన్‌టా్‌ప జీప్‌లో భర్త సెల్వమణి, వైసీపీ నాయకులతో కలసి రోజా భారీ ర్యాలీగా శనివారం సాయంత్రం ఏజేఎస్ కల్యాణ మండపంలో సన్మాన సభకు చేరుకున్నారు.నగరి నియోజకవర్గ వైసీపీ బూత్ కమిటీల కన్వీనర్ చంద్రారెడ్డి వేదికపైకి తొలుత రోజాను ఆహ్వానించారు.తరువాత ఆమె భర్తను, వడమాలపేట, పుత్తూరు మండలాల వైసీపీ ముఖ్య నాయకులను పిలిచారు.అప్పటి వరకు వేదిక కిందే ఉండిన నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి తమ వర్గీయులతో వేదికపైకి దూసుకువచ్చి ఎమ్మెల్యే రోజాతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో కిందనేవున్న వారి మద్దతుదారుల అరుపులతో కల్యాణ మండపం దద్దరిల్లిపోయింది. ఒక దశలో వేదికపైకి అందరూ దూసుకురావడంతో నిలువరించేందుకు పోలీసులు విఫల ప్రయత్నం చేశారు.చివరకు కేజే కుమార్ దంపతులను శాంతింపచేసిన తరువాత కూడా వారి ప్రసంగాల్లో భావోద్వేగాలు, ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్న రీతిలో సభ జరిగింది.
కేజే కుమార్ మాట్లాడుతూ పార్టీ అంటే తనకు ప్రాణమన్నారు. రోజా టీడీపీ తరపున రెండు సార్లు ఓడిపోవడంతో తానే స్వయంగా ఆమెను వైసీపీ తరపున పోటీ చేయమని ఆహ్వానించానన్నారు. అప్పటి నుంచి తన సోదరిగా భావించి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించానన్నారు.ఈ క్రమంలో తనపై, తన కుటుంబ సభ్యులపై టీడీపీ అధికారంలో వున్నప్పుడు అనేక కేసులు బనాయించారని వాపోయారు. సత్యవేడు, చిత్తూరు జైళ్లలో నెలల తరబడి ఉన్నామన్నారు. అయినా పార్టీ కోసం ఎక్కడా రాజీ పడకుండా పని చేశామన్నారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే కుటుంబ పాలన ఎక్కువైందని ఆరోపించారు. వీటిని చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదన్నారు.తమకు అన్యాయం చేసిన నాయకుల చరిత్రలు నామరూపాలు లేకుండా పోయాయన్నారు. తాము ఈ విషయాన్ని సీఎం జగన్ వద్దే తేల్చుకుంటామని, అన్ని వాస్తవాలూ అక్కడే చెబుతామని ప్రకటించారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి మాట్లాడుతూ అన్ని కులాల వారూ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా రోజా గెలిచారని, అయితే అంతా కుల రాజకీయాలైపోయాయని, ఒక వర్గం వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని ఆరోపించారు.