ఏ పి యూ డబ్ల్యూ జె వ్యవస్థాపక దినోత్సవం

 


ఘనంగా ఏపీయూడబ్లూజే 62వ వ్యవస్థాపక దినోత్సవం



ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్ల్యూజే) 62 వ వార్షికోత్సవం శనివారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ పతాకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ,ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి పి.వెంకట్రావు ఆవిష్కరించారు. అనంతరం ఏపీయుడబ్ల్యూజే యూనియన్ వ్యవస్థాపకులు మనికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బందరు రోడ్డులోని నిర్మల్ హృదయభవన్ లో 90 మంది వృద్ధులకు యాపిల్స్,అరటి పండ్లు పంపిణీ చేశారు. 
  
పోరాట చరిత్ర ఏపీయుడబ్ల్యూజే సొంతం..


ఏపీయుడబ్ల్యూజే రాష్ట్రంలోని జర్నలిస్ట్ ల సంక్షేమ పథకాలు సాధనకు 62 సంవత్సరాలు గా సుదీర్ఘ పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాదించిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వ్యవస్థాపక కార్యదర్శి పొట్లూరి వెంకట్రావు ఉద్ఘాటించారు. కృష్ణా అర్బన్ యూనియన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన సభలో ఐజేయు జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్ధవంతమైన నాయకత్వం ద్వారా యూనియన్ ఎంతో బలో పేతంగా ఉందన్నారు. తొలుత యూనియన్ కేంద్రంగా విజయవాడ నుండే అనేక పోరాటాలు నిర్వహించ బడ్డాయన్నారు.  ఆనాడు 37 మందితో ప్రారంభమైన యూనియన్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల మంది సభ్యులను కలిగి ఉందన్నారు.  వివిధ పత్రికల్లోని జర్నలిస్టుల, నాన్ జర్నలిస్ట్ ల సంపూర్ణ సహకారంతో యూనియన్ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. మూత పడిన అంధ్రజ్యోతిని తెరిపించడంలోను, ఆంధ్రపత్రిక ఉద్యోగులు ,కార్మికులకు అణా పైసలు తో సహా ఇప్పించడంలో ఏపీయుడబ్ల్యూజే చేసిన కృషి ఎనలేనిదని ఆయన వివరించారు. ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ ,ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఉపాధ్యక్షడు కె.జయరాజ్,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, యూనియన్ సీనియర్ నాయకులు ఎస్ కె బాబు తదితరులు ప్రసంగిస్తూ యూనియన్ పటిష్ఠతకు , ఐక్యతకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలని కోరారు. పత్రిక, మీడియా స్వేచ్ఛకు నేడు ఎదురవుతున్న సవాళ్ళను యూనియన్ సమర్ధవంతంగా ఎదుర్కొని తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత ను వారు వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన పి.వెంకట్రావు ను యూనియన్ నేతలు ఘనంగా సత్కరించారు. తొలుత ఏపీయుడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు స్వాగతం పలుకగా ప్రెస్ క్లబ్  కార్యదర్శి ఆర్.సూర్య కిరణ్ వందన సమర్పణ చేశారు.