జర్నలిస్టుల సంక్షేమ మే ఏపిఎంఏఫ్ లక్ష్యం

 


జర్నలిస్టుల సంక్షేమమే ఎపిఎంఎఫ్ లక్ష్యం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డిల్లీబాబు రెడ్డి విశాఖపట్నం : జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పని చేస్తోందని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి చెప్పారు. ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా మహాసభ ఆదివారం నాడు రామా టాకీస్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో విశాఖ సమాచారం సంపాదకులు, రాష్ట్ర చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షులు సూరంపూడి వీరభద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డిల్లీబాబు రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత మన రాష్ట్ర జర్నలిస్టుల కోసం మన యూనియన్ ఉండాలనే లక్ష్యంతోనే ఎపిఎంఎఫ్ను స్థాపించినట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత వారికి నెలవారీ పెన్షన్ అందించేలా పథకం అమలు కోసం ఎపిఎంఎఫ్ కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా మీడియా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటన ఛార్జీల నుండి రెండు శాతం నిధులు జర్నలిస్టుల సంక్షేమానికి జమ చేస్తే ఈ పెన్షన్ స్కీం ను నడిపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.  వివిధ రాష్రాలలో అమలు చేస్తున్న జర్నలిస్టుల పెన్షన్ పథకాలను అధ్యయనం చేసి ఒక ప్రతిపాదన సిద్ధం చేశామని ఆయన చెప్పారు.  త్వరలో ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డిని కలిసి పెన్షన్ స్కీం అమలు కోసం వినతి పత్రం అందిస్తామని వెల్లడించారు. ఎపిఎంఎఫ్ ప్రతిపాదన మేరకు జర్నలిస్టులకు వారు పని చేసే ఆయా ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తన ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా హామీల అమలు కోసం అధికారులకు, తన మంత్రి వర్గ సహచరులకు సూచనలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి తన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆరు నెలలు వేచి చూసిన తరువాత జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అవసరమైతే ఉద్యమాలకు కూడా సిద్ధమని ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన విశాఖ సమాచారం సంపాదకులు ఎస్. వీరభద్రరావు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎపిఎంఎఫ్ చేస్తున్న కృషిని వివరించారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి బి. సతీష్ బాబు, ఆంధ్రావాయిస్ ఎడిటర్ బి.గిరిబాబు, ఎపిఎంఎఫ్ విశాఖ అడ్ హక్ కమిటీ కన్వీనర్ టి.బంటయ్య, కో కన్వీనర్లు దొండా రమేష్,  శీల గురువులు, ఎ.సాంబశివరావు, కడప జిల్లా ఎపిఎంఎఫ్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ ఆంజనేయరెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఉదయ భాస్కర్,  ఎపిఎంఎఫ్ శ్రీకాకుళం శాఖ అధ్యక్ష,కార్యదర్శులు నాగభూషణం, డోలా అప్పన్న, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. అనంతరం విశాఖ జిల్లా ఎపిఎంఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ చీఫ్ రిపోర్టర్ జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా టి.బంటయ్య,  కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎ.సాంబశివరావు,  కోశాధికారిగా పి.శ్రీదేవి ఎన్నికయ్యారు.  ఉపాధ్యక్షులుగా ఎం.లత, శీల గురువులు, నాగేశ్వరరావు, కార్యదర్శులుగా మురళి అఖిల్, టి.శంకర్ నాయుడు, టి.ఎన్.ఎస్. కృష్ణకుమార్, సహాయ కార్యదర్శులుగా కె. సుబ్బారావు, ఎస్.  శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా బాల శేఖర్, ఎన్. రవికుమార్, బి.ఎ.రాజు, ఎస్. రామకృష్ణ, ఇ. దారబాబు, కె.రామారావు, ఎస్. రాజు,  ఎన్. రాము ఎన్నికయ్యారు.