సాహోకి జగన్ షాక్

సాహోకి షాక్.. టాలీవుడ్‌ పెద్దలకు సీఎం జగన్ హెచ్చరిక?


 సాహో సినిమాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆస్కారం ఇవ్వాలంటూ యూవీ క్రియేషన్స్ చేసిన విజ్ఞప్తికి నో చెప్పింది. దీంతో సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఆస్కారం లేదు. సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాకు మొదటి వారం టికెట్ల రేట్లు పెంచుకోవడం ద్వారా కొంత మేర లబ్ధి పొందుతామని భావించే నిర్మాతలకు ఇది షాకింగ్ న్యూస్. అయితే, ఈ షాక్ కేవలం ఒక్క సాహో నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్‌కు మాత్రమే పరిమితం కాదు. అది టాలీవుడ్ మొత్తానికి వర్తిస్తుందనే అభిప్రాయం సినిమావర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు సాహో సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి నో చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు చిరంజీవి సైరా నరసింహారెడ్డికి కూడా అదే ఫార్ములా అమలు చేస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను తెరకెక్కిస్తున్నామని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలసి రాయితీలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించడం లేదు. 


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని 30 ఇయర్స్ పృథ్వీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే, ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా కనీసం అమరావతి వెళ్లి జగన్‌ను పలకరించలేదన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యి ఉంటే తెల్లవారుజామున ఫ్లైట్‌కే వెళ్లి ఆయన్ను అభినందించేవారని చెప్పారు. దీంతో సినిమా పరిశ్రమ నుంచి కొందరు జగన్‌కు మద్దతిచ్చినా.. కొందరు ముఖ్యమైన వారు జగన్‌ను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోని వారికి రాయితీలు, ఇతరత్రా లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏంటనే వాదన వైసీపీలో ఉంది. అందువల్లే సాహో సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఇదే వైఖరి అవలంభించే అవకాశం ఉంది. ఈ విషయం టాలీవుడ్ పెద్దలకు తెలియనిదేం కాదు. అయితే, మరి వారేం చేస్తారనేది చూడాలి.