యురేనియం తవ్వకాలను ఎందుకు వ్యతిరేకించాలి?

 


యురేనియం_తవ్వకాలను_ఎందుకు_వ్యతిరేకించాలి?


- తెలంగాణ ప్రజా ఫ్రంట్ 


భూమిలో ఉన్నంతవరకు యురేనియం(సీసాలోని భూతం లాంటిది. సీసా మూత తీస్తే భూతం మనల్ని మింగేసినట్టుగా) క్షేమకరమైనది. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరిపి ఆక్సైడ్గా విడిపోయి గాలిలో కలిసి పోతుంది. బయటకి రాగానే దానికి అణు ధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75శాతం అధికంగా ఉంటుంది. దీని అర్థ జీవిత కాలం 450 సంవత్సరాలు. న్యూక్లియర్ రియాక్టర్లలో చర్య జరిగినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం యు-235 తక్కువలో తక్కువగా 7 కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయవచ్చు. యురేనియం(యు-238) నుంచి జనించే ఫుటోనియం అనే రూపం(పీయు-239) అత్యంత ప్రమాదకరమైంది.


యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలో అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లోకి, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీనితో చాలా సులభంగా క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుంది. భూమి లోనుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది.


యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్నివందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి పీల్చిన జంతువులు(మనుషులతో సహా), నీటిని తాగిన జంతువులు, మనుషులు ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్తో చనిపోతారు. కొన్ని వందల తరాలు వికృత సంతానంలో లేదా పూర్తిగా సంతానలేమితో మానసికంగా చిత్రవధకు గురయ్యే ప్రమాదం ఉంది.
పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, స్త్రీలలో అండాల విడుదల క్రమం దెబ్బతినడం, గర్భాశయ క్యాన్సర్ వంటి పరిస్థితులను ఎదుర్కోవాలి.


2009 సంవత్సరంలో పెద్దగట్టు ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఏర్పడిన గుంతల్లో వర్షాలకు వచ్చిన నీటిని తాగిన పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతున్నాయి. యురేనియాన్ని భూగర్భ గనుల నుంచి తీసినా, ఓపెన్ బావుల ద్వారా తీసినా ఏ రకంగా తీసినా ఇది ప్రమాదమే. ఈ అవగాహనతో యురేనియం తవ్వకాలను వ్యతిరేకించాలి. భవిష్యత్ తరాలకు చెప్పాలి.


పర్యావరణంపై ప్రభావం:


యూఎస్ ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినప్పుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టితో కలిసి ఉంటాయి. తద్వారా మొక్కల, చెట్ల వేర్లలో నిక్షిప్తమవుతాయి.


యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వలన 200-300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందకు దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే నదులయందు, నీటి సెలయేళ్లయందు అణు ధార్మిక పదార్థాలు కలవటం వలన రాను రాను నీటి వనరులు మొత్తం విష పదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి. మండుతున్న యురేనియంతో కార్బన్ ను చర్య జరపడం వలన యురేనియం మోనాక్సైడ్, యురేనియం డై ఆక్సైడ్లు ఏర్పడి 1800 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అందువలన వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. కేంద్ర వ్యవసాయ సంరక్షణ చట్టం ప్రకారం పులుల రక్షిత ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి పరిశ్రమలకు అనుమతులు లేవు.


నల్లమల ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?


నల్లమల ఇప్పుడు 7 జిలాల్ల పరిధిలో విస్తరించిన అత్యంత సారవంతమైన అటవీ ప్రాంతం. దక్షిణ భారతదేశానికి ప్రకృతి సహజసిద్ధంగా రక్షణ కల్పిస్తున్నఎత్తైన నల్లమల కొండలు, గుట్టలు, దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతం. అడవి జంతువుల నివాసానికి అత్యంత అనువైన ప్రాంతం. పెంపుడు జంతువులకు, మానవాళికి ఇతర పశుపక్షాదులకు కన్నతల్లి ఈ నల్లమల. ఆదివాసీలకు, ఆదివాసేతర ప్రజలకు జీవనాధారం ఈ పీఠభూమి. కాబట్టి సహజంగానే కాళ్ల కింద భూమి కదిలిపోతున్నప్పుడు అనివార్యంగా ప్రజలు ప్రతిఘటన పోరాటాలను ఎంచుకుంటారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ, దేశీయ కంపెనీలతో కుమ్మక్కై అమెరికన్ రక్త జలగలను మెప్పించడం కోసం నల్లమలపై ముప్పేట దాడి చేస్తున్నారు. అటవీ చట్టాల పేరుతో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని తొందర పడుతున్నారు. పాలకుల ఈ కపట నాటకాలు బహిర్గతమయ్యే సరికి ఇప్పుడు కొత్తగా ఫారెస్టు అధికారుల రూపంలో ʹశక్తిʹ అనే ఒక ఎన్జీవో రూపంలో ఈ ప్రాంతం నుంచి గ్రామాలను ఖాళీ చేసే దుష్ట పన్నాగం అల్లారు. అందులో భాగంగానే పులుల సంరక్షణ పేరుతో మొదటి విడతగా వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాలను తరలించాలని, రెండో విడతగా లోతట్టు చెంచుగూడేలను తరలించాలని,
భూమి మీద హక్కులు లేవని, ఆదివాసేతర పీడిత ప్రజలనుంచి పోడు భూములు బలవంతంగా లాక్కొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కావున ఇక్కడ పేద ప్రజానీకం మొత్తం తమ భూమిని తమ అడవిని రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.


యురేనియం తవ్వకాలను అడ్డుకోవడం మనందరి కర్తవ్యం


పర్యావరణవేత్తలు, ప్రజలు, మేధావులు, ప్రజాస్వామిక సంస్థల అభిప్రాయం ప్రకారం ప్రకృతిలో తరగని శక్తి వనరులైన సూర్యకాంతి, పవన విద్యుత్, సముద్రపు అలలు జియో థర్మల్ వంటివి, వ్యర్థ పదార్థాలు, విసర్జితాలని ఉపయోగించి స్థిరంగా ప్రజల అవసరాలను తీర్చే విద్యుత్ ఉత్పత్తిని నిరంతరం తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. పూర్వ కాలం నుంచి నూనెలను బొగ్గును, సహజ వాయువులను మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. దీని నుంచి ఒక స్థిరమైన మార్పు జరిగి నూనెలు, వాయువులు స్థానే సోలార్, జియో థర్మల్, బయోగ్యాస్ పవన విద్యుత్ వంటివి అత్యుత్తమ ప్రత్యామ్నాయాలుగా గుర్తించబడ్డాయి.


2050 సంవత్సరం నాటికి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, శిలాజాల నుంచి వచ్చే ఇంధనాన్ని 50 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అణు విద్యుత్తు దశల వారీగా ఎత్తివేయాలని నిర్ణయించారు. వినూత్నమైన సాంకేతిక పద్ధతులే విద్యుత్ సామర్థ్యాన్ని పెంచగలుగుతాయి. 2050 నాటికి మేధావుల అంచనాల ప్రకారం విద్యుత్ ఉత్పత్తిలో అధిక భాగం పునరుత్పత్తి శక్తి వనరుల ద్వారానే లభించే అవకాశంగా ఉన్నది. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాల మెప్పుకోసం, బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం మన పాలక వర్గాలు పాకులాడుతూ వినాశకరమైన, ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్నారు. ప్రజల అభివృద్ధి నమూనాను పక్కన పెట్టి వారు కొనసాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధిలో దేశంలోని ఆదివాసీలు, దళితులు, బలహీనవర్గాల వారు, ముస్లిం మైనారిటీలు సమిధలవుతున్నారు. ఎన్నికల సమయంలో వారిచ్చిన హామీలను వారే కాలరాస్తున్నారు. దేశం సౌభాగ్యం కోసం, రైతులు, రైతు కూలీలు, శ్రామికులు తమ రక్తాన్ని ధారపోస్తుంటే రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు. యురేనియంలాంటి ఖనిజ నిక్షేపాల వెలికితీత విధ్వంసకర అభివృద్ధి నమూనాలో భాగమే.


ప్రపంచ వ్యాప్తంగా అన్ని అభివృద్ది చెందిన దేశాలలో అణ్వాయుధాలకు, అణువిద్యుత్ కు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాలు నడిపితేనే పాలకులు దిగి వస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా ప్రాన్స్ మొదలగు దేశాలలో యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు చేసుకున్నారు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ దేశాలలో ప్లాంట్లను నిర్మించినప్పటికీ ప్రజల ఆగ్రహంతో నిర్వహణను ఆపివేశారు. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికీ పోరాటం చేస్తునే ఉన్నారు. మేఘాలయ రాష్ట్రంలో తవ్వకాలను ఆపేశారు. ఇప్పుడు నల్లమల ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం యురేనియం తవ్వకాల కోసం అనుమతులిచ్చింది. ఈ ఫాసిస్టు విధానాలను విశాల ఐక్య ఉద్యమాలతోనే ఎదిరించగలుగుతామనేది చరిత్ర చెప్పిన వాస్తవం.


నల్లమల ప్రాంతంలోని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు, మధ్యతరగతిజీవులు, విద్యార్థులు, కుల, ప్రజా సంఘాలు, కలిసొచ్చే రాజకీయ పార్టీలందరితో కలిపి పాలక వర్గాలపై ప్రతిఘటన పోరాటం చేయకపోతే మన అస్థిత్వాన్ని కోల్పోతాము. భావి తరాలకు ద్రోహం చేసిన వాళ్లమవుతాము. కావున యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీలో వ్యక్తులుగా, సంస్థలుగా పాల్గొని భుజం, భుజం కలిపి నడుద్దాం.