హైదరాబాద్ లో జీఐఎస్ మ్యాపింగ్
హైదరాబాద్ నగరం లోని ప్రతి భవనానికీ కొలతల లెక్క తేల్చాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఏ భవనం ఎన్ని అంతస్తులు ఉంది..? నిర్మాణ విస్తీర్ణం ఎంత..? అన్నది సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించాలని నిర్ణయించారు. మహానగర జీఐఎస్ మ్యాపింగ్ కోసం ఉన్నతాధికారులతో కలిసి కమిషనర్ ఎం.దానకిషోర్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్, డెవల్‌పమెంట్ ఏజెన్సీ ప్రతినిధులతో గురువారం చర్చించారు. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా భవనాల లెక్కలు తేల్చే అంశాన్నీ పరిశీలించనున్నారు. నగరంలో 22 లక్షలకుపైగా భవనాలు ఉండగా.. ప్రస్తుతం 14.80 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. దాదాపు ఆరేడు లక్షల నిర్మాణాలకు సంబంధించి పన్ను వసూలు కావడం లేదు. ప్రత్యేక బృందాలు, సిబ్బందితో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించినా పక్కా లెక్కలు తేలకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు.