కుంభస్థలాన్ని కొట్టిన కుబేరులు

 


*_కుంభస్థలాన్ని కొట్టిన కుభేరులు_*
◆ నిమిషానికి రూ.49లక్షలు
◆ సంపన్నుల సంపాదన ఇదీ
◆ ఆర్థిక మానవ సంబంధాలు
◆ ఓ యువతా మేలుకో


*_"పేదవాడిగా పుట్టడం నేరం కాదు.. పేదవాడిగా మరణించడం నేరమే....- వివేకానంద చెప్పిన జీవితసత్యం ఓ అద్భుతం. సమాజంలో డబ్బు సంపాదనే ఓ అర్హతగా మారింది. ఇదో ఆందోళనకరమైన అవాంఛనీయ పరిణామం. అవసరాలకు మించి చాలామంది సంపాదిస్తూ... సౌకర్యవంతంగా బతకటం మర్చిపోయారు. మర్చిపోతున్నారు. అయితే సమాజంలో డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే అంత బలవంతుడు. ఆ లెక్కన మన రాజకీయులు, వారి బినామీలు ఏటా అనైతికంగా సంపాదించే సంపాదన ఎంత ఉంటుంది.? కానీ, చట్టబద్ధంగా సగర్వంగా 'ఇది నా సంపాదన' అని ప్రపంచం చెప్పుకునేలా సంపాదించారు. నిద్రిస్తున్నా... మేలువకగా ఉన్నా.. వీరు ఇక ఏపనీ చేయకున్నా నికర ఆదాయం వస్తుంది. అలా అని వారు నిస్తేజంగా ఉండరు. నిరంతరం కష్టపడతారు. యువత మేలుకో. వీళ్ళే మీ టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కుంభస్థలాన్ని కొట్టిన కుబేరులతో ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. 2019 ఫిబ్రవరి చివరినాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను ఫోర్బ్స్‌ లెక్కించింది._*


ఇలా..:
భారతదేశంలో వార్షిక వేతనం రూ. 25లక్షలు ఉంటే అద్భుతమైన జీతం కింద లెక్కగడతారు. అదే వ్యాపారవేత్త ఏటా రూ. 10 కోట్ల లాభం సంపాదిస్తే అద్భుతమైన వ్యాపారం కిందే లెక్క..! ఒక సగటు పారిశ్రామిక వేత్త ఏటా రూ.100 కోట్ల లాభం కళ్ల జూస్తే అతనికి తిరుగే లేదు. కానీ, ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఒక్క రోజులోనే వీటికి ఎన్నోరెట్లు సంపాదిస్తోంది.


నిమిషానికి 47లక్షలూ...:
వాల్‌ మార్ట్‌ లోని ప్రధాన వాటాదారులైన వాల్టన్‌ కుటుంబం ఒక్క నిమిషానికి 70 వేల డాలర్లను సంపాదిస్తుంది. అంటే అక్షరాల రూ.49,72,947 అన్నమాట. ఇక గంటకు  40 లక్షల  డాలర్లు(రూ.28 కోట్లకు పైమాటే), రోజుకు 100 మిలియన్‌ డాలర్లు (రూ.710కోట్లు) వీరి సంపదకు అదనంగా వచ్చి చేరుతోంది. దీంతో వీరు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం జాబితాలో దూసుకుపోతున్నారు. అదే సమయంలో వాల్‌ మార్ట్‌లో కొత్త ఉద్యోగి 11 డాలర్లను సంపాదిస్తాడు. 
వీరిలో అమెరికన్‌ సంపన్నుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది.
1929 నుంచి వీరి ఆధిక్యం కొనసాగుతోంది. ఇక ఈ జాబితా ప్రకారం డాస్సాల్ట్‌, డంకన్‌, లీ, హెరెస్ట్‌ కుటుంబాల ఆస్తులు కరిగిపోయినట్లు కూడా తెలుస్తోంది.


24% వృద్ధి:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 మంది సంపన్నులకు 1.4ట్రిలియన్‌ డాలర్ల సంపద ఉంది. గత ఏడాదితో పోలిస్తే 24శాతం వృద్ధి చెందింది. యూరోప్‌, ఆసియాలో సంపన్నులు వేగంగా వృద్ధి చెందారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబాలు వాటి ఆదాయాల పెరుగుదలను చూద్దాం.


* 2018 జూన్‌ నుంచి వాల్టన్‌ కుటుంబం ఆదాయం 39 బిలియన్‌ డాలర్లు పెరిగి 191 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం.


* అమెరికా చాక్లెట్‌ సామ్రాజ్యాన్ని ఏలే మార్స్‌ కుటుంబం సంపద 37 బిలియన్‌ డాలర్లు పెరిగి 127 బిలియన్‌ డాలర్లకు చేరింది.


* అమెరికా పెట్రోలియం దిగ్గజం కోచ్‌ కుటుంబం సంపద 26 బిలియన్‌ డాలర్లు పెరిగి 125 బిలియన్‌ డాలర్లకు చేరింది.
 
* సౌదీ రాజకుటుంబానికి చెందిన సౌద్ ల సంపద 100 బిలియన్‌ డాలర్లకు చేరింది. రాయల్‌ దివాన్‌ చెల్లింపుల ఆధారంగా దీనిని లెక్కగట్టారు. ఈ కుటుంబం చెప్పుచేతల్లోనే సౌదీ దిగ్గజ ఆయిల్‌ కంపెనీ ఆరామ్‌కో ఉంది. దీని విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు ఉండవచ్చని అంచనా.


* ఇక ఈ జాబితాలో మన అంబానీ కుటుంబం సంపద 7 బిలియన్‌ డాలర్లు పెరిగి 50 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు అంచనావేశారు. 
ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లూమ్ ‌బెర్గ్‌ సంపన్నుల జాబితాలో 25కుటుంబాల ఆస్తి గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 250 బిలియన్‌ డాలర్లు పెరిగింది.


*జాబితాలో వివరాలివి:*
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. దీంట్లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ఆస్తి 2018 కంటే 1900 కోట్ల డాలర్లు మేర పెరిగి 13100 కోట్ల డాలర్ల అంటే మన కరెన్సీలో రూ. 9లక్షల కోట్లుకు చేరింది. దీంతో మరోసారి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం. రెండో స్థానంలో బిల్‌ గేట్స్‌ 9650 కోట్ల డాలర్లతో ఉన్నారు , వారెన్‌ బఫెట్‌ 8250 కోట్ల డాలర్లతోమూడో స్థానంలో నిలిచారు .ముకేశ్‌ అంబానీ 13వ స్థానాన్ని సంపాదించుకున్నారు.


*ముఖేష్ అంబానీ:*
అంబానీ 6 స్థానాలు బెటర్ చేసుకోవటం విశేషం. ముకేశ్‌ అంబానీ సంపద 2018లో 4010 కోట్ల డాలర్లు కాగా..దాని నుంచి పెరిగి 5000 కోట్ల డాలర్లకు అంటే భారతీయ కరెన్సీలో రూ.3.5 లక్షల కోట్లకు చేరింది. 2017లో ముకేశ్‌ అంబానీ 37వ స్థానంలో ఉన్నారు. 2018లో 19వ స్థానానికి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నారు. 2019తో మరో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరారు. 


*భారతీయులలో తెలుగువారు..*
ఫోర్బ్స్‌ రూపొందించిన కుబేరుల జాబితాలో నలుగురు తెలుగువారికి చోటు లభించింది. దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకుడు మురళీ దివి 3.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 645వ ర్యాంకు పొందారు. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పి.వి.రామ్ ‌ప్రసాద్‌ రెడ్డికి 804వ ర్యాంకు లభించింది. ఆయన నికర సంపద 2.8 బిలియన్‌ డాలర్లు. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ ‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యవస్థాపకుడు పి.పి.రెడ్డి (1008 ర్యాంకు), ఎండీ పి.వి.కృష్ణారెడ్డి (1057 ర్యాంకు) కూడా జాబితాలో చోటు సంపాదించారు. వీరిద్దరి నికర సంపద వరుసగా 2.3 బిలియన్‌ డాలర్లు, 2.2 బిలియన్‌ డాలర్లు.