మట్టి విగ్రహాలు వాడండి.. పర్యావరణాన్ని కాపాడండి.. : మంత్రి అల్లోల
హైదరాబాద్,ఆగస్టు 22: వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఆలయ ఈవోలకు అందజేశారు. పర్యావరణహిత మట్టి విగ్రహాలపై TSPCB రూపోందించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను మంత్రి అల్లోల ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు మట్టితో కూడిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించుకోవాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారమవుతామన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో 1.60 లక్షల పర్యావరణహిత మట్టి విగ్రహాలను తయారు చేసి ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మట్టి విగ్రహాల వల్ల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, రసాయన విగ్రహాలు ఏర్పాటు వల్ల కలిగే పరిణామాలను ప్రజలకు తెలియజేసేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.
వారికి అవగాహన కల్పించేందుకు బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని దేవాదాయ శాఖ ఆలయాల్లో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్టిస్తున్నామని స్పష్టం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో చేసిన విగ్రహాలు, రంగురంగులతో చేసిన వినాయక విగ్రహాలను నెలకొల్పి తదుపరి నీళ్లలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో నివసించే ప్రాణులు సైతం మృత్యు కుహరంలోకి వెళుతున్నాయన్నారు. ఆ విగ్రహాలు నీటిలో కలిసిపోకుండా ఉంటాయన్నారు. రసాయనాలతో చేసిన విగ్రహాలను నీళ్లలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువల్లో మట్టి పేరుకుపోయి నీటి నిల్వల శాతం తగ్గిపోయేందుకు కారణమవుతుందన్నారు. మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఆ విగ్రహాల వల్ల ఎటువంటి హాని ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు మట్టితో కూడిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించుకోవాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారమవుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస రావు, TSPCB సీఈఈ నగేష్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంట్ సైంటిస్ట్ మురళీ మోహన్, ఎస్ఈఈ రమేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.