రిజర్వేషన్లు పై ప్రధాని మోదీకి ముద్రగడ లేఖ
కాపులకు రిజర్వేషన్లపై అంశంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2017లో తెదేపా ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కోటా కేటాయించిందని, దీనిని కేంద్రం ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు తమ జాతిని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
ఉప్పొంగిన కృష్ణమ్మ
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. జలాశయాలన్నింటినీ నింపుకుంటూ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలకళను సంతరించుకున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా నాగార్జునసాగర్ గేట్లన్నీ ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మరో రెండురోజుల పాటు వరద కొనసాగే అవకాశముంది. మరోవైపు పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి.
తెదేపా నేతల మూడు ఇళ్లు కూల్చివేత
నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనార్దన్ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య ఉదయం నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని తెదేపా నేతలు అంటున్నారు. తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
కశ్మీర్ ప్రజల గళాన్ని వినాల్సిందే: మన్మోహన్
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు దేశ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతీయత అనే భావం కశ్మీర్ ప్రజల్లో బలంగా ప్రబలాలంటే వారి గళాన్ని సైతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం చాలా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని.. ఈ తరుణంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అండ కొరవడిందని అంగీకరించిన పాక్!
కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో భారత్‌పై పాక్ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐరాస భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు.