లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ X ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అరంగేట్రం చేసే తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పేర్కొన్నాడు. మైదానంలో అడుగుపెట్టి తానేం చేయగలనో అదే చేస్తానని చెప్పాడు. అద్భుతాలు చేస్తానని కాకుండా.. చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తానని అన్నాడు. ప్రపంచకప్ సమయంలో పక్కటెముకలు పట్టేయడంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకొని టెస్టుల్లో అరంగేట్రం కోసం సిద్ధమయ్యాడు.
గతవారం ఇంగ్లాండ్‌లోని ససెక్స్ సెకండ్ XI జట్టుతో కౌంటీ క్రికెట్ ఆడిన ఆర్చర్.. శతకం బాదడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. మరోవైపు తొలి టెస్టులో కండరాల నొప్పితో నాలుగు ఓవర్ల పాటే బౌలింగ్ చేసిన అండర్సన్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి బదులు ఆర్చర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆర్చర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఇటీవలే ససెక్స్ జట్టుతో ఆడిన సందర్భంలో వాళ్లు చెప్పిన ఓవర్లకన్నా ఎక్కువే బౌలింగ్ చేశానని చెప్పాడు. అది తనకు మంచి సాధనగా మారిందని తెలిపాడు. తానెప్పుడూ ఫూర్తిఫిట్‌నెస్‌తో లేనని, ప్రపంచకప్‌లో సమయం దొరకని కారణంగా తర్వాత మంచి విశ్రాంతి తీసుకున్నానని చెప్పాడు. కొద్దిరోజుల్లోనే అంతా సర్దుకుపోయిందని ఇంగ్లాండ్ పేసర్ వివరించాడు.
మరోవైపు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలను ఆర్చర్ కొట్టిపారేశాడు. 'ఆర్చర్‌తో ఎక్కువ స్పెల్స్ బౌలింగ్ వేసేలా చేసి, అతడు సహనం కోల్పోయేలా చూడాలని' లాంగర్ అన్నాడు. ఈ విషయంపై స్పందించిన పేసర్.. 'లాంగర్ నన్ను వేరేలా అర్థం చేసుకున్నాడని తెలుస్తోంది. నేను టెస్టుల కన్నా వన్డే క్రికెటే ఎక్కువ ఆడాను. అయితే ఒక ఆటగాడికి టెస్టుల్లోనే ఎక్కువ అవకాశాలు వస్తాయి. 50 ఓవర్ల క్రికెట్‌లో ఓ పది ఓవర్లు చెత్తగా వేస్తే అంతే సంగతి. కాబట్టి వన్డేల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ, టెస్టు క్రికెట్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లాంటిది. ఇక్కడ మన బలాబలాలు తెలుసుకొని అందుకు తగ్గట్టు మారే అవకాశం దొరుకుతుంది' అని పేర్కొన్నాడు.