చిత్తూరు : రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలపాలనే విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రెండుసార్లు చర్చలు జరిగాయన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ తమిళనాడు కంచిలోని అత్తివరదరాజ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమలో వర్షాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. గోదావరి జలాలు వృధాగా పోనివ్వకుండా ఏపీ ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏపీకి యువనాయకుడు పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారని, ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.