కాశ్మిర్ కధకు ఇదేనా ముగింపు?

 


కాశ్మీర్ కథకు క్రూర ముగింపు


కాశ్మీరును ముక్కలు చేస్తూ కేంద్రం తెచ్చిన బిల్లు దెబ్బ మామూలు దెబ్బకాదు. ఈ బిల్లు పాసుకావడం కోసం ప్రభుత్వం ప్రజలముందుకు తప్పుడు వాదనలనుంచిన్ది.అబద్దాలను వండి వార్చింది. చరిత్రను వక్రీకరించింది. కొంత చరిత్రను చెరిపివేసింది.దీన్ని తిప్పికొట్టటానికి కావాల్సిన సమాచారం,విశ్లేషణ , ఆధారం మనం చూపించగలగాలి.ఆ ప్రయత్నంలో భాగమే. 


1.నిజంగా కశ్మీర్ భారతదేశ అంతర్భాగమేనా?


కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు . ఔను.
శతాబ్దాలుగా కాశ్మీర్ లోయ స్వతంత్ర రాజ్యంగానే బ్రతికింది. 
భారత ఉపఖండం ఏర్పడిండి 14వ శతాబ్దంలో. మొదటినుంచీ కాశ్మీర్ అందులో అంతర్భాగం కావడం ఎలా సాద్ధ్యమని వాదిస్తున్నారు.
భారతదేశం భారతదేశం అనే రూపాన్ని తీసుకుంది బ్రిటిష్ పాలనాకిందే.కాశ్మీర్ ను హిందూ మతానికి చెందిన రాజవంశాలు పాలిస్తూ వచ్చాయి కాబట్టి ఇది  హిందూ రాజ్యమనీ  అలాగే ఇది  భారతదేశంలో అంతర్భాగం అని  ఏవిధంగా ప్రచారాలు చేస్తున్నారీ పాలకులు.


2.భారత్ సంబంధంలోకి కాశ్మీర్ ఎలా వచ్చింది?


అక్బర్ చక్రవర్తి కాశ్మీర్ మీద యుద్దం చేసి దాన్ని మొగల్ సామ్రాజ్యంలో బాగం చేసుకుని చక్రవర్తి వేసవి విడిదిగా ఏర్పాటు చేసేదాకా ... కాశ్మీర్ స్వతంత్ర దేశం.ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాలకుల చేతుల్లోకి కాశ్మీర్ పడింది. పఠాన్ ల చెప్పు చేతల్లో నడిచే హిందూ రాజ వంశాలే అక్కడ పాలన సాగించాయి. 
ఆ తర్వాత సిక్కు పాలకుల చేతుల్లోకి పోయింది. వారు బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందాల్లో బాగంగా జమ్మూకాశ్మీర్ ను బ్రిటిష్ వారికి అప్పగించేశారు. 
జమ్మూకాశ్మీర్ ను తగిలించుకోడానికి పెద్దగా ఇష్టపడని బ్రిటిష్ వారితో స్థానిక రాజు ఓ రాజకీయ బేరం   కుదుర్చుకున్నారు.తనను పాలకుడ్ని చేస్తే డెబ్బైఐదు లక్షల టాక్స్ కడతాననేది గులాబ్ సింగ్ బ్రిటిష్ వారికిచ్చిన ఆఫర్ .  బ్రిటిష్ వారు అంగీకరించి  అమృత్ సర్ లో ఒప్పందం చేసుకున్నారు. అలా ఇప్పటి జమ్మూకాశ్మీర్  ఒక సంస్దానాధీశుడి పాలనాకిందికొచ్చింది.


 3.హరిసింగ్ చేసిన పనేంటి?


గులాబ్ సింగ్ వారసుడే రాజా హరిసింగ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ హరిసింగే అక్కడ పాలకుడుగా ఉన్నాడు. జమ్ములో హిందువుల జనాభా అధికం అయితే కాశ్మీర్ లో ముస్లింల జనాభా అధికం. 
హరిసింగ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటుకు మతం రంగు పూయడం ద్వారా ప్రజల్లో చీలికలు తీసుకువచ్చి పదవి 
నిలుపుకోగలిగాడు హరిసింగ్. కాశ్మీర్ లో హిందువుల మీద ముస్లింల దాడులు ... వాటినుంచి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం చేసిన రక్షణ ప్రయత్నాల్లో భాగంగానే ముస్లిం నాయకులను పట్టుకుని కేసులు పెట్టడం కాల్చేయడం లాంటి కార్యక్రమాలను సైతం అమలు చేసింది.


4.ముస్లిం కాన్ఫెరెన్స్ /నేషనల్ కాన్ఫరెన్స్ పాత్ర


ప్రజల్లో ఇది ప్రచారం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది జమ్మూ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్. హిందువుల్లో భయాందోళనలు పోగొట్టడానికి నిజాయితీగా  కృషి చేసింది. కాశ్మీర్ లో ఒక బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అని ప్రకటించుకుని అందుకోసం అహర్నిశలూ పన్జేసింది. సంస్ధ పేరులో ముస్లిం అని ఉండడంతో కొన్ని హిందూ సంస్ధలు దాన్ని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడం జరిగిందిగానీ కాన్ఫరెన్స్ ఎన్నడూ ముస్లిం పక్షపాత వైఖరితో అయితే లేదు. 
అయితే స్థానిక హిందువులకు సిక్కులకూ ముస్లిం కాన్షరెన్స్ విషయం తెలిసిందే కాబట్టి వారు షేక్ అబ్దుల్లా నాయకత్వాన్ని సమర్ధించారు. ఈ విషయాన్ని హిందూ నాయకులు ఎక్కడా చెప్పరు. 
ముస్లింలు ముస్లిమేతరులు అనే  బేధాలు లేకుండా అబ్దుల్లా ప్రభుత్వం పాలన సాగించింది.షేక్ అబ్దుల్లా నాయకత్వంలోని కాన్ఫరెన్స్ ప్రకటించిన నయాకాశ్మీర్ మ్యానిఫెస్టోలో కూడా ఎక్కడా హిందూ మత వ్యతిరేక త  కనపించదు. కలుపుకుపోయే తత్వమే ధ్వనిస్తుంది.


కశ్మీరీ ముస్లింలది మతపరమైన భావజాలమనే పొరపాటు అభిప్రాయం బయటి ప్రాంతాల్లో ఉంది.అది కరెక్ట్ కాదు.ఉపఖండంలోని అందరూ తమ చరిత్రను హిందూ దశ ,ముస్లిం దశ అని విభజించి చెబుతారు.కశ్మీరీలు మాత్రం తమ చరిత్రను కశ్మీరీ దశ, విదేశీ దశ అని విభజిస్తారు.ఈ విదేశీ దశ అక్బర్ చక్రవర్తితో మొదలై ఆప్గాన్ ,సిక్కు, డోగ్రా పాలకుల ద్వారా ప్రస్తుత భారత పాలన దాకా వ్యాపించింది. కశ్మీరీ జాతీయవాద దృక్పధమిది.ఇక షేక్ అబ్దుల్లా విషయానికొస్తే మేము చావనన్నా చస్తాం గానీ పాకిస్తాన్తో మాత్రం కలవమని ప్రకటించాడు.1948లో  తన UN ప్రసంగంలో " we shall prefer death rather than join Pakistan.We shall have nothing to do with such a country"అని తెగేసి చెప్పాడు.కశ్మీరీలను మతాలకతీతంగా ఏకం చేయడానికి అతను నిరంతర గట్టి ప్రయత్నం చేశాడు."కశ్మీరీ ఉద్యమం మతపరమైన ఉద్యమం కాదు.సమాజంలోని అందరూ తమ తమ సమస్యలు వ్యక్తం చేసి పోరాడటానికి ఇదొక వేదిక.మా సహా పౌరులైన హిందువుల్నీ, సిక్కులనీ కలుపుకుపోవడానికీ, వారికి సహాయం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధమే.మనమంతా తరతమ మత బేధాలు మరిచి 
కలిసిమెలిసి బ్రతకడం నేర్చుకోకపోతే ఏ ప్రగతీ సాధ్యం కాదు.మనం ఒకరి హక్కులు ఒకరం గుర్తించి గౌరవించుకోవాలి". అని పదేపదే కశ్మీరీయులకు హితబోధ చేసిన నాయకుడు  షేక్ అబ్దుల్లా. ఇందులో భాగంగానే 1938 లోనే ముస్లిం కాన్ఫరెన్స్ ను నేషనల్ కాన్ఫరెన్స్ గా పేరు మార్చాడు.అందుకే అన్ని మతాల ప్రజలు ఆయన్ని గొప్పగా గౌరవించారు.


1945 లో రాజా హరిసింగ్  కు కాన్ఫరెన్స్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పగించేసి కాశ్మీర్ ను వదలివెళ్లాల్సిందిగా డిమాండ్ చేస్తూ క్విట్ కాశ్మీర్ డిమాండ్ చేసింది.
దీన్ని బయట హిందూ రాజుపై ముస్లింల దౌర్జన్యం అనే పేరుతో అప్పటి హిందూ సంస్ధలు ప్రచారం చేసుకున్నాయి.ఆ సందర్భంలోనే షేక్ అబ్దుల్లాను అరస్ట్ చేసి జైల్లో వేసారు. అనేక మంది కార్యకర్తలను కాల్చి చంపారు.


5.విలీన నాటకం:


అదే సమయంలో భారదేశానికి స్వతంత్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఇండియా, పాకిస్తాన్ పేరుతో రెండు దేశాలు ఏర్పడనున్నాయని స్థానిక సంస్ధానాలు భారతదేశంలో ఉండాలా? పాకిస్తాన్ లో కలవాలా అనేది నిర్ణయించుకోవాల్సిన అధికారం వారికే వదిలేసింది. నిజాం నవాబు పాకిస్తాన్ తో కలవాలనుందన్నాడు. కాశ్మీర్ రాజా హరిసింగ్ స్వతంత్ర రాజ్యంగానే ఉంటానన్నాడు. పాక్ తోగానీ భారత్ తోగానీ కలవనని ప్రకటించాడు. అటు 
పాకిస్తాన్,  ఇటు భారత్  -రెండూ  కాశ్మీర్ తమ దేశంలో కల్సిపోవాలంటే తమ తమ దేశాలలో కాశ్మీర్ విలీనం  కావాలని కోరుకున్నాయి. 1947 అగస్ట్ పదిహేను నాటికి కాశ్మీర్ భారతదేశానికీగానీ పాకిస్తాన్ కు గానీ చెందని స్వతంత్ర ప్రాంతంగానే ఉండిపోయింది. 


కాశ్మీర్ తమ తమ దేశాల్లో కలవకుండా ఉండిపోవడంతో భారత, పాకిస్తాన్ పాలకులు  కాశ్మీరీల మీద కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారు. పెట్రోలు సరఫరా ,నిత్యావసరాల ఎగుమతులు నిలిపివేశారు. మరో ముఖ్యమైన విషయం జమ్మూ కాశ్మీర్ సైన్యంలోనే తిరుగుబాటు వచ్చింది.పూంచు దళాల నుంచి ఇది జరిగింది.దీనికి తోడు పాకిస్తాన్ సరిహద్దుల నుంచి కాశ్మీర్ లోకి పోటెత్తుతున్న చొరబాటుదారుల వత్తిడి.


ఈ మొత్తం నుంచీ తనను తాను రక్షించుకోవడంలో భాగంగా కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేయాలనుకుంటున్నట్టు హరిసింగ్ ప్రకటించేశాడు. ఆ తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల మధ్య కాశ్మీర్ అక్కడి ప్రజల మనోభావనలతో ఏ మాత్రమూ సంబంధం లేకుండా భరతదేశంలో మోసపూరితంగా విలీనం చేయబడింది. ఇలా గతాన్ని పరికిస్తే కాశ్మీర్ ఏనాడూ భారతదేశంలో అంతర్భాగం కాదు. అందుకే అక్కడి జనం వత్తిడి వల్ల కాశ్మీర్  లో ఒకసారి  ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. విడిపోవడానికే కాశ్మీరీయులు మొగ్గుచూపారు.
వెంటనే  షేక్  అబ్దుల్లా ను నెహ్రూ  జైలు లో పెట్టించాడు.Plebicite ను పక్కకు నెట్టారు.


6.ఈ బిల్లు ప్రవేశ పెట్టటంలో  కేంద్ర పాలకులు చేస్తున్న వాదనలు కరెక్టే నా ?ఏవి అబద్ధాలు ఏవి నిజాలు?


ప్రస్తుతం భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలను, వాటికి సంబంధించిన నిజాలను పరిశీలిద్దాం.
ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం అనేది అబద్ధం. నిజానికి ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. 


అలాగే భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది అనేదీ ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు అనేదీ ఖండించాల్సిన విషయం.ఎలా?


రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయాలు ఆర్టికల్‌ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కల్పించారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్‌ లోని కచ్‌ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి. అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్‌ కు, 371-ఎఫ్‌ సిక్కింకు, 371-హెచ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.
ఇక స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్‌ 370 జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్‌ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్‌ 371ఎ, ఆర్టికల్‌ 371-జి ప్రకారం నాగాలాండ్‌, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు. అంతెందుకు? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇలా 370, 371-ఎ, 371-జి, 1/70 చట్టాలను రాజ్యాంగం లో ఎందుకు పొందుపరచారు? ఎందుకు అమలు చేస్తున్నారు? ఎందుకంటే ఆయా ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి వున్నాయి. అక్కడ కొనుగోళ్లకు భారతీయుల లోనే వేరే ప్రాంతాల వారికి అవకాశమిస్తే, వెనుకబడిన ఆయా ప్రాంతాల వాళ్లను వేరే ప్రాంతాల వాళ్లు మోసం చేస్తారనే సందేహంతో, ఆ ప్రాంతాల వారి ఆస్తులకు ప్రత్యేక రక్షణ నిమిత్తం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్‌లు, కొన్ని ప్రత్యేక చట్టాలు చేశారు. ఈ నిజాన్ని పూడ్చిపెట్టి ఆర్టికల్‌ 370 ఒకటే ప్రమాదకరమనీ, దానిని ఎత్తివేయాలనీ ప్రచారం చేయడం దుర్మార్గం.


 ఆర్టికల్‌ 370 మూలంగా జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలు భారత దేశ సార్వభౌమాధి కారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదని మరొక దుష్ప్రచారం.వాస్తవానికి ఆర్టికల్‌ 370 లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. 


సుప్రీం కోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవా?ఎందుకు పనిచేయవు! 2016లో 'జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం ఆర్టికల్‌ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం' అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీం కోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి. ఉదాహరణకు 11-2-56, 19-2-94ల మధ్య జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి 47 ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 


జమ్మూ-కాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్‌ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవు తుంది. అదే, పాకిస్తాన్‌ యువకుడిని పెళ్లి చేసు కుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది అనేదీ తప్పుడు ప్రచారమే.
 ఇలాంటి అంశమేదీ ఆర్టికల్‌ -370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఎ ఆర్టికల్‌ అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్‌ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతనానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతే.


కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగ బద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు రావడంలేదా?
ఈ విషయం  మామూలు ప్రజలందరినీ ఆలోచింపజేస్తుంది. రాజ్యాంగం భారత దేశం మొత్తంలోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించ బడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్‌, మిజోరాం, లక్షద్వీప్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కాని రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీ లుగా పరిగణించబడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో సిక్కులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా, రాజ్యాంగం ఆ రాష్ట్రంలో కూడా సిక్కులను మైనారిటీగానే గుర్తిస్తోంది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌ లోని కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా, లెహ్ ప్రాంతంలో బౌద్ధులు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా రాజ్యాంగం ఆ రాష్ట్రంలో ఆ రెండు మతాల వారినీ మైనారిటీలు గానే గుర్తిస్తోంది. ఇదీ వాస్తవం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంకూర్‌ శర్మ అనే న్యాయ వాది జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీ లుగా గుర్తించమని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ వేస్తే, సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, 'జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తిస్తారా?' అని. దానికి ఆ రాష్ట్రంలోని పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం 'హిందువులను మైనారిటీ లుగా గుర్తించం' అని స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదు. దానిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు రూ.15 వేల జరిమానా వేసింది. అయినా కేంద్రంలోని  ప్రభుత్వం మౌనం గానే ఉంది (ది పయనీర్‌ 7-2-17). ఇంత స్పష్టంగా ఆ రాష్ట్ర వైఖరీ, మౌనాన్ని ఆశ్రయించిన కేంద్ర వైఖరీ వుంటే, రాజ్యాంగ బద్ధంగా రావలసిన రిజర్వేషన్లు జమ్మూ-కాశ్మీర్‌లోని హిందువులకు అందడం లేదనే ప్రచారం మోసమా కాదా.


7.ఇంత హడావిడిగా ప్రహసనాత్మకంగా article 370 ని ఎందుకు రద్దుచేసినట్లు?


విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 370 ని రద్దుచేయడానికి గానీ ,అందులో మార్పులూ చేర్పులూ చేయటానికిగానీ కాశ్మీరు అసెంబ్లీ సమ్మతి కావాలి. కాశ్మీరీల సమ్మతిలేకుండా కాశ్మీర్ కు 'మేలు' చేసేందుకు తీసుకొచ్చిన ఈ రద్దు బిల్లు అప్రజాస్వామికం.ఈరోజు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చినట్లు ఇది కాశ్మీర్ మీద షా చేసిన సర్జికల్ స్ట్రైక్.ఒకదాని తరువాత ఒకటిగా అమలవుతున్న మెజారిటేరియన్ రాజకీయ వ్యూహాల్లో అతి కీలకం.ముస్లింల మీద చేస్తున్న దాడి. అక్కడ జరగబోయే ఎన్నికల్లో అధికారం కొరకు ఆడిన cruel గేమ్.ఇది మెల్లగా రాజ్యాంగాన్నీ దాని విలువలనీ నిర్వీర్యం చేసే రాజకీయ క్రమంలో భాగం.కాశ్మీరీ ప్రజాలకన్నా కాశ్మీరీ నేల మీదా, ఓటు మీదా ఈ ప్రభుత్వానికెంత మక్కువ.బిల్లు రద్దువల్ల కార్పొరేట్ పెట్టుబడిదారులకు కాశ్మీరును ముక్కలుచేసి పంచుకునే అవకాశం కలగబోతుంది.అసలే సలుపుతున్న పుండును పోగులేసుకుని భుజించటానికి ఫోర్కులు సప్లై చేయటమే ఈ చర్య.అంబానీలూ, ఆదానీలూ, టాటాలూ, బిర్లాలూ - పెద్ద పెద్ద మల్టీనేషల్ వ్యాపార సంస్థల ప్రాపకాన్నీ ప్రేమనీ కొనుక్కోవడానికి కాశ్మీరును బహుగొప్పగా తాకట్టు పెట్టింది కేంద్రం.


ఇదిన్యాయానికిి వీడ్కోలు చెప్పటం  
నీతిని గోతిలో పెట్టడం.
దారిని ముక్కలు చేసి మింగేయటం
వాస్తవాన్ని కాల్చి బూడిదను బొట్టుగా పెట్టుకోటం
దారుణ హత్యను దీనజన రక్షణగా వర్ణించటం
కాస్మీర్ అవయవాల వేలంపాటకు రంగం సిద్ధం చేయటం


ఇక ఎలుగుబంట్లు మెడలో లాప్టాప్ లతో రెడీ.