అత్యాచారం చేసిన నిందితుడికి మరణశిక్ష

చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి మరణశిక్ష 


వరంగల్: తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. ప్రవీణ్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. వరంగల్‌కు చెందిన పసిపాపపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
 
ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. 48 రోజుల క్రితం హన్మకొండ రెడ్డి కాలనీలో ఇంటి డాబా మీద తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. అయితే ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.