కాపులు బీసీ లా ? అగ్రవర్ణమా?

 


కాపులు బీ సీ లా ?


అగ్రవర్ణమా?

కాపులు బీ సీ లా ? అగ్రవర్ణమా? ఈ విషయం లో ఇటు  ప్రభుత్వానికి గానీ, అటు ఉద్యమకారులకు గానీ స్పష్టత ఉన్నట్టు  కనపడడం లేదు. చంద్రబాబు హయాం లో విజయవంతం గా  కొనసాగించిన అయోమయం ఇప్పటికీ  కొనసాగుతున్నది. రాష్ట్రం లో చేతులు మారిన ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయం పై ఇంకా  దృష్టి  పెట్టినట్టు లేదు. కాపులు బీ సీ లా....అగ్రవర్ణాలా అనే విషయం  లో ప్రభుత్వం ఒక స్పష్టత కు వస్తే.... ఏమి చేయాలనే విషయం తరువాత ఆలోచించవచ్చు.


కాపుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ ను రాష్ట్ర వెనుకబడిన తరగతుల మంత్రిత్వ శాఖ  ఆధ్వర్యం లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బీ .సీ  వెల్ఫేర్  శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజమాయిషీ లో ఇది  పనిచేస్తున్నది . అంటే, కాపులును బీ సీల  గా ప్రభుత్వం గుర్తించిందని అర్థమా? మరి , బీ సీలుగా గుర్తిస్తే, బీ సీ  లకు వర్తించే విద్య , ఉద్యోగ, రాజకీయ రేజర్వేషన్లు కాపులకూ వర్తించాలి కదా?! దీనితో పాటు, కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఎందుకు , బీ సీ  కార్పొరేషన్ ఇప్పటికే ఉన్నది  కదా! కాపులకు చేయదలచిన సాయం ఏదో బీ సీ  కార్పొరేషన్ ద్వారానే చేయవచ్చు కదా!
పోనీ, కాపులను అగ్రవర్ణం గానే ప్రభుత్వం పరిగణిస్తున్నదని అనుకుందాం! అప్పుడు కాపు కార్పొరేషన్ నిర్వహణ ను బీ సీ  సంక్షేమ శాఖ  అజమాయిషీ లో ఎలా ఉంచుతారు ?
అందువల్ల, కాపులు ఎవరు అనేదానిలో ప్రభుత్వానికి స్పష్టత వస్తే, వాళ్లకు రిజర్వేషన్ వర్తిస్తుందో ...లేదో తేలిపోతుంది. కాపులు బీ సీ లలో చేర్చుతామని ఒక పక్క చెబుతూనే, రెండో పక్క- అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ లో 5  శాతం కాపులకు కేటాయించడం ...చంద్రబాబు రాజకీయానికి ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే, తమను బీ సీ  లు  గా గుర్తించాలని కోరుకునున్న కాపులకు అగ్రవర్ణాలకు కేంద్రం పెట్టిన బిక్ష నుంచి సగం వాటా ఇవ్వడాన్ని జగన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కాపు నేతలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించాలి. తమను బీ సీ  లు గా గుర్తిపు చేయించుకునే క్రమం లో ఈ అగ్రవర్ణ కోటా  అనేది ప్రతిబంధకం అవుతుందని కాపులు గుర్తించాలి.
ఇందుకు  ప్రభుత్వం తో సంప్రదింపుల మార్గం చేపట్టాలి. అధికార పక్షం లోని కాపు మంత్రులు , శాసన సభ్యుల సలహా సంప్రదింపుల తో తమ అభ్యర్ధనను ప్రభుత్వం దృష్టికి  - ఒకటికి నాలుగు సార్లు తీసుకు వెళ్ళాలి. ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం  తో వ్యవహరించడం ద్వారా కాపు నేతలు గొప్ప పరిణితి ప్రదర్శించాలి.చంద్రబాబు హయాం  లో జరిగిన ప్రహసనాన్ని కాపులు మరిచిపోయి, కొత్తగా మొదలు పెట్టాలి.


మంద కృష్ణ మాదిగ దాదాపు 20  ఏళ్ళ నుంచి మాదిగలకు ప్రత్యేక కోటా  కోసం కృషి చేస్తున్నారు. అయన చేపట్టిన సమస్యకూ రాజ్యాంగ సవరణే  పరిష్కారం. తమను బీ సీ  లో చేర్చి రేజర్వేషన్లు వర్తింప చేయాలనే డిమాండు కూ రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్ లో చేర్చడమే పరిష్కారం. ఆ పని రాష్ట్ర ప్రభుత్వం  చేతుల్లో లేదు. కేంద్రం చేతుల్లో ఉంది .
ఇందుకు సంబంధించిన కాబినెట్ తీర్మానమూ , అసెంబ్లీ తీర్మానమూ ఇప్పటికే కేంద్రం లో పెండింగ్ లో ఉన్నాయి . వాటిని కొత్త ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు.
కనుక, కాపులను బీ సీ లు గా గుర్తిస్తూ, రాజ్యాంగం లోని 9  వ  షెడ్యూల్ లో  చేర్చాల్సిన బాధ్యత కేంద్రం పై ఉన్నది . కేంద్రం పై ఒత్తిడి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ సాయం కాపు కుల నేతలు తీసుకోవాలి.