సమీక్ష: సాహో
రేటింగ్: 2/5
బ్యానర్: యువి క్రియేషన్స్
తారాగణం: ప్రభాస్, శ్రద్ధ కపూర్, మురళి శర్మ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెలవాడి, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, లాల్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడి, ఎవలీన్ శర్మ తదితరులు
స్వరకల్పన: తనిష్క్ బాగ్చీ, బాద్షా, శంకర్ ఎహ్‌సాన్ లాయ్, గురు రంధావా
నేపథ్య సంగీతం: జిబ్రాన్
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఆర్.మధి
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
రచన, దర్శకత్వం: సుజీత్
విడుదల తేదీ: ఆగస్ట్ 30, 2019
బాహుబలి లాంటి ఎపిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత చేసే చిత్రానికి 'కథేంటీ' అని చూసుకోవాలి కానీ 'ఖర్చెంత' అని నిర్ణయించుకోకూడదు. ఎందుకంటే ఎంత బాహుబలికి అయినా ముందుగా కావాల్సినది కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు. ఆ తర్వాతే హంగులు, ఆర్భాటాలు, సెట్లూ, కోట్లూ! ఎప్పుడయితే బడ్జెట్ అంత పెట్టాలి, స్కేల్ ఇంత వుండాలి అని ఫిక్స్ అయి బరిలోకి దిగారో అక్కడే 'సాహో' ట్రాక్ తప్పేసింది. ఇండియన్ స్క్రీన్‌పై ఎన్నడూ చూడని రేంజ్ ఫైట్లు చేద్దాం, ఛేజ్‌లు తీద్దాం... ఫస్టాఫ్, సెకండ్ హాఫ్‌లో చెరో ట్విస్టు పడేద్దాం అన్న రీతిన ఈ చిత్రానికి అంకురార్పణ జరిగిందనే భావన కలుగుతుంది.
సాహో స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ సెట్లూ, గ్రాఫిక్కులే కనిపిస్తాయి కానీ పాత్రలు ఆకర్షించవు. ఆరంభంలోనే అరడజను మంది విలన్ల వరకు పరిచయం అవుతారు కానీ ఎవ్వరూ హీరోని ఛాలెంజ్ చేయబోయే వారిలా కనిపించరు. ఈ కార్డ్‌బోర్డ్ విలన్లని పరిచయం చేసిన తర్వాత కనీసం కథానాయకుడు అయినా ఉత్సాహపరిచేట్టు వుంటాడనుకుంటే అదీ వుండదు. బాహుబలిలో అన్ని యుద్ధాలు చేసేసాను, ఇక నా వల్ల కాదు అనే చందాన అనిపిస్తోన్న ప్రభాస్ తాను కనిపించిన తర్వాత సినిమాపై కలిగించాల్సిన నమ్మకం ప్లేస్‌లో మరిన్ని డౌట్స్ రేకెత్తిస్తాడు.
దర్శకుడు సుజీత్ టాలెంటెడ్ అయినా కానీ ఈసారి తలకి మించిన భారాన్ని ఎత్తుకున్న భయం అతడి బలాలని కూడా కప్పిపుచ్చింది. 'రన్ రాజా రన్'లో ఈ తరహా సన్నివేశాలనే అత్యంత వినోదాత్మకంగా మలిచిన సుజీత్ ఈసారి ప్రతి సీన్‌ని ఫ్లాట్‌గా మార్చేసాడు. కాంటెంట్ కంటే బడ్జెట్ ఎక్కువ కనిపించాలనే ఆలోచనలోకి వెళ్లిపోవడం వలనో ఏమో ఏ సన్నివేశంలోను దర్శకుడి ముద్ర కనిపించదు. తెరపై యాక్షన్‌కి లోటుండదు, రొమాన్స్‌కీ స్కోపిచ్చారు. అయినా కానీ ఏ సన్నివేశంలోను ఉత్తేజం వుండదు. విసుగుకి విజువల్ డిపిక్షన్‌లా తెరపై జరుగుతోన్న దానినుంచి విముక్తి కావాలంటూ విరామం కోసం పడిగాపులు పడేట్టు చేస్తారు. ఊహించినట్టే ఇంటర్వెల్‌లో ఒక ట్విస్టిస్తారు. అది ఊహించలేని వారు ఎంతోమంది వుండరు.
కనీసం ద్వితియార్ధంలో అయినా మేటర్ వుంటుందనుకుంటే... ప్రథమార్ధమే మెరుగనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కనీసం అప్పుడప్పుడూ నవ్వించాలనే ప్రయత్నం, హీరోయిన్ వున్నందుకో కారణం, హీరో పాత్ర రేకెత్తించే అనుమానం లాంటివైనా కథని ఏదో రకంగా ముందుకి తీసుకెళుతుంటాయి. ద్వితియార్ధానికి వచ్చేసరికి ఆ ఎలిమెంట్లు కూడా మరుగున పడి, అసలు కథేమో 'కంచి'కెళ్లేటపుడు కానీ బయటపడలేనని మాటున నక్కి... ఇంటర్వెల్ నుంచి క్లయిమాక్స్ వరకు ఎలా నడిపించాలో తెలియక వెంటవెంటనే రెండు పాటలొచ్చి, ఆ సమయం సరిపోక నాలుగైదు సుదీర్ఘమైన పోరాట దృశ్యాలు విసిగించేసి... ఒకటా, రెండా, సాహో పెట్టే ఇక్కట్లు సహస్రం. అసలే విషయ శూన్యమైన కథనం సహనాన్ని పరీక్షిస్తోంటే... తెరపై ఏమి జరుగుతున్నదో అర్థం కాని గందరగోళం పెట్టే హింస అనంతం.
రెండు గ్రూపులు అధికారం కోసం కొట్టుకుంటూ వుంటే 'అజ్ఞాతం'లో వున్న వారసుడు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకుని ఆ సింహాసనం అధిష్టించడం అసలు కథ. ఎక్కడో విన్నట్టుందా? ఇన్‌ఫ్యాక్ట్ చూసినట్టుంటుంది. ఆఁ... అదే, అభిమానుల ఆశలని అల్లకల్లోలం చేసి, బయ్యర్లని అతలాకుతలం చేసిన ఆ త్రివిక్రమ పరాక్రమపు అశనిపాతమే! ఆ అజ్ఞాతవాసికి ఏదైతే బీజం వేసిందో... సాహో కూడా అదే ఫ్రెంచి 'లార్గో వించ్' విత్తనానికి మొలిచిన మొండి వృక్షమే! అజ్ఞాతవాసి వచ్చి ఏడాదిన్నర గడిచినా మరి సాహోని సరి చేసుకోలేదంటే... బహుశా త్రివిక్రమ్‌కి తీయడం రాక అనుకుని వుండాలి లేదా ఆల్రెడీ బిజీగా వుండి ఆ ఫ్లాప్ సినిమా చూసే తీరిక దొరికుండదు అనుకోవాలి.
బాహుబలిలో శివలింగాన్ని ఆశువుగా మోసేసిన ప్రభాస్ ఇందులో ఎందుకో చాలా బద్దకంగా కదిలాడు. బుజ్జిగాడు నుంచీ ప్రభాస్‌లో కనిపిస్తోన్న ఎనర్జీ ఎందుకో కనబడకుండా పోయింది. బహుశా ఆరేళ్లుగా అన్నీ భారీ సినిమాలే చేస్తోన్న నీరసం ఆవహించి వుండాలి. శ్రద్ధాకపూర్ అప్పుడే ఫైటింగులు చేస్తూ, వెంటనే తోడు కోసం చూస్తూ... ఒక ఆర్క్ అంటూ లేని క్యారెక్టర్‌లో తేలిపోయింది. లెక్కకి మించి వున్న సహ నటీనటులలో గుర్తుండే పాత్ర ఒక్కటీ లేదు. ఇంత ఖర్చు పెట్టిన సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా కుదిరింది. అలాగే ఛాయాగ్రహణం కూడా కనువిందు చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్‌కి పడ్డ కష్టం తెర మీద కనిపించింది. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా చక్కగా అమరింది. పాటల అవసరమే లేదని తెలిసినా పెట్టినట్టు అన్నీ పొడి పొడి, పొట్టి పొట్టి పాటలే వున్నాయి. నిర్మాతలు మంచి నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. అయితే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారనేది మాత్రం అతిశయం అయి వుండాలి.
యాక్షన్ దృశ్యాలు అదిరిపోతాయి, అంతర్జాతీయ స్థాయిలో వుంటాయని మొదట్నుంచీ చెబుతూ వుంటే, ఆకర్షించడానికి చెబుతున్నారనిపించింది కానీ సినిమా చూసాకే తెలిసింది అవి మాత్రమే వున్నాయని. పోనీ అవయినా సవ్యంగా నోరప్పగించి చూసేలా చేసారా అంటే అదీ లేదు. జెట్ మ్యాన్ అంటూ భారీ ఛేజ్ సీక్వెన్స్‌లోకి మనుషులు ఎగురుకుంటూ వచ్చి దాడి చేసేస్తారు. వాళ్లు ఎగురుతూ రావడమే నవ్వులాటగా వుంటే... దానిని హీరోకి తగిలించి అతడినీ గాల్లో ఎగిరించారు. వందల అడుగుల ఎత్తులోంచి పడిపోతున్న హీరోయిన్‌ని అమాంతం గాల్లో క్యాచ్ చేసి ల్యాండ్ అవుతూ వుంటే... థియేటర్‌లో పిన్‌డ్రాప్ సైలెన్స్. ఆశ్చర్యంతో కూడా నిశ్శబ్ధం కాదది. మనం చూస్తోన్న అవివేకం నిజమేనా అని నమ్మలేని స్థితి.
టార్గెట్ రీచ్ అయిన వాటికంటే మిస్‌ఫైర్ అయినవే ఎక్కువ సినిమాలుండే మన పరిశ్రమలో సాహో కేవలం ఓ పొరపాటు అయితే కాదు... ఇదో స్వయంకృతం. చేజేతులా పోగొట్టుకున్న సువర్ణావకాశం.