హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి పరుగు తీయగా, కార్తీక్ అనే స్థానికుడు వెంబడించి పట్టుకున్నట్టు తెలిసింది. కారు ప్రమాద దృశ్యాలను తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన కార్తీక్, హీరో రాజ్ తరుణ్ ను వెంబడించాడు. అయితే, రాజ్ తరుణ్ తాను మద్యం సేవించి ఉన్నానని, వదిలిపెట్టాలంటూ కోరడం వీడియో ద్వారా వెల్లడైంది. ఇప్పుడా వీడియోలు ఇచ్చేయాలంటూ తనతో బేరాలకు దిగి, ఆపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ స్థానికుడు కార్తీక్ మీడియాను ఆశ్రయించాడు.
వీడియోలు ఇచ్చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని, తాను నిరాకరించడంతో బెదిరింపులకు దిగారని కార్తీక్ ఆరోపించాడు. వీడియోల విషయంలో కార్తీక్ ను ఫోన్ ద్వారా సంప్రదించినవారిలో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, మరో మహిళ ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్ శివారు నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.