కాంగ్రెస్ కి కొత్త సారధి సోనియా

 


కాంగ్రెస్‌కు  కొత్త సారథి
ఇక ఆలస్యం లేదంటున్న పార్టీ నేతలు
దిల్లీ: శతాధిక సంవత్సరాల పార్టీ కాంగ్రెస్‌కు కొత్త సారథి రాబోతున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)  సమావేశంలోనే అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి నూతన అధ్యక్షుడిని తప్పకుండా ఎన్నుకుంటామని, ఇక ఆలస్యమయ్యే అవకాశమే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ నేడు మీడియాతో అన్నారు.   కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని తప్పకుండా ఎన్నుకుంటాం. సారథి ఎంపిక ఇక ఆలస్యమయ్యే అవకాశం లేదు. నాకున్న సమాచారం మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్‌ వచ్చేంత వరకూ చర్చలు జరుగుతాయి. ఆ వెంటనే అంతర్గతంగా ఎన్నిక చేపడతాం' అని సింఘ్వీ తెలిపారు. ఇదిలా ఉండగా..  తాత్కాలిక చీఫ్‌ను ఎన్నుకుని, కొత్త అధ్యక్షుడి ఎంపికకు ప్యానెల్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాకు వెనక్కి తీసుకోవాలని పార్టీ నేతలు ఎంత అభ్యర్థించినా రాహుల్‌ తన పట్టువీడలేదు. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే రోజులు గడుస్తున్నా కొత్త సారథి నియామకం జరగకపోవడంతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ఆలస్యమైతే అది పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు కాంగ్రెస్ వ్యక్తులు బహిరంగంగానే అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ వేగవంతం చేసింది. 


తొలుత అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రియాంక గాంధీని బాధ్యతలు తీసుకోవాలని పార్టీ కోరినప్పటికీ అందుకు ఆమె ససేమిరా అన్నారు. దీంతో సారథి ఎన్నిక కష్టమవుతోంది. మరోవైపు తాత్కాలిక చీఫ్ బాధ్యతలను సోనియాగాంధీకి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఆమె ఆసక్తి చూపించడం లేదని సమాచారం.