గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా గురువారం సెలవు ఇచ్చినందున.. రెండో శనివారం 14వ తేదీని పనిదినంగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ 14న పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు
-నేడు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల విగ్రహాల నిమజ్జనం: డీజీపీ మహేందర్‌రెడ్డి
-సీసీ కెమెరాలతో గట్టి నిఘా.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వంద కెమెరాలు
-మధ్యాహ్నం 12.30 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం గణేశ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లుచేసినట్లు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లో మొత్తం 50 వేల వరకు విగ్రహాలను నిమజ్జనం అవుతాయని చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడు, ఐదు, తొమ్మిది రోజు వరకు మొత్తం 50వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, గురువారం ప్రశాంతం గా నిమజ్జనం జరిగేలా సన్నాహాలు చేశామన్నారు. రాజధాని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 50 ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లుచేశామని పేర్కొన్నారు. ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద.. ఊరేగింపుదారుల్లో నిఘా కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,600, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5,500 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు.
డీజీపీ కార్యాలయంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలో, కమిషనరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటుచేశామని వివరించారు. ఇతరశాఖలు, వినాయక మం డపాల ఆర్గనైజింగ్ కమిటీల సమన్వయంతో ఏర్పాట్లుచేసినట్టు డీజీపీ తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని.. రూట్‌మ్యాప్‌లు రూపొం దించి ప్రచారం చేశామని చెప్పారు. సామాన్యులు, దవాఖానలకు ఇతర ఎమర్జెన్సీ పనులపై వెళ్లేవారికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎవరైనా సోషల్‌మీడియాలో వందతులు వ్యాప్తిచేసినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి గురువారం ఉదయం 5 గం టల నుంచే ఏర్పాట్లు ప్రారంభిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ద్వాదశాదిత్యుడి ఊరేగింపు 7 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిమజ్జనం పూర్తిచేసేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు.