ఎల్వోసీ సమీపంలోకి 2 వేల మంది పాక్ సైనికులు.

ఎల్వోసీ సమీపంలోకి 2 వేల మంది పాక్ సైనికులు.


*న్యూఢిల్లీ:* భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలోకి పాకిస్తాన్ రెండు వేల మందికి పైగా సైనికులను తరలించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని బాగ్, కోట్లీ సెక్టార్ సమీపంలో సైనికులు మకాం వేసినట్టు భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ సైనికులు ఉన్నారనీ.. వారిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపాయి.


పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తొయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున స్థానికులు, ఆఫ్ఘన్లను రిక్రూట్ చేసుకుంటున్న తరుణంలోనే పాకిస్తాన్ రెండు వేల మందికి పైగా సైనికులను పీవోకేకి తరలించడం గమనార్హం. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే పాకిస్తాన్ ఈ వ్యూహం రచించినట్టు కనిపిస్తోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయిలో ఉన్నాయని చూపించి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకునేలా చేయాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి పాకిస్తాన్ తన అక్కసు వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే.