ఇక బోటు పైకి రానట్టే!

 


* పరిపాలనలో*


*ఇక బోటు పైకి రానట్టే!*


రాజమహేంద్రవరం /దేవీపట్నం, l తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిన బోటు ఇక బయటకు వచ్చే మార్గాలు కనిపించడం లేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో 14 మంది జాడా ఇంకా తెలియలేదు. ఇప్పటివరకు కేవలం గోదావరి నీటిపై తేలిన మృతదేహాలు, లంకల్లోకి కొట్టుకువచ్చిన వాటిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీసుకొచ్చాయే తప్ప స్వయంగా నీటిలో గాలింపు చేపట్టడం, బోటుకు లంగరు వేసి లాగే ప్రయత్నాలను ప్రభుత్వం చేయలేదు. సీఎం జగన్‌ నుంచి అన్ని విభాగాల అధికారులూ వచ్చారు.. వెళ్లారు. కానీ బోటును తీసే పరిస్థితి కానరావట్లేదు. బంధువులకు 'డీమ్డ్‌ టు బీ డెత్‌' (మిస్సింగ్‌ అయిన, గల్లంతైన వారికి జారీచేసేవి) సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం చూస్తుంటే ఇక బోటు బయటకు రాదని అర్థమవుతోంది. మంగళవారం దేవీపట్నం వచ్చిన పర్యాటకశాఖ డైరెక్టర్‌ వై.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.