సైరా నరసింహా రెడ్డి చిరు ఇమేజ్‌ తగినట్లుగా పూర్తి కమర్షియల్‌ అంశాలతో నిండినది


ఆంగ్లేయుల్ని ఎదురించి పోరాడిన తొలితరం స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాలను తీసుకొని రూపొందించిన చిత్రమిది. తనకు రావాల్సిన భరణాన్ని అడిగినందుకు అవమానించిన ఆంగ్లేయులపై అతడి సాగించిన స్ఫూర్తిదాయక పోరాటం ఆధారంగా చేసుకుంటూ దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చారిత్రక పోరాటానికి కుటుంబ బంధాల్ని, ప్రేమ, హీరోయిజాన్ని మేళవిస్తూ కథనాన్ని అల్లుకున్నారు. ప్రథమార్థ మొత్తం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని, ధైర్యసాహసాల్ని చాటిచెబుతూ తీర్చిదిద్దారు. అవన్నీ నెమ్మదిగా సాగుతూ సినిమా నిడివిని పెంచాయి. నరసింహారెడ్డిలోని ఆవేశాన్ని అదుపుచేస్తూ అతడిని లక్ష్యసాధన వైపు గురువు గోసాయి వెంకన్న ఎలా నడిపించాడో చూపించాల్సింది. కానీ దర్శకుడు ఆ సన్నివేశాలపై కాకుండా ప్రజల కోసం నిరంతరం తపనపడే పాలకుడిగా నరసింహారెడ్డిని కీర్తిని చాటడంతో పాటు లక్ష్మితో నరసింహారెడ్డి ప్రేమాయణం, భార్య సిద్ధమ్మతో అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. కోవెల కుంట్ల ఆంగ్లేయుల సంస్థానంపై నరసింహారెడ్డి దాడిచేసే సన్నివేశంతోనే కథ వేగం అందుకుంటుంది. ఇతర పాలెగాళ్ల తోడ్పాటుతో అలుపెరకుండా అతడు సాగించిన యుద్ధం ప్రధానంగా ద్వితీయార్థం సాగుతుంది. తనను ఎదురించడానికి ఆంగ్లేయులు పన్నిన కుట్రల్ని నరసింహారెడ్డి తన ధైర్యసాహసాలతోఎలా తిప్పికొట్టాడో చూపించిన యుద్ధసన్నివేశాల్లో కొన్ని ఆసక్తిని పంచుతాయి.  ద్వితీయార్థం మొత్తం యుద్ధ సన్నివేశాలు తప్ప కథను ముందుకు నడిపించే ఎమోషన్స్‌ కనిపించవు. నరసింహారెడ్డిని ఓడించడం అసాధ్యం అని గ్రహించి తమ కుయుక్తులతో ఎలా పట్టుకొని ఉరితీయడం, తాను చనిపోతూ నరసింహారెడ్డి ప్రజల్లో రగిల్చిన స్ఫూర్తిని పతాక ఘట్టాల్లో హృద్యంగా ఆవిష్కరించారు.