మహిళలు, అధికారులు, విలేకరులపై దాడులు చేయడం వైసీపీఎమ్మెల్యేకు అలవాటుగా మారింది

 


   మహిళలు, అధికారులు, విలేకరులపై దాడులు చేయడం వైసీపీఎమ్మెల్యేకు అలవాటుగా మారింది


- తనపని చేయలేదన్న అక్కసుతో వైపీపీ ఎమ్మెల్యే ఎంపీడీవోను వేధించి, ఆమె కుటుంబసభ్యులను నిర్భంధించారు.


  - అర్థరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గోడువెళ్లబోసుకున్నా ఆమెను పట్టించుకోలేదు.


  - మహిళలపై ప్రభుత్వానికి ఎంతగౌరవమర్యాదలున్నాయనేది సరళ ఉదంతంతో రుజువైంది.


  -  రాష్ట్రంలో 6లక్షల మంది ఆటోడ్రైవర్లుంటే, వాహనమిత్ర పథక కింద 1.73లక్షల మందినే ఎలా అర్హులను చేస్తారు?


                                  - శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌.  


వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజుల్లా వ్యవహరిస్తూ, అధికారులు, విలేకరులపై రౌడీయిజం చేస్తుంటే, వారిని కట్టడిచేయాల్సిన ప్రభుత్వం తనకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తో ందని, టీడీపీ అధికారప్రతినిధి, మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.తాను చెప్పినట్లు చేయలేదన్న అక్కసుతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మహిళా అధికారని కూడా చూడకుండా వెంకటాచలం ఎంపీడీవో సరళపై దాడికి తెగబడ టం అత్యంత దుర్మార్గమని డొక్కా తెలిపారు. తనపై దాడిజరగడంతో భయభ్రాంతులకు గురైన సదరు అధికారి, తనకు రక్షణ కల్పించాలంటూ, అర్థరాత్రివేళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే ఆమెనుంచి ఫిర్యాదు తీసుకోకపోవడం అత్యంత అమానుషమని డొక్కా ఆవేదన వ్యక్తంచేశారు. గెజిటెడ్‌హోదా ఉన్న అధికారిపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దాడిచేయడం, దానిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో ఒకమహిళా అధికారికే రక్షణ లేకపోతే, ఇకసామాన్య మహిళల పరిస్థితేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా వైసీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరిస్తున్నా, ప్రభుత్వాధినేతగా జగన్‌ స్పందించకపోవడం చూస్తుంటే, సాటి మహిళలపై ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతోందని డొక్కా ఎద్దేవాచేశారు. ఎంపీడీవో సరళను వేధించడమేగాక, ఆమె ఇంటికి విద్యుత్‌నిలిపేసి, నీటిసరఫరాను ఆపేసి,  హృద్రోగంతో బాధపడుతున్న ఆమెతల్లిని దూషించడం వైసీపీ ప్రజాప్రతినిధికి తగదని ఎమ్మెల్సీ హితవు పలికారు. మహిళా అధికారిని దూషించి, ఆమె కుటుంబాన్ని నిర్భంధించి, ఆమె నివసిస్తున్న ప్రాంతంలో భయోత్పాతం సృష్టించిన అధికారపార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్‌చేసే ధైర్యం ఈప్రభుత్వానికి లేదా అని డొక్కా నిలదీశారు. అనధికారికంగా ఏర్పాటుచేసిన లేఅవుట్‌కు అనుమతిఇవ్వడం, తన పరిధిలోలే దని వెంకటాచలం ఎంపీడీవో సరళ చెప్పినా వినకుండా, ఆవేశంతో ఆమెపై దాడిచేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని శిక్షించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని మాణిక్యవర ప్రసాద్‌ ప్రశ్నించారు. గతంలో కూడా ఎంతో విస్వసనీయత ఉన్న జమీన్‌రైతు పత్రిక విలేకరైన డోలేంద్రప్రసాద్‌పై, మరో విలేకరిపై దాడిచేయడం, ఇంకోవిలేకరిని ఫోన్‌లో దూషించడం, మహిళావైద్యురాలిని తిట్టడం, నెల్లూరులోని వేదాయపాలెం పీఎస్‌లో నరసింహారావనే సీఐని దుర్భాషలాడటం వంటి దురాగతాలకు కోటంరెడ్డి పాల్పడినా  ఆనాడు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పుడే ఆయన్ని కట్టడిచేసి ఉంటే, ఇప్పుడు  మహిళాఅధికారిపై దాడిజరిగి ఉండేదికాదన్నారు. మహిళలపై, అధికారులపై, విలేకరులపై దాడులు చేయడం  ఆ ఎమ్మెల్యేకు అలవాటుగా మారినా, ఆయనపై చర్యలుతీసుకోలేని ప్రభుత్వం తన నిస్సహాయతను, చేతగానితనాన్ని మరోసారి బయటపెట్టుకుందని డొక్కా మండిపడ్డారు. 72ఏళ్ల స్వతంత్రభారత చరిత్రలో ఏప్రభుత్వంచేయని విధంగా నిరంకుశ, నియంత్రత్వ, వంచక, నమ్మకద్రోహ పాలనను వైసీపీ సాగిస్తోందన్నారు.


ఆటోడ్రైవర్లకు అరచేతిలోవైకుంఠం చూపిన వైసీపీప్రభుత్వం...


ఎంతో ఆర్భాటంగా వైసీపీప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం అర్హులైన   డ్రైవర్లకు అరచేతిలో వైకుంఠం చూపిందని, డ్రైవర్లను కూడా పార్టీలు, కులాలు, మతాల వారీగా వర్గీకరించిందని మాణిక్యవరప్రసాద్‌ ఆక్షేపించారు. 2018-19 లెక్కలదృష్ట్యా, సోషియో ఎకనమిక్‌ సర్వేప్రకారం రాష్ట్రంలోసుమారు 6లక్షల పైచిలుకు ఆటోడ్రైవర్లుంటే, ప్రభుత్వం కేవలం లక్షా73వేల మందికే వాహనమిత్ర పథకాన్ని వర్తింప చేయడమేంటని మాజీమంత్రి ప్రశ్నించారు. పాదయాత్రలో బూటకపువాగ్ధానాలు చేసిన జగన్‌, అవి అమలు చేసేటప్పుడు కూడా బూటకపు విధానాలనే అవలంభిస్తున్నారన్నారు.  జగన్‌తన పాదయాత్రలో 14-05-2018న మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతిఆటో డ్రైవర్‌కు, ఏటాపదివేల చొప్పున 5ఏళ్లకు రూ.50వేలు ఇస్తానన్న విషయాన్ని డొక్కా గుర్తుచేశారు. వాహనమిత్ర పథకం కింద ఎంపికైన 1.73లక్షల మందిని కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల సిపార్సులేఖల ఆమోదంతోనే అర్హులుగా ప్రకటించడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం 4లక్షలమందికి ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించి, ఆటోలపైఉన్న రూ.150 కోట్ల పన్నుని రద్దుచేసిన విషయం జగన్‌సర్కారు తెలుసుకోవాలని మాణిక్య వరప్రసాద్‌ సూచించారు.


మంత్రిస్థాయి వ్యక్తి అలా మాట్లాడటమేంటి?


ఆటోలపై జగన్మోహన్‌రెడ్డి బొమ్మపెట్టుకుంటే, పోలీసులు, రవాణాశాఖాధికారులు ఆపరని, అలా పెట్టుకోకుంటే ఆటోలను సీజ్‌చేస్తామని మంత్రిస్థాయి వ్యక్తి బెదిరించడం ఏమిటని  డొక్కా నిలదీశారు. కేబినెట్‌హోదాలో ఉన్న మంత్రి అవంతిశ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలే  వాహనమిత్ర పథకం లబ్ధిదారుల ఎంపికకు నిదర్శనమన్నారు. వైసీపీ కార్యకర్తలకే వాహన మిత్ర పథకాన్ని వర్తింపచేసిన ప్రభుత్వం, అద్దెకు ఆటోలునడుపుకునే వారికి పథకాన్ని ఎందుకు వర్తింపచేయలేదన్నారు? రోజువారీ వేతనానికి బతికే డ్రైవర్లకు సాయం చేయకుండా, వాహనయజమానులకు ప్రభుత్వసాయమందించడం ఎంతమాత్రం తగదని  మాజీమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో 5.68లక్షలకు పైగా ఆటోలుంటే, అందులో సగానికి పైగా అద్దెకే తిరుగుతున్నాయి.