పలువురికి డాక్టర్‌ రామినేని పురస్కారాలు - 2019

 


డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ (యూఎస్ఏ) 20వ వార్షికోత్సవం శనివారం రాత్రి నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి డాక్టర్‌ రామినేని పురస్కారాలు - 2019ను ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు (విశిష్ట పురస్కారం), సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాఫకుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌, కూచిపూడి కళాకేంద్రం వ్యవస్థాపకుడు కళారత్న బాల కొండల రావు, ప్రజాకవి గోరెటి వెంకన్నలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పురస్కారాలను అందజేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆయన స్థాపించిన ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలతోపాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.

 

 

ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మప్రచారక్‌ రామినేని, కన్వీనర్‌ గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట, విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు 19 సంవత్సరాలుగా రామినేని పురస్కారాలను అందచేస్తున్నామన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎల్వీ ప్రసాద్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎన్‌ రావు, సీనియర్‌ సంపాదకులు కె.రామచంద్రమూర్తి, ప్రముఖ హిప్నాటిస్ట్‌ బీవీ పట్టాభిరాంతో కూడిన ప్యానల్‌ కమిటీ అవార్డులను ఎంపిక చేసిందన్నారు.