జగన్‌ కోర్టుకు రావాల్సిందే!

జగన్‌ కోర్టుకు రావాల్సిందే!


జైల్లో ఉన్నప్పుడే చాలా చేశారు
ఇప్పుడు సీఎంగా ఉన్నారు
అంగ, అర్థ బలాన్ని వాడుకోవచ్చు
సాక్షులను ప్రభావితం చేయొచ్చుగా
కోర్టు హాజరీ నుంచి మినహాయింపు ఇవ్వొద్దు
సాక్షుల ప్రభావితం యత్నాలవల్లే నాడు అరెస్టు
హోదా చూసి మినహాయిస్తే తప్పుడు సంకేతాలు
క్విడ్‌ ప్రొ కో లబ్ధి జగన్‌కే.. పిటిషన్‌ కొట్టేయండి
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకే వెళ్లాలి
ప్రత్యేక కోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావలసిందేనని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరడం రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని పేర్కొంది. ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో జైల్లో ఉండగానే.. తన పలుకుబడిని, కండబలాన్ని ఉపయోగించారని.. ఇప్పుడు సీఎంగా ఉన్నారని.. అన్ని అధికారాలూ ఆయనకు ఉన్నాయని గుర్తుచేసింది. నిందితుల హోదా, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వకూడదని.. అలా ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తేల్చిచెప్పింది. సాక్షులు భయాందోళనకు గురయ్యే అవకాశముందని తెలిపింది. ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. మినహాయింపు ఇస్తే అర్థ, అంగ బలాలను వాడుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చినట్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్‌ తాజాగా 14 పేజీల కౌంటర్‌ అఫివిడవిట్‌ దాఖలు చేశారు. వాస్తవాలను దాచిపెట్టి.. దురుద్దేశంతో జగన్‌ పిటిషన్‌ వేశారని.. దానిని కొట్టివేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18కి వాయిదా వేసింది. కౌంటర్‌లో సీబీఐ పేర్కొన్న ముఖ్యాంశాలివీ..
 
ఆధారాలు తారుమారు చేస్తారనే అరెస్టు..
'హైకోర్టు 2011 ఆగస్టు 10న ఇచ్చిన ఆదేశాలతో కేసు నమోదు చేశాం. ఆ సమయంలో ఎంపీగా ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉండడం.. కేసు దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన వివిధ ఆర్థిక అక్రమాలు, క్విడ్‌ ప్రొ కో (నీకిది.. నాకది) లావాదేవీల్లో ప్రధాన లబ్ధిదారు కావడంతో 2012 మే 27న ఆయన్ను అరెస్టు చేశాం. అరెస్టును సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. దర్యాప్తు పెండింగ్‌లో ఉండడంతో ఆయన్ను జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు పంపింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత హెటెరో-అరబిందో ఫార్మా, ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్స్‌, రాంకీ, వాన్‌పిక్‌, దాల్మియా సిమెంట్స్‌, ఇండియా సిమెంట్స్‌, రఘురాం సిమెంట్స్‌, పెన్నా సిమెంట్స్‌, ఇందూ టెక్‌జోన్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఏపీ హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌ అంశాల్లో కోర్టులో 11 చార్జిషీట్లు దాఖలు చేశాం. జగన్‌కు 2013 సెప్టెంబరు 23న బెయిల్‌ మంజూరు చేసే సమయంలో ప్రత్యేక కోర్టు ఐదు షరతులు విధించింది. రూ.2 లక్షల బాండ్‌, రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ ప్రలోభాలకు గురిచేయడం గానీ, బెదిరించడం గానీ చేయరాదని.. హైదరాబాద్‌లోనే ఉండాలని.. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్‌ దాటి వెళ్లరాదని.. ప్రతి వాయిదాకు తప్పనిసరిగా హాజరుకావాలని, హాజరుకాలేని పరిస్థితుల్లో ముందస్తుగా కోర్టు అనుమతి తీసుకోవాలని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ ఎప్పుడైనా పిటిషన్‌ దాఖలు చేయొచ్చని షరతులు పెట్టింది. సాక్షులు స్వేచ్ఛగా న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యమిచ్చే వాతావరణాన్ని కల్పించేందుకే కోర్టు ఈ షరతులు విధించింది. వీటిని సడలించడమంటే సాక్షులను భయాందోళనకు గురిచేయడమే. అలాగే తుది విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదు. చార్జిషీట్లు దాఖలు చేసి ఆరేళ్లు గడిచిపోతోంది. ఇప్పటికీ కోర్టులో తుది విచారణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక సాకుతో జాప్యం జరిగేలా చేస్తున్నారు.'
 
వారిద్దరినీ అప్పుడే బెదిరించారు
'జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను 2013 మే 9న సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. ఈ కేసులో అక్రమంగా హవాలా ద్వారా డబ్బు మళ్లించిన మైనెక్‌ మెహతా అనే వ్యక్తి చిన్న కారణాలను చెబుతూ భారత్‌కు వచ్చేందుకు నిరాకరించిన విషయాన్ని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మరో సాక్షిగా ఉన్న గోపాలకృష్ణన్‌ మురళికి సాక్షిగా హాజరు కావాలంటూ 2012 జూన్‌ 13న నోటీసులు జారీచేశాం. ఈ నోటీసులు అందుకున్న మురళి వెంటనే ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని సంప్రదించారు. సీబీఐ దర్యాప్తునకు సహకరించరాదని, ఎటువంటి ఆధారాలు సమర్పించవద్దని, తమ న్యాయవాదుల ద్వారానే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని విజయసాయిరెడ్డి తనకు చెప్పారని మురళి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో ప్రస్తావించింది. విజయసాయి సూచన మేరకే మురళి సీబీఐ దర్యాప్తునకు సహకరించలేదు. అలాగే దాల్మియా సిమెంట్స్‌కు చెందిన ఉద్యోగి సంజయ్‌ ఎస్‌ మిత్రా అనేక అక్రమ లావాదేవీలు జరిపారు. అయితే ఈ విషయాలేవీ బయటకు చెప్పరాదని దాల్మియా ఎండీ పునీత్‌ దాల్మియా, విజయసాయిరెడ్డి తనను ఆదేశించారని మిత్రా సీబీఐ ముందు అంగీకరించారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండి కూడా జగన్‌, ఆయన సహచరులు ఉపయోగించిన పలుకుబడి, అంగబలంలో పైవన్నీ చిన్నపాటివే. వారానికి ఒకరోజు కోర్టులో విచారణ కావడం అంటే.. నిందితులు పెద్దవారైనా న్యాయప్రక్రియకు బద్ధులుగా ఉండాల్సిందేనని చెప్పడమే. జగన్‌ ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారు. రాజ్యాంగ, పరిపాలనాధికారాలు సంపూర్ణంగా ఉన్నాయి. షరతులు సడలించి స్వేచ్ఛ కల్పిస్తే విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు.'