మూగబోయిన ‘మెఘా’ మీడియా

 


మూగబోయిన 'మెఘా' మీడియా

500లు లంచం తీసుకుంటు ఎక్కడో వీఆర్వో దొరికితే… బ్రేకింగ్. 10వేల లంచంతో ఎమ్మార్వో దొరికితే బిగ్ బ్రేకింగ్… ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో లక్ష రూపాయాల నగదుతో ఏసీబీకి పట్టుబడితే రెండు గంటల హాడావిడి… ఇంకాస్త పెద్దవారిపై ఎదైనా రైడ్ జరిగితే రోజంతా వార్త, టాప్ హెడ్‌లైన్… మరీ వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి, దేశ వ్యాప్తంగా కాంట్రాక్టులు చేసే కంపెనీ, ఇండ్లపై సోదాలు జరిగితే… అదీ హైదరాబాద్‌ కేంద్రంగా జరిగితే… మీడియాకు అంతకన్నా పెద్ద వార్త ఉంటుందా…? గంటల తరబడి రిపోర్టర్‌ లైవ్‌లు, ఎనాలసిస్‌లు… ఎవరికెంత తోస్తే అంత దొరికింది అన్న వార్త. నానా హడావిడి…

 

కానీ అవేమీ లేవు. జస్ట్‌ ఒకటి రెండు చానళ్లు ఓసారి బ్రేకింగ్ అంతే. గప్‌ చుప్… మెఘా కంపెనీ అధినేత మెఘా కృష్ణారెడ్డి, ఆయన కంపెనీ, ఇండ్లు సహా దేశ వ్యాప్తంగా 35చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కానీ తెలుగు మీడియాకు మాత్రం అది వార్తలాగే కనిపించటం లేదు. మీడియా మొత్తం మూగబోయింది. సరే ఒకటి రెండు చానళ్లు అంటే వాళ్లకు వీళ్లు ఏమున్నాయో అనుకోవచ్చు… కానీ ఉన్న చానళ్లలో దాదాపు అన్నీ గప్‌-చుప్ అయిపోయాయి.

 

ప్రజా గొంతుకగా, అణగారిన వర్గాల నినాదంగా ఉండాల్సిన మీడియా ఇలా సైలెంట్ అయిపోయిందేంటీ అనుకున్న వాళ్లు లేకపోలేదు. కారణం ఒక్కటే… పెద్ద చానళ్లుగా చలామణిలో ఉన్నవి ఇప్పటికే మెఘా కృష్ణారెడ్డి దొడ్లో బందీలు అయిపోయాయి. మిగిలిన మీడియా అధినేతలకు, మెఘా కృష్ణారెడ్డికి సత్సంబంధాలున్నాయి. పైగా మెఘా కృష్ణారెడ్డి అంటే రెండు రాష్ట్రాల సీఎంలకు అత్యంత సన్నిహితుడు. సో… మనకెందుకు లే అని లైట్‌ తీసుకొని, సోదాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే సోదాలపై వార్తగానీ, సోదాల్లో అన్ని వేల కోట్లు దొరికాయి… ఇన్ని వందల కోట్లు దొరికాయి లాంటి వార్తల వాసన కూడా కనపడలేదు.

 

పైగా… ఉదయం వార్త బయటకు పొక్కిన వెంటనే మెఘా కంపెనీ టీం రంగంలోకి దిగిపోయింది. అబ్బే… సోదాలు అలాంటివేం లేవు. న్యాచురల్‌గా, రెగ్యూలర్‌గా జరిగే ఆడిట్‌ లెక్కలే అన్నంత తేలికగా విషయాన్ని అన్ని చానళ్లకు, అధినేతలకూ ఫోన్లు.. మెసెజ్‌ల రూపంలో చేరవేసింది. అలా సోదాలపై పాలపొంగులాగా కూడా వార్త బయటకు రాకముందే నీళ్లు చల్లి పక్కన పెట్టేశాయి మన మీడియా చానెళ్లు.