జరగబోయే భయంకరమైన నిజం మాత్రం ఇదే.          


జరగబోయే భయంకరమైన నిజం మాత్రం ఇదే.                                                                          


నా దేశంలో నేను అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు!


పాస్ పోర్ట్ చూపించమన్నారు!


నేను యెప్పుడు దేశం దాటిపోయానో నాకే అర్థం కాలేదు! కళ్లు పులుముకున్నాను! ఆవులింతని మింగేశాను! నన్ను నేనే గిచ్చుకోబోతే పక్కనున్న మా ఆవిడ సాయం చేసింది! నొప్పికి 'అమ్మా' అన్నాను! 'మీ సరసం తర్వాత' ముందు కానీ అన్నట్టు చూశారు!


నేను బేలగా తిరిగి చూశాను!


'వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి గాని తిరగడానికి గాని వదిలి వెళ్లడానికి గాని అనుమతి లేదు' ఖండితంగా చెప్పారు!


నాకు అనుమానం తీరలేదు! 'ఎక్కడున్నానా?' అని చుట్టూ చూశాను! పాస్ పోర్ట్ ఆఫీసు కాదు?! నేను పని చేసిన ఆఫీసూ యిప్పుడు నాది కాదు?! ఆఫీసూ లేదు! రాత్రి నేను మందూ కొట్టలేదు!


'మనిల్లే' అంది నా చెయ్యి పట్టుకు నా కూతురు!


'ఔను డాడీ... యిది మనిల్లే' అన్నాడు నా మరో చెయ్యి పట్టుకు నా కొడుకు!


'నా యింట్లోకి వొచ్చి నన్నే అడుగుతున్నారు? వీళ్ళేవరు?' అన్నట్టు మా ఆవిడ వంక వెర్రి చూపులు చూశాను!


'మీరెవరు' తిరిగి అడిగారు వాళ్లు!


ఇల్లు యిరుకయింది! ఇంటినిండా వాళ్లే! వాళ్ళ భుజాలమీద మూడు సింహాలు! నెత్తిమీద మువ్వన్నెల జెండాలు! కాషాయ కండువాలు!


నేను అయోమయంగా అడుగు ముందుకు వెయ్యబోయాను! నా ముందే గీత గీశారు!


'ఏమిటిది?' అని అడిగాను!


'దేశ సరిహద్దురేఖ' అని, 'వేరీజ్ యువర్ వీసా అండ్ పాస్ పోర్ట్' ఆ గొంతులో తీవ్రమైన హెచ్చరిక ధ్వనించింది!


'మా ఆయనకేమయినా వుద్యోగం యిస్తారా?' తన ఆలోచనల్లో తానుండి ఆశగా అడిగింది మా ఆవిడ! ఎందుకంటే, రెసిషన్ రిజల్టు ముందే అందింది మాకు!


'ముందు మిమ్మల్ని యిక్కడ వుండనిస్తే వుద్యోగమిచ్చినట్టే' అన్నారు వాళ్లు!


నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్... యీ దేశపు నిజమైన పౌరుల జాబితా తయారు చేస్తున్నారేమో అందుకేనేమో అనుకున్నాన్నేను! 'నా పెళ్లాం బిడ్డలతో యెక్కడికి పోను? నా పేరు పౌరుల జాబితాలో వుండేలా చూడు స్వామీ' అని భగవంతుణ్ణి వేడుకున్నాను!


అప్పటికీ నా ఆధార్ కార్డూ పాన్ కార్డూ రేషన్ కార్డూ వోటరు ఐడీ డ్రైవింగ్ లైసెన్సూ సకలమూ వాళ్ల ముందుంచాను! వాళ్ళు అనాసక్తంగా చూసి వాటిని ధ్రువీకరించక పోగా విలువలేనట్టు పక్కన పడేశారు! వాళ్లు వొకరి ముఖాలు వొకరు చూసుకుంటున్నారు! 


నేనూ మా ఆవిడా అయోమయంగా వొకర్నొకరు చూసుకుంటుంటే పిల్లలు తమ పేర్లూ క్లాస్లూ సెక్షన్లూ రోల్ నంబర్లు సహా స్కూలూ అన్నీ చెప్పేశారు!


వాళ్లు వినలేదు! వాళ్లలో వాళ్లు కళ్లతో సంభాషించుకుంటుంటే నాకెందుకో భయం వేసింది! అందుకే సిగ్గుపడకుండా బట్టలిప్పి పుట్టుమచ్చలు టెన్త్ సర్టిఫికేట్లో వున్న ప్రకారం చూపించాను! 'అరే.. మీకిక్కడ పుట్టు మచ్చ వుందని నేను చూడ్లేదు...' గొణుగుతూ నవ్వింది మా ఆవిడ! అంతలోనే 'అలా చూడకే యిదిగో యిక్కడిదాక తెచ్చారు' నేనేదో నేరం చేసినట్టు అందుకే వాళ్లు యింట్లోకి వచ్చేసినట్టు నిష్టూరంగా అంది!


'ఊ... మేం అడిగిన వాటికి ఆన్సర్సు చెప్పండి?'


వినయంగా తలాడించాన్నేను!


'జనాభా లెక్కల వాళ్లా?' మా ఆవిడ అనుమానంగా అందో యెకసెక్కంగా అందో తెలీదు!


ఆ మాటకు వాళ్లు  సీరియస్ గా చూడడంతో అనకూడని మాట అనేసినట్టు చప్పున మా ఆవిడ నోటి మీద వేలేసుకుంది! చూసి పిల్లలు కూడా!


సాయుధలైన రక్షక భటులూ సైనికులూ మా చుట్టూ కంచె కట్టారు!


'మన జాతిపిత యెవరు?' అడిగారు!


'మహాత్మా గాంధీ' అంది మా ఆవిడ నోటిమీద వేలు తియ్యకుండా! 'మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ' పూర్తిపేరు తనకూ తెలుసన్నట్టు చెప్పాడు నా కొడుకు!


వాళ్ళలో వాళ్లు  గొణుక్కొని పెన్నూ పేపరూ తీసుకొని నోట్ చేసుకున్నారు! నోట్స్ రాసుకున్నారు!


'వ్యక్తులు కూడా వుగ్రవాదులే... తెలుసు కదా?' తలాడిస్తూ కళ్లెగరేస్తూ వార్నింగు చేస్తూ వాళ్లు!


'ఏ విచారణా చెయ్యకుండా యెవరినైనా వుపా చట్టం కింద వుగ్రవాదిగా ప్రకటించొచ్చు...' నే చెప్పడం పూర్తి కాలేదు! 'సో... ఒళ్లు దగ్గర పెట్టుకొని సరిగా జవాబులు చెప్పండి..' మెత్తని గొంతుతో గట్టిగా చూశారు!


'మన జాతిపిత మోడీ... నరేంద్ర మోడీ' ఠక్కున చెప్పాను! సరైన సమాధానం చెపుతున్నట్టు వాళ్లు తలలూపుతుంటే 'మోడీని జాతిపితగా అంగీకరించనివాడు భారతీయుడు కాదు' అచ్చం కేంద్రమంత్రి జితేంద్ర సింగులాగ అన్నాను!


'అంటే మన బాపు...' నా కూతురు అనుమానం నాకర్థమయ్యింది! 'మోడీ గారేనమ్మా' మా ఆవిడ క్షణాల్లో ప్రమాదం పసిగట్టి నాకు బాగా ట్యూన్ అయ్యింది! 


పిల్లలను దిద్దింది! టెర్రరిస్టులను కాకుండా పిల్లల భవిష్యత్తుని కాపాడింది!
'ఫైర్' అన్నారు వాళ్లు!


నేను వులిక్కిపడ్డాను! మా ఆవిడా పిల్లలూ కూడా! అప్పటికే నిఘా బృందం మా యిల్లంతా వెతుకుతున్నారు! 'దేశ ప్రజల కదలికలపై నిఘా... త్వరలో పట్టాలెక్కనున్న మూడువేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు' అని నిన్ననే చదివిన వార్త ఆ సమయంలో గుర్తుకు వచ్చి గుండె గుభిల్లుమంది!


నాకు అర్థం కాలేదనేమో వాళ్లు మళ్ళీ 'రాపిడ్ ఫైర్' అన్నారు! అంటూనే మొదలు పెట్టేశారు!


'దేవుడు వొక్కడే?'


'ఆ వొక్కడూ రాముడే!' అన్నాను! నాకర్థమయిపోయింది!
'గుడ్... వొక్కటే మతం?'


'హిందూ మతం!' అంది మా ఆవిడ! మా ఆవిడకర్థమయిపోయిందని నాకర్థమయ్యింది!


'వెరీ గుడ్... వొక్కటే భాష?'


'హిందీ భాష!' అన్నారు పిల్లలు! మా పిల్లలకు కూడా అర్థమయిపోయినట్టే వుంది! మార్కులు మా బాగా స్కోరు చేస్తున్నామని కాన్ఫిడెన్సు కలిగిందో యేమో 'వొక్కటే ఆహారం' అని కూడా చెప్పారు!


'ఎక్సలెంట్... పెద్ద నోట్ల రద్దు వల్ల...' వాళ్ళు అడక్క ముందే 'నల్లదనం వెలికి తీశారు, వుగ్రవాదుల ఆట కట్టించారు' అన్నాను! వెంటనే మా ఆవిడ 'వొకటే దేశం వొకటే జియ్యస్టీ' స్లోగన్ తీసింది!


'ప్రపంచశాంతికి పాటుపడుతున్న దేశం అమెరికా' అన్నాను! 'ట్రంపూ మోడీ శాంతి దూతలు' అన్నాను! 'ఉగ్రవాదాన్ని వూడ్చి పారేసేది వీళ్లే' అన్నాను!


వాళ్ళు నన్ను ప్రశంసగా చూశారు! దాంతో పోయిన నా ప్రాణాలు నా అరచేతికి వచ్చాయి!


'కశ్మీరు?'


'భారత్లో అంతర్భాగం' అన్నాను! 'త్రీ సెవెంటీ రద్దు సాహసోపేత నిర్ణయం' మా ఆవిడ యింకా చెప్పేదే-


'ఇంట్లో వుండకూడని పుస్తకం?'


'వార్ అండ్ పీస్' అన్నారు పిల్లలు! పిల్లలకు సాయంగా జడ్జిగారు చెప్పిన విషయం కూడా వెంటనే గుర్తు చేసింది మా ఆవిడ!


'దేశభక్తుడు యెవరు?'


'నాథూరామ్ గాడ్సే' అన్నాను! సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ని గురించి మా ఆవిడ యేదో చెప్పబోయింది! ఇంతలో 'గాంధీగారు అందుబాటులో లేక ఆవిడ ఆయన బొమ్మని గన్తో కాల్చింది కదమ్మా' నా కూతురు మా ఆవిడ్ని అడిగింది! 'ఎంత రక్తం కారిందో?' 
కనుగుడ్లు నిలేసి వాట్సప్ లో చూసిందే చెప్పింది! 'గాంధీగార్ని చంపేశారు కాబట్టే మనకు మరో జాతిపిత కావాలి... అందుకే మోడీగారు మన జాతిపిత' నా కొడుకు యెవరికీ అవకాశం యివ్వలేదు! 'అయితే ఆవిడ... ప్ర... ప్ర...' నా కూతురుకు నోరు తిరక్కుంటే 'ప్రజ్ఞాసింగ్ ఠాగూర్' అని అందించింది మా ఆవిడ! 'మళ్లీ ఆవిడ నిజంగానే యీ జాతిపితనీ కాల్చేస్తుందా?' అమాయకంగా అడిగింది!


వాళ్లు యేదో నోట్ చేసుకున్నారు! నా గుండె ధడ్మంది! మా ఆవిడ  గ్రహించి నా కూతురు నోరు నొక్కేసింది! కళ్లతోనే పిల్లలిద్దర్నీ హెచ్చరించింది!


'ఆక్సిజన్ యెక్కడి నుండి లభిస్తుంది?
'
'ఆవుల నుండి!' అన్నారు పిల్లలు!


'గోవులు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి' అన్నాను!


'బాతుల వల్ల ఆక్సిజన్ పెరుగుతుంది!' పిల్లలు విప్లవ్ దేవ్ లయిపోయారు!


'మన జాతీయ జంతువు?'


“ఆవు!' పిల్లలిద్దరూ పోటీ పడి చెప్పారు!


'టీవీలూ పేపర్లూ చూడడం యెంత వుపయోగమో చూశారా?' అన్నట్టు చూసింది మా ఆవిడ! నేనే అనవసరంగా తిట్టానని గ్రహించి తప్పు వొప్పుకుంటున్నట్టు మా ఆవిడ కళ్లలోకి చూడలేక తలదించుకున్నాను!


'సరే, మరి ఆవులు పాలెక్కువగా యివ్వాలంటే?'


'వాటి ముందు ఫ్లూటు వూదాలి' అంది నా కూతురు! 'ప్లూటు సింహం ముందు కాదు, జింక ముందు వూదు' మధ్యలో బాలకృష్ణ అయిపోయాడు నా కొడుకు! 


'శ్రీకృష్ణుడిలా పిల్లనగ్రోవితో ప్రత్యేక సంగీతం వినిపిస్తే ఆవులు సాధారణం కంటే కొన్ని రెట్లు అధికంగా పాలిస్తాయి' మా ఆవిడ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ అయిపోయింది!


'డైనోసార్లను కనుగొన్నది యెవరు?'


'బ్రహ్మ!' అంది మా ఆవిడ! ఆ క్షణాన మా ఆవిడ మా ఆవిడ కాదు, భూ విజ్ఞాన శాస్త్రవేత్త అశు ఖోస్లాలా అగుపించింది! 


సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి తెలియంది యేదీ లేదంది! డైనోసార్ల గురించి బ్రహ్మదేవుడు వేదాల్లో కూడా ప్రస్తావించాడంది! డైనోసార్ అనే పదం కూడా సంస్కృతం నుండి పుట్టిందంది! డైనో అంటే భీకరం.. సార్ అంటే అంటే బల్లి అని వివరించింది!


మా పిల్లలతో పాటు నేనూ పిల్లాన్నై విన్నాను!
'షుగర్ వ్యాధికి మెడిసన్?'


'భగవద్గీత!' కూడబలుక్కున్నట్టు మా ఆవిడా నేనూ వొకేసారి అన్నాం!


'చెరకు పండించకండి... మీకు షుగర్ రాదు' యోగి మాదిరి మా పిల్లలన్నారు!
'ఆరోగ్యానికి దివ్య ఔషదం?'


'గోమూత్రం' మా యిద్దరిదీ మళ్ళీ వొకే గొంతు! కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్ చౌబే గొంతు! గొంతులు కలవడంతో 'మనింటికి చుట్టాలు వస్తారేమో?' అంది మా ఆవిడ! 'వీళ్లు చుట్టాలేగా?' అని యేడుపు ముఖంతో నవ్వాను!


'గుడ్! ఔనయ్యా... మీరు యిద్దరు పిల్లల్నే కన్నారు?'


'యస్సార్... మేమిద్దరం మాకిద్దరు...' గర్వంగా అన్నాను!


'నువ్వు మనిషివేనా?'


ఆ ప్రశ్న అర్థంకాక అయోమయంగా చూశాను!


'ఔనమ్మా... హిందువైన ప్రతీ స్త్రీ యెంతమంది పిల్లల్ని కనాలి?'


'ఐదుగురు పిల్లల్ని కనాలి' అన్నాను సాక్షి మహారాజ్ని గుర్తు తెచ్చుకుంటూ! 


అంతలోనే శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి గుర్తుకొచ్చాడు! అంతే- 'పదిమంది పిల్లల్ని కనాలి... హిందూ రాజ్యం స్థాపించాలి' అన్నాను!


'ఎవరు?'


'ప్రతి భారతీయుడూ!' అన్నాను! కాలు నేలకు తన్ని 'జై హింద్' అని సెల్యూట్ చేశాను!


'ఫ్యామిలీ ప్లానింగు చేసుకున్నారుగా?' కలవరపడింది మా ఆవిడ! 'రీకేనలైజేషన్ చేసుకు చస్తానులేవే' అన్నాను! వాళ్లు యెదురుగా వున్నారని గుర్తొచ్చి నాలుక కరుచుకున్నాను! కాని వాళ్లు నావంక ప్రశంసా పూర్వకంగా ప్రోత్సాహ పూర్వకంగా చూశారు!


'కౌరవులు వందమంది...' చెప్పబోతుంటే 'నేను చావాలా బతకాలా?' అన్నట్టు కొరకొరా చూసింది మా ఆవిడ!


'కౌరవుల పుట్టుకకు కారణం?' 
     
'మూల కణ... స్టెమ్ సెల్ పరిజ్ఞానం... ఆ కాలంలోనే వుంది...' చెప్పబోయాను!


'ఇప్పటి మిస్సైల్సూ టెక్నాలజీ అంతా కూడా...'


'అప్పటి బాణాలే...' ముందే బాణం వేశాను!


'ఇంటర్నెట్?
'
'మహాభారత కాలంలోనే కనుక్కొన్నారు' అన్నాను!


తానూ తక్కువ తినలేదన్నట్టు మా ఆవిడ 'మొదటి ప్లాస్టిక్ సర్జరీ వినాయకుడికి జరిగింది' అని పెద్దలద్వారా విన్న జ్ఞానాన్ని పంచింది! అక్కడితో ఆగక 'నారదుడు మొట్ట మొదటి జర్నలిస్టు! గూగుల్ వంటి వాడు! గూగుల్ పుట్టిందే నారదుని ఇనిస్పిరేషన్తో!' 
మా ఆవిడ విజయ్ రూపాణి అయి అడక్కుండానే చెప్పుకుపోతోంది!


'మొట్ట మొదటి సర్జరీ నేర్పించింది శివుడు!' అచ్చం మోడీలా అన్నాడు నా కొడుకు!


'గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఐన్'స్టీన్' కనుగొన్నాడు' పీయస్ గోయలుకు తక్కువ కాలేదు నా కూతురు!


ప్రశ్నపత్రం ముందే లీకయిపోయినట్టు అందరూ అడక్కుండా చెప్పడం చూసి నాకూ ఆనందం వేసింది! ఆ వుత్సాహంలో గంతులేస్తూ నేనూ 'మూత్రాన్ని నిలువ వుంచుకోవాలి! పారేయకూడదు... యెక్కడ పడితే అక్కడ పోసేయకూడదు! మూత్రాన్ని యూరియాగా వుపయోగించు కోవాలి!' నాకే తెలీకుండా నాలో గడ్కరీ ప్రవేశించాడు!


నా గంతులకి నేను కోతిలా అనిపించానేమో 'కోతులు కరిస్తే యేమి చేస్తారు?' అని అడిగారు వాళ్ళు!


నాకయితే నిజంగానే కోతి కరిచినట్టయింది! మాట రాలేదు! జుట్టు పీక్కుంటుంటే మా ఆవిడ ఆపద నుండి ఆదుకొని నాకు పునర్జన్మనిచ్చింది! 'హనుమాన్ చాలీసా చదవడం వల్ల కోతులు కరవకుండా నివారించవచ్చు' యోగీ ఆదిత్యానాథుకు నకలయ్యింది మా ఆవిడ! 'ప్రివెన్షన్ యీజ్ బెటర్ దేన్ క్యూర్' అన్నాడు నా కొడుకు! 'వజ్రం' అని మా ఆవిడ కొడుకుని అలా మెచ్చేసుకుందో లేదో-


'సరే, కోహినూర్ వజ్రం కంటే విలువైనది?'


'ఆవు పేడ!' అంది నా కూతురు! 'హిందూ పబ్లిక్ స్కూల్లో వెయ్యడం చాలా చాలా పనికొచ్చింది... ప్రాణం నిలబెట్టింది' అనుకున్నాను!


'అణుబాంబుల నుండి మిమ్మల్ని మీరు యెలా రక్షించుకుంటారు?'


'ఆవుపేడ వొళ్లంతా రాసుకొని పూసుకొని' చెప్పింది నా కూతురు! అది నా వారసురాలు అయినా కాకపోయినా శంకర్ లాల్ వారసురాలు... అని అనుకున్నాను!


'తక్షణ తలాక్ నిషేధ చట్టాన్ని యెలా చూస్తారు?'


'ఒకే దేశం... వొకే రాజ్యాంగం... వొకే పౌరసత్వం!' ధాటిగా అంది మా ఆవిడ!
'ఎన్ఐయ్యే... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి విస్తృత అధికారాలు యివ్వడాన్ని యెలా చూస్తారు?'


'పాకిస్తాన్లో మాత్రమేనా సైనిక పాలన వుండేది? మనదగ్గర యెందుకు వుండకూడదు? త్రివిధ దళాలకు వొక్కడే అధిపతి! అతడే ప్రజాపతి!' పొయిటిక్ గా అన్నానే గాని దాని అర్థమేమిటో నాక్కూడా తెలీదు!


'మీ వుద్యోగం పోయింది కదా?, ఏమి చేస్తారు?'


'పకోడీ బండి వేసుకుంటాను' అన్నాను!


'కార్పోరేట్ వ్యాపారులకు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు పైగా రాయితీలు ప్రకటించడాన్ని మీరెలా అర్థం చేసుకుంటారు?'


'ఆర్ధిక మాంద్యం నుండి మందగమనం నుండి బయట పడెయ్యడానికి పన్ను తగ్గింపు రాయితీలు ప్రకటించిందే తప్ప యెన్నికల్లో సహకరించారని కాదు' అన్నాను పార్టీ కేడరుకు మల్లె!


'జీడీపి... గ్రాస్ డొమస్టిక్ ప్రొడక్ట్... స్థూల జాతీయ వుత్పత్తి యెన్నడూ లేనంతగా తగ్గడాన్ని యెలా అర్థం చేసుకుంటారు?'


నేను బుర్ర గోక్కున్నాను! ఏమని చెప్పాలో తెలీలేదు! సమయానికి మా ఆవిడ ఆదుకుంది... 'అంతా ప్రతిపక్షాల కుట్ర' అని!
'మోటారు యిండస్ట్రీ స్లంపుకు కారణం?'


'యూబరూ వోలా వల్ల యువత కార్లు కొనడం మానేశారు' మా ఆవిడ మా ఆవిడ కాదు, ఆమె వో నిర్మలా సీతారామన్ అయిపోయింది! 


'విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యం కోర్సు యిప్పటికే ప్రవేశపెట్టారు, నెక్స్ట్?'


'చేతబడి... బాణామతి!' ప్రశ్న పూర్తికాక ముందే అంది మా ఆవిడ! 'అమ్మా... అన్నయ్యా నేనూ చేతబడి... బాణామతి కోర్సుల్లో చేరతామామ్మా..' అని పట్టుబట్టింది నాకూతురు! 'ఔను... భవిష్యత్తులో చాలా డిమాండ్ వున్న కోర్సులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వున్న కోర్సులు అవే' నా వంతుగా అన్నాను!


'దేశ నిర్మాణాన్ని యెలా చూస్తారు?'


'రామ మందిరం నిర్మాణంలో చూస్తాము' మళ్ళీ కూడబలుక్కున్నట్టుగా అన్నాము నేనూ మా ఆవిడా!


సుదీర్ఘమైన ఫైర్లో అలసిన పిల్లలు పుస్తకాలు తీసి చదువనారంభించారు!


'మగ నెమలి కన్నీళ్లు తాగి ఆడ నెమలి గర్భం ధరించును! ముద్దార నేర్పించగా గోవులు సంస్కృతమును నేర్చుకొనును! విద్యుత్తు తయారీకి జీలకర్రా బెల్లము కలిపిన విద్యుత్తు పుట్టి ప్రవహించును! శిశువులు తల్లి గర్భమున కాక తలయందు భుజములయందు తొడలయందు పాదములయందు జన్మింతురు! గోమాంసము తిన్న యెడల కొట్టి చంపవలెను! మూకగా చేయు హత్యలు నేరములు కావు, అవి సంస్కృతిక సేవలు! ఆ సేవలో మనమందరం నడచి తరించవలెను!'


వాళ్ళు తృప్తిగా చూశారు! నాకూ మా ఆవిడకూ నా కూతురుకూ కొడుకుకూ భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయకుండా తిరిగి పునరుద్ధరించారు!


'భారతదేశం నా మాతృభూమి! భారతీయులందరూ హిందువులు!' పిల్లలు మళ్లీ చదవడం మొదలు పెట్టారు!
వచ్చినవాళ్లు అప్పటికి వెళ్లారు!


అపానవాయువు ప్రాణవాయువై మా నరనరాన పల్లవించింది!!