గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదే: సీఎం జగన్‌

 


గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదే: సీఎం జగన్‌
సచివాలయ ఉద్యోగులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు
అవినీతిరహిత పాలన లక్ష్యంగా సచివాలయాలు
4 లక్షల ఉద్యోగాలు కల్పన ఓ చరిత్ర
గ్రామ సచివాలయాలను ప్రారంభించిన సీఎం జగన్‌
తూర్పు గోదావరి : గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్ప ప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో 10శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే ప్రతి 50 ఇళ్లకు అదనంగా ఒక వాలంటీర్‌ను నియమించామన్నారు. సభలో సీఎం మాట్లాడుతూ 'ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. 1,34,978 మందికి శాశ్వత ఉద్యోగాల కల్పన రికార్డ్‌. ఇకపై గ్రామల్లోనే 500కుపైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయాల్లో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారానే రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడమే మా లక్ష్యం. ప్రభుత్వ పథకాలను, పాలనను ప్రతి గడపకు తీసుకెళ్లడం మా ధ్యేయం. గ్రామాల్లో పాలన చాలా అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వంలో లంచాలు ఇవ్వనిదే పని జరిగేది కాదు. అలాంటి వ్యవస్థను శాశ్వతంగా రూపుమాపడమే సచివాలయాల కర్తవ్యం.
25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు : గుడిబడి అన్న తేడా లేకుండా ప్రతి గ్రామంలో బెల్టు షాపులను తెరిచిన చరిత్ర గత పాలకులది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే మద్యం అమ్మకాలను 20శాతం తగ్గించాం. ఉగాది నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తాం. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా మా పాలన సాగుతోంది. రానున్న రోజుల్లో కచ్చితంగా వందశాతం అక్షరాస్యతను సాధిస్తాం. ప్రతి ప్రభుత్వ పథకాలను డోర్‌డెలివరీ చేస్తాం. ఎవరైనా వాలంటీర్లు అవినీతి, పక్షపాతానికి పాల్పడితే 1902కు ఫోన్‌ చేసి నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అక్టోబర్‌ 15న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రారంభిస్తాం. జనవరి 26న అ‍మ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం. ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం' అని అన్నారు.