రాష్ట్ర భవిష్యత్తు, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆలోచించే స్థితిలో ప్రజలు ఉండరు.

విచిత్రం ఏమిటంటే... తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఆశించకుండానే ''మేం అది చేస్తాం.. ఇది చేస్తాం'' అంటూ హామీలను గుప్పిస్తున్నారు.


ఇస్తే తీసుకోవడానికి ప్రజలకు మాత్రం డబ్బు చేదా? ఇలాంటి అర్థంపర్థం లేని వరాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆలోచించే స్థితిలో ప్రజలు ఉండరు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఆ దిశగా ఆలోచన చేయాలి. దురదృష్టవశాత్తు 'తోటివాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటాను' అన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులూ పోటీ పడుతున్నారు. తొలుత బడాయిలకు పోయి ఆ తర్వాత అలసిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పుడు కాడి పడేశారు. ''పైసలు లేవ్‌...'' అన్న పాటను ఆలపిస్తున్నారు.
 
తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారు. నిన్న చంద్రబాబు గానీ, ఇవ్వాళ జగన్మోహన్‌రెడ్డి గానీ ఈ అప్పులను తీర్చరు. భవిష్యత్తులో ప్రజలపైనే ఆ భారం పడుతుంది. రాష్ట్రంలో వెనిజులా మోడల్‌ను అమలుచేస్తున్నారని కొద్ది వారాల క్రితం నేను ఇదే కాలమ్‌లో చెప్పాను. చంద్రబాబునాయుడు అప్పుల రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అప్పు చేసి పప్పు కూడు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? 


 
వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు మీడియా సంస్థలకు నామమాత్రపు ధరకు భూమి కేటాయించారు. తమను బలపరిస్తే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఉన్న విలువైన భూమిని 'ఆంధ్రజ్యోతి'కి కేటాయిస్తామని అప్పట్లో ఇదే జగన్మోహన్‌రెడ్డి నా వద్దకు రాయబారం పంపారు. షరతులకు లోబడి భూమి తీసుకోవడానికి అప్పుడు నేను అంగీకరించలేదు. ఇప్పుడు విశాఖలో కూడా గతంలోనే కేటాయించిన భూమిలో ప్రభుత్వం ఎకరం తిరిగి తీసుకున్నందున అదే సర్వే నెంబర్‌లో పక్కనే ఉన్న భూమినే ఇవ్వాలని కోరాం. నిజానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమికి డబ్బు చెల్లించే అవసరం లేకపోయినా 50 లక్షలు చెల్లించడానికీ అంగీకరించాం. ఇదంతా అక్రమమనీ, మొదటిసారిగా 'ఆంధ్రజ్యోతి'కి మాత్రమే అప్పనంగా భూమిని కేటాయించారనీ మంత్రి పేర్ని నానితోపాటు జగన్‌ మీడియా ప్రచారం చేయడాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటాం. 
 
చానెళ్ల ప్రసారాలను అడ్డుకుని కూడా మాకు సంబంధం లేదని పేర్ని నాని బుకాయించారు గానీ, అలా బుకాయించడం మాకు చేతకాదు. మా వైఖరిలో తప్పులుంటే సరిచేసుకోవడానికి మేం సిద్ధం. జగన్‌ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేనందునే మీడియాను నిందిస్తోంది. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు స్థాపించి మిగతావారు కూడా తమకే భజన చేయాలనుకోవడం వల్లే తంటా అంతా! చంద్రబాబు కంటే మిన్నగా రాజధానిని నిర్మించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్మోహన్‌రెడ్డిని కూడా శభాష్‌ అని మెచ్చుకుని సమర్థిస్తాం. జర్నలిజం గురించి, విలువల గురించి జగన్‌ అండ్‌ కో మాట్లాడుతుంటే వినడానికి రోతగా ఉంటోంది. 
 
'మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె' అన్నట్టుగా ఉంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు! 'ఏక్‌ సే బడ్‌కర్‌ ఏక్‌' అన్నట్టుగా ప్రజాధనాన్ని సంక్షేమం పేరిట కేసీఆర్‌– జగన్మోహన్‌రెడ్డి పంచిపెట్టడం వల్ల రెండు రాష్ట్రాలూ ఆర్థికంగా దివాలా వైపు అడుగులేస్తున్నాయి. మొదటి దఫా పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలతో వివిధ పథకాలను అమలుచేయడం మొదలుపెట్టి... ఇప్పుడు ఖజానా నిండుకోవడంతో తెల్లమొహం వేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోవడంతో చేసిన అప్పులు తీర్చడం కోసం దారులు వెతుక్కుంటున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతం చెల్లించడానికి కూడా సంస్థ వద్ద డబ్బుల్లేవనీ, ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద కూడా లేవనీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ముందు వాపోయారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె ముదిరి రాష్ట్ర బంద్‌కు దారితీసింది. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియదు. రైతు బంధు పథకం అమలుకు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలుచేయవలసి ఉంది. ఇదేకాకుండా మరెన్నో హామీలు అమలుకు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇలావుంటే.. రెవెన్యూ లోటుతో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజాధనాన్ని వివిధ పథకాల పేరిట పంచిపెడుతూ పోతున్నారు. అప్పులు చేసి మరీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను అమలుచేయడం మొదలైంది. ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పది వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చి పసుపు–కుంకుమ పేరిట పంచి పెట్టారు.
 
  ఇప్పుడు ఐదు నెలలుగా కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరిట ఖజానాకు సమకూరుతున్న సొమ్మునంతా పంచిపెడుతున్నారు. ఫలితంగా గడిచిన తొమ్మిది మాసాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదు. మౌలిక వసతుల కల్పన వంటి పెట్టుబడి వ్యయం చేయకుండా సంక్షేమం పేరిట బొక్కసాన్ని ఖాళీ చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. రైతు భరోసా పథకానికి అవసరమైన మొత్తంలో తొలి విడత కింద చెల్లించడానికై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించగా, అందులో దాదాపు సగం అప్పుగా తెచ్చారు. అమ్మ ఒడి, డ్వాక్రా మహిళలకు ఏటా పది వేల వంతున చెల్లించే పథకం అమలుకు వేచి చూస్తున్నాయి. వాటి కోసం మరో 15 వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బొత్తిగా బాగా లేదని ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ చెబుతూ కూడా పథకాల పేరిట వేల కోట్లను పంచిపెడుతున్నారు. చంద్రబాబు వలె ఎన్నికలకు ఆరు నెలల ముందు కాకుండా అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే హామీల అమలుకు పూనుకున్న జగన్మోహన్‌రెడ్డి ఎంతో గొప్పవాడు అని కీర్తిస్తూ విజయసాయిరెడ్డి వంటి వారు ట్వీట్లు చేస్తూ ఆనందిస్తున్నారు. తెలంగాణలో ఆదాయం తెచ్చిపెట్టడానికి హైదరాబాద్‌ ఉంది.
 
   ఆంధ్రప్రదేశ్‌కు అటువంటి వెసులుబాటు ఏదీలేదు. అయినా దాదాపు 60వేల కోట్ల రూపాయలతో నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేయడం భవిష్యత్తులో రాష్ట్రానికి శాపంగా మారుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు తండ్రితో సమానం. బాల్యంలో చదువు విషయంలో, ఆ తర్వాత కంటికి కనిపించిన ప్రతిదీ కావాలని పిల్లలు మారాం చేస్తుంటారు. అయితే బాధ్యతాయుతమైన తండ్రి అడిగినవన్నీ కొనిపెట్టరు. అలా చేస్తే పిల్లలు చెడిపోతారన్నది మన భావన! పిల్లలు కూడా ఎదిగేకొద్దీ తండ్రిని అర్థం చేసుకుంటారు. పిల్లల వంటి ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి ఆశించడం సహజం. విచిత్రం ఏమిటంటే... తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఆశించకుండానే ''మేం అది చేస్తాం.. ఇది చేస్తాం'' అంటూ హామీలను గుప్పిస్తున్నారు. ఇస్తే తీసుకోవడానికి ప్రజలకు మాత్రం డబ్బు చేదా? ఇలాంటి అర్థంపర్థం లేని వరాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు, తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆలోచించే స్థితిలో ప్రజలు ఉండరు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఆ దిశగా ఆలోచన చేయాలి. దురదృష్టవశాత్తు 'తోటివాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటాను' అన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులూ పోటీ పడుతున్నారు.
 
   తెలంగాణలో అమలు చేసిన పథకాలను తమకూ అమలు చేయాలని ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ విలీనం వంటి వాటిని తెలంగాణలో కూడా అమలుచేయాలని కోరుతున్నారు. తొలుత బడాయిలకు పోయి ఆ తర్వాత అలసిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పుడు కాడి పడేశారు. ''పైసలు లేవ్‌...'' అన్న పాటను ఆలపిస్తున్నారు.
 
పందేరాలకు అంతం లేదా?
తత్వం బోధపడని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. ప్రభుత్వ బొక్కసానికి కాసిన్ని నిధులు సమకూరగానే దానికి మరికొంత అప్పు చేసి మరీ పంపిణీలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని పంచిపెట్టి ఓటు బ్యాంక్‌ను అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్షతోనే ఇలా చేస్తున్నారు. అయితే పరిమితులు లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని విస్మరిస్తే ప్రజలు కూడా హర్షించరు. ఈ వాస్తవాన్ని జగన్మోహన్‌రెడ్డి గ్రహించలేకపోతున్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసి 2009 ఎన్నికలలో తాను కొత్తగా ఇంకే హామీ ఇవ్వలేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గ్రహించిన ఆయన రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో దుబారాను అరికట్టాలనుకున్నారు కూడా! పాలనానుభవం లేని జగన్మోహన్‌రెడ్డి మాత్రం పంచిపెడుతూనే ఉంటానంటున్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు.
 
   నిన్న చంద్రబాబు నాయుడు గానీ, ఇవ్వాళ జగన్మోహన్‌రెడ్డి గానీ ఈ అప్పులను తీర్చరు. భవిష్యత్తులో ప్రజలపైనే ఆ భారం పడుతుంది. రాష్ట్రంలో వెనిజులా మోడల్‌ను అమలుచేస్తున్నారని కొద్ది వారాల క్రితం నేను ఇదే కాలమ్‌లో చెప్పాను. విచ్చలవిడి సంక్షేమానికి అడ్డుకట్ట వేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ దివాలా తీయడానికి ఎంతో సమయం పట్టదు. చంద్రబాబునాయుడు అప్పుల రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అప్పు చేసి పప్పు కూడు పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? రహదారుల నిర్వహణ చేపట్టకుండా ఆటోవాళ్లకు పది వేల వంతున పంచిపెడితే ఏమి వస్తుంది? ఆటోల మరమ్మతులకు అంతకంటే ఎక్కువే అవుతుంది. అంతేకాదు.. గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా పోయే ఆస్కారం ఉంటుంది. ఒకే ఒక్క వ్యక్తి తాను మంచివాడిననీ, దానకర్ణుడిననీ అనిపించుకోవడానికి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఏమిటి? జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత పూచీతో అప్పులు చేసి మంచివాడని అనిపించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రాంతీయ పార్టీల వల్ల రాజకీయాలతో పాటు రాష్ట్రాలు కూడా నాశనం అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించినప్పుడు చాలామందికి అభ్యంతరకరంగా అనిపించింది. ఇప్పుడు వ్యక్తులు ముఖ్యమంత్రులు అవడం కోసం ఇస్తున్న హామీలు, అమలుచేస్తున్న పథకాలను గమనిస్తుంటే మోదీ– షా ద్వయం మాటల్లో నిజం ఉందనిపించడం లేదా? ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని తీసుకుందాం. రాష్ట్రం హక్కులను కాపాడటం కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అప్పట్లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ ప్రారంభించారు.
 
    అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, రైతులకు 50 రూపాయలకే హార్స్‌ పవర్‌ వంతున విద్యుత్‌ సరఫరా చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలను పరిమితంగా అమలుచేశారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి నిరాకరించడం వల్ల 2004లో అధికారం కోల్పోయారు. అప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం రెండున్నర దశాబ్దాలుగా వేచి చూస్తున్న వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కూడా ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. సీన్‌ కట్‌ చేస్తే 2014 ఎన్నికలలో రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్లనే తాము అధికారంలోకి రాలేకపోయామన్న భావనకు వచ్చిన జగన్‌ అండ్‌ కో.. 2019 ఎన్నికలలో నవరత్నాలు ప్రకటించి కోరుకున్నట్టుగానే ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలో ఉన్నందున, పరిమితులు తెలిసినందున నవరత్నాలతో పోటీ పడే హామీలను చంద్రబాబు ఇవ్వలేకపోయారు. అధికారం కోల్పోయారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎటువంటి హామీలు ఇస్తారో తెలియదు. నిజానికి అప్పటికి రాష్ట్రం దివాలా తీస్తుంది కనుక ఇవ్వడానికి కూడా ఏమీ మిగలదు. ''పంచుకుంటూ పోతే చివరకు పంచె కూడా మిగలదు'' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అంటూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.
 
    తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు అధికారంలోకి రావడానికి పోటీ పడి మరీ హామీలిస్తున్నారని స్పష్టమవుతోంది కదా? రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. ఇందుకు తమిళనాడు నిదర్శనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా ఈ జాబితాలో చేరుతున్నది. ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తట్టుకోవడానికి జాతీయ పార్టీలు కూడా హామీల విషయంలో పోటీపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ''మరో ఒకటి రెండు పథకాలను ప్రకటించబోతున్నా.. కాస్కోండి'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే శాసనసభలో కాంగ్రెస్‌– బీజేపీలకు హెచ్చరిక చేశారు. ఏపీలో ఇంకేమి ప్రకటిస్తారో తెలియదు. తెలుగునాట బుద్ధి జీవులు ఉంటే ఇప్పటికైనా చొరవ తీసుకుని.. ఈ పందేరాలు ఎంత వరకు? అని హామీలు ఇచ్చేవారిని నిలదీయాలి.
 
సవాల్‌కు సిద్ధమా?
పత్రికలు, జర్నలిజం విలువల గురించి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని 'ఆంధ్రజ్యోతి'ని, నన్ను అదే పనిగా తిట్టిపోశారు. వ్యతిరేక వార్తలు రాసిన మీడియాపై కేసులు పెట్టాలంటూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో విమర్శలు రావడాన్ని జీర్ణించుకోలేని మంత్రి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. పేర్ని నాని స్వతహాగా మంచివాడే గానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సహవాసంతో అలా మాట్లాడి ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ కోసం ఇదే జగన్‌ అండ్‌ కో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నానాయాగీ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ సొంత మీడియా రాసిన రాతలు, కూసిన కూతలు ఇప్పుడు ఏ మీడియాలోనైనా వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. జగన్‌ రోత మీడియా చేసిన ఆరోపణలను అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా రుజువు చేయలేక అష్టకష్టాలు పడటాన్ని చూస్తున్నాం.
 
  జగన్మోహన్‌ రెడ్డి బాబాయ్‌ వివేకానందరెడ్డి సొంత గృహంలో హత్యకు గురైతే... 'నారాసుర రక్తచరిత్ర' అని శీర్షిక పెట్టిన జగన్‌ విష పుత్రిక ఇప్పటివరకు చంద్రబాబు ఆ హత్య చేయించారని రుజువు చేయలేకపోయింది. 'ఆంధ్రజ్యోతి'పైన, నాపైన అంత అక్కసు వెళ్లగక్కడానికి కారణం... గ్రామ కార్యదర్శుల నియామకాల్లో అవకతవకలు జరగడంపైన, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును హఠాత్తుగా బదిలీ చేయడంపైన రాసిన వార్తలే! ఈ రెండు వార్తలు తప్పు అని రుజువు చేయలేక నోటికొచ్చినట్టు నిందించడం నాగరికత అనిపించుకోదు. నిజంగా ఆ వార్తలు తప్పు అని భావిస్తే మంత్రిమండలి తీర్మానించినట్టుగా పరువు నష్టం కేసులు పెట్టుకోవచ్చు కదా? రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాపైన డజనుకు పైగా కేసులు పెట్టారు. అయినా మేము జంకలేదు. ఇప్పుడు కూడా జంకేది లేదు. ప్రభుత్వంపై అకారణంగా బురద చల్లాల్సిన అవసరం మాకు లేదు. జగన్‌ మీడియాకు రాజకీయ ఎజెండా ఉన్నట్టు మాకు అలాంటిది లేదు. తెలుగుదేశం పార్టీని పలు సందర్భాలలో మేం సమర్థించిన విషయం వాస్తవం. ఇందుకు కారణం ఉంది. మా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు. నేను 'ఆంధ్రజ్యోతి'లో విలేకరిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రధాన రహదారులను విస్తరించి ట్యాంక్‌బండ్‌ను వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దారు. దీంతో హైదరాబాద్‌ కొత్త రూపం సంతరించుకుంది.
 
   లుంబినీ పార్క్‌– ఖైరతాబాద్‌ మధ్య రహదారి నిర్మించింది ఎన్టీఆర్‌. అప్పటివరకు ఖైరతాబాద్‌ వెళ్లాలంటే మింట్‌ కాంపౌండ్‌ సందులో నుంచి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడది అభివృద్ధికి ఒక మైలురాయి వంటిది. ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఫ్లైఓవర్లను నిర్మించడంతోపాటు పార్కులు అన్నింటినీ అభివృద్ధి చేసి సైబరాబాద్‌ నిర్మాణం ప్రారంభించారు. చిరాన్‌ ప్యాలెస్‌కు కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌ అని నామకరణం చేసి అభివృద్ధి చేయడం వల్లనే ఇప్పుడు వేల మంది ఉదయం, సాయంత్రం అక్కడ వాకింగ్‌ చేస్తున్నారు. నాడు హైటెక్‌ సిటీ నిర్మాణంతోపాటు సైబరాబాద్‌ను అభివృద్ధి చేసి అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను, ఐఎస్‌బీ వంటి సంస్థలను చంద్రబాబు తెచ్చి ఉండకపోతే ఇవ్వాళ తెలంగాణకు హైదరాబాద్‌ నుంచి అంత ఆదాయం వచ్చి ఉండేదా? విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. ఇవన్నీ చంద్రబాబు పాలనలో మైలురాళ్లు వంటివి. అభివృద్ధికి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తారని మేం నమ్మడం వల్లనే ఆయా సందర్భాలలో మద్దతు ఇచ్చాం. పొరపాట్లు చేసినప్పుడు అంతే సూటిగా విమర్శించాం కూడా. 2004కి పూర్వం సంక్షేమాన్ని, నీటిపారుదల రంగాన్ని విస్మరించడాన్ని ఎత్తిచూపాం. చానెళ్ల ప్రసారాలను అడ్డుకుని కూడా మాకు సంబంధం లేదని పేర్ని నాని బుకాయించారు గానీ, అలా బుకాయించడం మాకు చేతకాదు. మా వైఖరిలో తప్పులుంటే సరిచేసుకోవడానికి మేం సిద్ధం. జగన్‌ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేనందునే మీడియాను నిందిస్తోంది. రాజకీయ పార్టీలు సొంత పత్రికలు స్థాపించి మిగతావారు కూడా తమకే భజన చేయాలనుకోవడం వల్లే తంటా అంతా! చంద్రబాబు కంటే మిన్నగా రాజధానిని నిర్మించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్మోహన్‌రెడ్డిని కూడా శభాష్‌ అని మెచ్చుకుని సమర్థిస్తాం. జర్నలిజం గురించి, విలువల గురించి జగన్‌ అండ్‌ కో మాట్లాడుతుంటే వినడానికి రోతగా ఉంటోంది.
 
   ఇక విశాఖపట్టణంలో 'ఆంధ్రజ్యోతి' సంస్థకు కేటాయించిన భూమి గురించి మంత్రి పేర్ని నాని, జగన్‌ మీడియా విషపూరిత ప్రచారం చేశారు. 1986లో అప్పటి ప్రభుత్వం 'ఆంధ్రజ్యోతి'కే కాదు.. ఇతర పత్రికలకు కూడా విశాఖలో భూమి కేటాయించింది. పత్రికలకు తక్కువ ధరకు భూమి కేటాయించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలు మీడియా సంస్థలకు నామమాత్రపు ధరకు భూమి కేటాయించారు. తమను బలపరిస్తే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ఉన్న విలువైన భూమిని 'ఆంధ్రజ్యోతి'కి కేటాయిస్తామని అప్పట్లో ఇదే జగన్మోహన్‌రెడ్డి నా వద్దకు రాయబారం పంపారు. షరతులకు లోబడి భూమి తీసుకోవడానికి అప్పుడు నేను అంగీకరించలేదు. ప్రభుత్వ భూమిని అప్పనంగా పొందాలన్న దురాశే నాకు ఉండివుంటే నాటి ఆఫర్‌కు ఎగిరి గంతేసేవాడిని. ఇప్పుడు విశాఖలో కూడా గతంలోనే కేటాయించిన భూమిలో ప్రభుత్వం ఎకరం తిరిగి తీసుకున్నందున అదే సర్వే నెంబర్‌లో పక్కనే ఉన్న భూమినే ఇవ్వాలని కోరాం. నిజానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమికి డబ్బు చెల్లించే అవసరం లేకపోయినా 50 లక్షలు చెల్లించడానికీ అంగీకరించాం. ఇదంతా అక్రమమనీ, మొదటిసారిగా 'ఆంధ్రజ్యోతి'కి మాత్రమే అప్పనంగా భూమిని కేటాయించారనీ మంత్రి పేర్ని నానితోపాటు జగన్‌ మీడియా ప్రచారం చేయడాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటాం. 'ఆంధ్రజ్యోతి'కి కేటాయించిన భూమి అక్రమమని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ఒక పని చేద్దాం. మేం ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించిన 50 లక్షలను కూడా వదులుకుంటాం. జగన్మోహన్‌రెడ్డి 45 వేల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్నారనీ, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనీ సీబీఐ నిర్ధారించినందున.. ఆయన కూడా సదరు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారా? ఇందుకు సిద్ధమేనా? అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన అనుచరులు ఇతరులకు బురద పూయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉండదా!?