శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్ర పాపారాయుడు పేరు

 


శ్రీ జయంతి చంద్రశేఖర రావు గారి సౌజన్యంతో :
శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్ర పాపారాయుడు పేరు ప్రస్తావించాల్సిందే. తాండ్ర పాపయ్య కోట రాజాంలో ఉండేది. విజయరామరాజు బొబ్బిలి కోటను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకోవడంతో కోటలోని అంతఃపుర స్త్రీలు అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకున్నారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న బొబ్బిలి రాణి తాండ్ర పాపారాయుడికి స్వయానా సోదరి. బొబ్బిలి పతనం తెలుసుకున్న తాండ్ర పాపయ్య రాజాం నుంచి హుటాహుటిన బొబ్బిలి వెళ్లి అక్కడ విజయరామరాజును చంపడం కూడా చారిత్రక ప్రసిద్ధమే. బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు నివసించిన వీరగెడ్డ రాజాం ప్రాంతంలో రాజుల తీపిగురుతులు నేటికీ ఉన్నాయి.


'కోట'లో కోర్టు:
నాడు తాండ్ర పాపారాయుడు కొలువున్న రాజాంలోని కోటలో ఇటీవల కాలం వరకు జూనియర్‌, సీనియర్‌ న్యాయస్థానాలు నిర్వహించేవారు. నేటికీ కోర్టులో దసరా ఉత్సవాలను చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాండ్ర కొలువున్న రోజుల్లో కోటను కాపాడే శక్తిని కోటదుర్గ అనేవారని, ఈ కోటలో భేతాళుడు ఉన్నాడని పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ కోటకు వెళ్లే మార్గంలో రెండువైపులా రెండు ఫిరంగుల గొట్టాలున్నాయి. కోటచుట్టూ పెద్ద కందకం ఉండేదని వృద్ధులు చెబుతారు. ప్రస్తుతం బస్టాండ్‌గా వినియోగిస్తున్న మల్లమ్మచెరువును ఆనుకుని ఉన్న గుర్రమ్మచెరువులో గుర్రాలు నీళ్లు తాగేవని చారిత్రక ఆధారాలున్నాయి. కోట నుంచి చిన్నచెరువు వరకు సొరంగమార్గం ఉండేదని, ఆ మార్గంపైనే నేడు మాధవబజార్‌ రహదారి నిర్మితమైందని ప్రచారం ఉంది. కోటలోని స్త్రీలు సొరంగమార్గం ద్వారా చిన్నచెరువులోకి వెళ్లి స్నానాలు చేసేవారని వృద్ధతరం చెబుతుంటుంది.


ఠాణాలో తహశీల్దారు కార్యాలయం:


తాండ్ర పాపారాయుడు రాజాంలో ఉన్నకాలంలో ఠాణా నిర్వహించిన భవనంలో ప్రస్తుతం తహశీల్దారు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఆనాటి జైలుగదిలో ప్రస్తుతం రికార్డులు భద్రపరుస్తున్నారు. తాండ్రపాపారాయుడు మెడలో ధరించే గొలుసు తహశీల్దారు కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగానే ఉంది.


ఏకాంత సీతారామాలయం:


బొబ్బిలిరాజులు ఈ ప్రాంతానికి వచ్చినపుడు దైవదర్శనం చేసుకునేందుకు వీలుగా సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో ఏకాంత సీతారామాలయాన్ని నిర్మించారు. ధనుస్సు, విల్లంబులు లేకుండా ఏకశిలపై సీతారామలక్ష్మణులున్న ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయ నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను బొబ్బిలి రాజులు సమకూర్చారు. ఆ భూములన్నీ ఇపుడు అన్యాక్రాంతమయ్యాయి.
ఇవన్నీ గురుతులే..
ప్రస్తుతం జి.సి. క్లబ్‌గా ఉన్న భవనం బొబ్బిలి రాజులు సమకూర్చినదే. ప్రస్తుతం సామాజిక ఆస్పత్రి నిర్మించిన ప్రాంతంలో తాండ్ర హయాంలో గుర్రాలు, ఏనుగుల స్థావరంగా ఉండేది. బొబ్బిలి రాజులు ఈ ప్రాంతంలో ఎస్టేట్లను చూసేందుకు వచ్చినపుడు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉంగరాడ, జి.ఎస్‌.పురం గ్రామాల్లో విశ్రాంతి భవనాలు నిర్మించారు. పాపారాయుడు లేకపోవడం వల్ల బొబ్బిలి పాడైందని చరిత్ర చెబుతుండగా, ఆయన స్థావరంగా ఉన్న రాజాం చరిత్రపుటలకెక్కింది.