ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు*


అమరావతి


*ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు*
*సత్వర ఫలాలిచ్చే వాటిపై మొదటి దృష్టి*
*అత్యవసరమైన కొత్త ప్రాజెక్టులపైనా ముందడుగు*
*ఈ మేరకు కేటాయింపులు* 
*అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*కృష్ణా వరదజలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు 40 రోజుల్లో నిండాలి*
*ఆమేరకు కాల్వల సామర్థ్యం పెంచాలి*
*ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశం*


అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అలాగే పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, అత్యవసరంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వాటిని పూర్తిచేయడానికి ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అధికశాతం ప్రజలు వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నవారేనని, దీనికోసం అందరికీ సాగునీరు, అలాగే ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. కష్టాలు ఎన్నిఉనప్పటికీ సాగునీటిప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో, సకాలంలో పూర్తిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆమేరకు సమీకరించుకున్న ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే కృష్ణా వరదజలాలపై ఆధారపడ్డ రిజర్వాయర్లను 40 రోజుల్లో నింపడానికి చర్యలను తీసుకోవాలని, దీనికోసం చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 


సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మంత్రి అనిల్‌కుమార్‌ సహా ఉన్నతాధికారులు, చీఫ్‌ ఇంజినీర్లు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టాలు, రిజర్వాయర్ల పరిస్థితులను సీఎంకు వివరించారు. జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనులు, పెండింగులో ఉన్నపనులపైనా ముఖ్యమంత్రికి నివేదించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా సీఎం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇన్నిరోజులు వరద వచ్చినా కొన్ని రిజర్వాయర్లు నిండకపోవడంపై సీఎం అధికారులను లోతుగా ప్రశ్నించారు.
ప్రస్తుతం నడుస్తున్నవే కాకుండా అత్యవసరమై కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆ మేరకు అంచనాలను తనకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిధుల వినియోగంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, నిర్దేశించుకున్న ప్రాధాన్య ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసుకుని, ఖర్చుకు తగ్గ ఫలితాలు వచ్చేలా చూసుకోవాలన్నారు. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. 


*ప్రాజెక్టుల వారీగా సమీక్ష* :


* శ్రీకాకుళం జిల్లా హిరమండలం రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 19.3 టీఎంసీలుకాగా, ప్రస్తుతం నిల్వచేసిన నీరు  5.61 టీఎంసీలు మాత్రమేనని అధికారులు వివరించారు. కాల్వపనులు మిగిలిపోయి ఉన్నాయని,  2020 జూన్‌కు పూర్తిచేస్తామని అ«ధికారులు సీఎంకు చెప్పారు. 
8వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో నేరడి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీపై విస్తృతంగా చర్చించారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలు, కోర్టు తీర్పుల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి తగిన కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


* తూర్పుగోదావరి జిల్లా ముసురుమల్లి ప్రాజెక్టుకు మార్చినాటికి గేట్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పగా, ఆ పనులు త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. 


* నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాల్వ సామర్థ్యాన్ని పెంచి, నీటిని తరలించే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. కంభం ట్యాంకుకు కూడా వెలిగొండ నుంచి నీటిని తరలించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. గుండ్లకమ్మ కాల్వ పెండింగ్‌ పనులు పూర్తిచేయాలన్నారు.


* సోమశిల రిజర్వాయర్‌కు సంబంధించి పెండింగులో ఉన్న ఆర్‌ అండ్‌ ఆర్‌ను వెంటనే పంపిణీచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమశిల పూర్తిస్థాయి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా, కొన్ని గ్రామాలకు ముంపు వల్ల ఇప్పటికి 72.36 టీఎంసీలు నింపగలిగామని అధికారులు చెప్పిన నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. 
కండలేరు పూర్తిస్థాయి నిల్వ 68.03 టీఎంసీలు అయితే ఇప్పటికి 32.30 టీఎంసీలు నింపామని అధికారులు సీఎంకు తెలియజేశారు. సోమశిల నుంచి కండలేరుకు సమాంతరంగా మరో కాల్వ తవ్వకంపై ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. 
కనిగిరి రిజర్వాయర్‌ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వాలన్న స్థానిక ప్రజాప్రతినినిధుల విజ్ఞప్తిపై సమావేశంలో సీఎం సానుకూలంగా స్పందించారు. 


* ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనికి కారణాలపై పలుమార్లు అధికారులను ప్రశ్నించారు. చిత్రావతి, బ్రహ్మంసాగర్‌లు పూర్తిగా నిండకపోవడాన్ని ప్రస్తావించారు. ఇన్నిరోజులు వరదజలాలు వచ్చినా నిండకపోవడం సరికాదన్నారు. కాల్వల సామర్థ్యం తక్కువగా ఉందని, అక్కడక్కడా ఆశించినంతమేర నీరు పోవడంలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఆ మేరకు కాల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు వరద జలాలను తరలిస్తున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పత్తికొండ రిజర్వాయర్‌కు సంబంధించి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అక్కడ రిటైనింగ్‌వాల్‌ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. 



* తిరుపతి సమీపంలోని కళ్యాణి డ్యాం, ఎన్టీఆర్‌ జలాశయం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నింపడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. గోరకల్లు రిజర్వాయర్‌ పూర్తిసామర్థ్యం 12.44 టీఎంసీలుకాగా ప్రస్తుతం 9 టీఎంసీలు మాత్రమే నింపామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పూర్తిస్థాయిలో నింపడానికి అటవీ అనుమతులు కావాలని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 


* అవుకు రిజర్వాయర్‌కు సంబంధించి కూడా అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, 4.15టీఎంసీలకు 3.3 టీఎంసీలు మాత్రమే నింపగలుగుతున్నామని అధికారులు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోమని ఆదేశించారు. అలగనూరు రిజర్వాయర్‌లో కుంగిపోయిన గట్టు పనులను నవంబర్‌ నాటికి పూర్తిచేస్తామని సమావేశంలో వెల్లడించారు. 


* ఎస్పీవీబీఆర్‌కు తెలుగు గంగ నుంచి 5వేల క్యూసెక్కులకు బదులు కేవలం 1300 నుంచి 2000 వేల క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని అధికారులు వెల్లడించగా, దీనికి పరిష్కారంకోసం ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం సూచించారు. 


* వెలిగొండ, గండికోట, సీబీఆర్‌ ప్రాజెక్టుల్లో మిగిలిపోయి ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను వెంటనే పూర్తిచేసి, ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నింపడానికి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 


* పీఏబీఆర్‌లో 11.10 టీఎంసీలకు కేవలం 2.62 టీఎంసీలు మాత్రమే నింపడమేంటని సీఎం అధికారులను ప్రశ్నించారు. సీపేజీ కారణంగా పూర్తిగా నింపలేకపోతున్నామని, గ్రౌటింగ్‌ పనులు చేస్తున్నామని, వెంటనే పూర్తిచేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి నీటిని సప్లిమెంట్‌ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పగా, ప్రతిపాదనలు చేయాలని సీఎం అన్నారు. అలాగే భైరవానితిప్పకూడా హంద్రీనీవా జలాలు అందించడంపై ప్రతిపాదనలు తయారుచేయాలని, తుంగభద్ర కెనాల్‌ ఆధునీకరణ పనులు పూర్తిపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు.