రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి 20కి పెంచారు

దసరా పండుగ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచుతూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధర రూ.10 నుంచి 20కి పెంచారు. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చి 11వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు సెండాఫ్ ఇచ్చేందుకు స్టేషన్లకు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీని నివారించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐతే ఈ నిర్ణయం నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్లలో మాత్రమే అమలవుతుందని మిగతా స్టేషన్లలో యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు.